breaking news
Kidney counseling
-
కిడ్నీ కౌన్సెలింగ్
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత జాగ్రత్తలేమిటి? నాకు 49 ఏళ్లు. ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – రామ్‌ప్రసాద్, మహబూబాబాద్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కిడ్నీ పనిచేయడం లేదంటున్నారు... లక్షణాలేమీ కనిపించడం లేదు నా వయసు 64 ఏళ్లు. రెండేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. నిరుడు రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్ 6 మి.గ్రా., యూరియా 120 మి.గ్రా. వచ్చింది. నా కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని చెబుతున్నారు. కానీ నాకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ కనిపించడం లేదు. బయటకు ఏ లక్షణాలూ కనిపించకుండానే లోపల్లోపల ఏమైనా సమస్యలు ఉంటాయా? నా పరిస్థితి ఏమిటి? దయచేసి వివరించండి. – బి. రాంబాబు, అనకాపల్లి మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీ రెండు కిడ్నీల పనితీరు దాదాపు 50 శాతం తగ్గినట్లు భావించవచ్చు. కొందరిలో వ్యాధి లక్షణాలూ కనిపించకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం తగ్గినప్పుడు సమస్యలు తెలుస్తాయి. అందుకే మీలాంటి వారు ఏడాదికోసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారు, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లకు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివాళ్లు ఏటా... ఒకసారి కిడ్నీ ఎంత శాతం పనిచేస్తోందో తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా కిడ్నీలను కాపాడుకునే వీలుంటుంది. మూత్రం ఎర్రగా వస్తోంది... ఏదైనా సమస్యా? నా వయసు 34 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – ఎల్. గౌతమ్, విజయవాడ మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ý కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డయాలసిస్ వారానికి రెండుసార్లు సరిపోదా? నా వయసు 48 ఏళ్లు. నేను ఏడాదిగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఒకటి లేదా రెండుసార్లు చేయించుకుంటే సరిపోదా? – లక్ష్మీనారాయణ, మెదక్ మీరు రాసిన వివరాల ప్రకారం చూస్తే మీ కిడ్నీ పది నుంచి పదిహేను శాతం వరకు పనిచేస్తోందని అనుకోవచ్చు. ఈ దశలో మీరు తప్పనిసరిగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిందే. ఒకవేళ మీరు అలా చేయించుకోకపోతే దాని దుష్ప్రభావం ఇతర అవయవాల మీద పడే అవకాశం ఉంది. ఆ దుష్పరిణామాలతో గుండెకు కూడా సమస్యలు వచ్చే అవకాశముంది. అంతేకాదు మీ జీవననాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిందే. నేను బీపీకి మందులు వాడక తప్పదా? నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? – రామ్మోహన్, జగిత్యాల మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, సీనియర్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అరుణ్ జైట్లీకి అనారోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ(65) మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ఆయన పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సమస్య గురించి పూర్తిగా వివరించకుండా.. ‘కిడ్నీ సంబంధిత సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను. భవిష్యత్ చికిత్సను డాక్టర్లు నిర్ధారిస్తారు’ అని మాత్రమే జైట్లీ ట్వీట్ చేశారు. అయితే, జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స జరగనుందని ఎయిమ్స్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కిడ్నీ దాతకు సంబంధించిన విధి, విధానాలు కూడా పూర్తయ్యాయని తెలిపాయి. డాక్టర్ల సలహాతో త్వరలో జైట్లీ ఎయిమ్స్‌లో కొత్తగా నిర్మించిన అత్యాధునిక కార్డియో–న్యూరో టవర్‌లో అడ్మిట్ అయ్యే అవకాశం ఉంది. జైట్లీ కుటుంబానికి సన్నిహితుడైన ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోదరుడు, అపోలో ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సందీప్ గులేరియా జైట్లీకి ఆ ఆపరేషన్ చేస్తారని తెలిసింది. 2014లో ఎన్డీయే అధికారం చేపట్టిన తర్వాత బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడమే ప్రస్తుత సమస్యకు కారణమై ఉండొచ్చని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాక్స్ ఆసుపత్రిలో ఆ సర్జరీ జరిగినప్పటికీ.. ఆపరేషన్ అనంతరం పలు సమస్యలు రావడంతో అప్పట్లోనే ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందారు. జైట్లీ చాన్నాళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు గుండె ఆపరేషన్ కూడా జరిగింది. జైట్లీ ఈ సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు. ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జైట్లీ.. అనారోగ్యం కారణంగా ఏప్రిల్ 2న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమానికీ హాజరుకాలేదు. లండన్‌లో ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనాల్సిన ఆయన, ఆ పర్యటనను కూడా రద్దుచేసుకున్నారు. -
కాళ్ల వాపులు కిడ్నీ సమస్య వల్లనేనా?
కిడ్నీ కౌన్సెలింగ్ నాకు 67 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా? - ఎన్. రవిందర్ రావు, నిడదవోలు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మూత్రంలో ప్రోటీన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పి నివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నాకు 48 ఏళ్లు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - స్వామి, కోదాడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ తర్వాత కూడా శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. - డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్