సమర అమ్మాళ్‌

Janaki Ammal Communist Party leader janakamma story  - Sakshi

భారత స్వాతంత్య్ర సంగ్రామ ధీరవనిత.. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన నాయిక.. దక్షిణ భారతంలో అరెస్టయిన తొలి మహిళ.. తొలి రోజుల్లో.. నాటకరంగ కళాకారిణి. తర్వాత.. సమర యోధురాలు.. జానకీ అమ్మాళ్‌! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమ్మాళ్‌ పునఃపరిచయం ఇది.


(డెమొక్రటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో జానకి అమ్మాళ్‌ (మధ్యలో))
జానకి అమ్మాళ్‌ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) నాయకురాలు, డెమొక్రాటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు. (తమిళనాడులో ప్రారంభమైన ఈ సమాఖ్య ఆల్‌ ఇండియా డెమొక్రాటిక్‌ ఉమెన్స్‌ అసోసియేషన్‌– ఐద్వా స్థాపన తర్వాత అందులో విలీనమైంది) తమిళనాడు 1967 సార్వత్రిక ఎన్నికల్లో మదురై (ఈస్ట్‌) నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారామె. రంగస్థలం మీద గాయనిగా మొదలైన ఆమె ప్రస్థానం అనతికాలంలోనే ప్రధాన నాయిక పాత్రలోకి మారింది. రంగస్థలం నుంచే జాతీయపోరాటాన్ని ప్రారంభించారు జానకి అమ్మాళ్‌. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పడానికి రంగస్థలాన్నే ఆమె వేదిక గా చేసుకున్నారు.

వేదిక మీద భారతమాత కీర్తిప్రతిష్ఠలను ఎలుగెత్తి పాడారు. వలస పాలనలో మగ్గుతున్న భారతావని కడగండ్లను రాగయుక్తంగా ఆలపించారు.. శ్రోతల నరాల్లో రక్తం ఉడికిపోయేట్లుంది ఆమె గానం. జనంలో ఉద్రేకం.. కట్టలు తెగడానికి సిద్ధంగా ఉండేది. అప్పుడు అరెస్టు చేశారామెని.. బ్రిటిష్‌ ఆదేశాలతో ఉద్యోగం చేస్తున్న దేశీయ పోలీసులు. ఒక ఏడాది పాటు ఆమె ఆచూకీ తెలియదెవ్వరికీ. జైలు నుంచి విడుదలైన తర్వాత మునుపటి పౌరుషం, జాతీయతాభావం అడుగంటి పోయి ఉంటాయనుకున్నారు పాలకులు. అదే జరిగి ఉంటే... జానకి అమ్మాళ్‌కి చరిత్రలో ఇన్ని పేజీలు ఉండేవి కాదేమో!

జానకి అమ్మాళ్‌ 1917లో మదురైలో పుట్టారు. పద్మనాభన్, లక్ష్మి ఆమె తల్లిదండ్రులు. ఎనిమిదేళ్ల వయసులో తల్లిపోయింది. అమ్మమ్మ పెంపకంలో ఎనిమిదవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. సంగీత సాధన కొనసాగించి, పన్నెండేళ్ల వయసులో పళనియప్ప పిళ్లై బాయ్స్‌ నాటక కంపెనీలో నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు. కొద్దికాలంలోనే కథానాయిక పాత్రల స్థాయికి చేరారు. ఆమె వేతనం కూడా నెలకు మూడు వందల రూపాయలకు చేరింది. ఆమెను ఎవరూ చేయి పట్టుకుని నడిపించలేదు. కానీ ఆమె జీవితంలో ప్రతి అడుగూ విప్లవాత్మకమైనదే అయింది.

అప్పటి సమాజంలో అంటరానితనం బలంగా వేళ్లూనుకుని ఉండేది. ఆ సమయంలో కులమతాలకతీతంగా సమసమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించారు జానకమ్మ. తమ నాటక కంపెనీలో కథానాయకుడి పాత్రలో విశ్వనాథదాస్‌తో కలిసి నటించడానికి సహ నటీమణులు ఇష్టపడని సందర్భంలో జానకమ్మ ముందుకు వచ్చారు.  వారిద్దరి కాంబినేషన్‌తో అనేక సాంఘిక నాటకాలు ఆదరణ పొందాయి. జాతీయోద్యమ భావనను పెంచేవిధంగా సాగిన నాటకాల్లో ఆమె దేశభక్తి గేయాలు ఆలపించేవారు. అలా రంగస్థలం మీద దేశభక్తి గీతం పాడుతున్న సమయంలోనే ఆమెను అరెస్టు చేశారు. తిరునల్వేలిలో 1930లో అరెస్టయినప్పుడు ఆమె ఏడాది పాటు జైల్లో గడిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరుచ్చిలో యాంటీ వార్‌ ప్రాపగాండ చేస్తోందన్న కారణంగా(డిఫెన్స్‌ ఆఫ్‌ ఇండియా రూల్స్‌ నిబంధనల ప్రకారం) మరోసారి అరెస్టు చేశారు.

పోరాటమూ స్వతంత్రమే
సత్యాగ్రహ ఉద్యమంలో ఆమె స్వతంత్రంగా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ఆమె వంతుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు జానకమ్మ. ఆమె చొరవ ఉద్యమానికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారామెను. అలా మదురై కాంగ్రెస్‌ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారామె. కొంతకాలానికే ఆమె కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీలోకి మారిపోయారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మదురై సందర్శించిన సందర్భంగా ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ను సమర్థంగా నిర్వహించారామె. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేసిన విమర్శలను కూడా అంతే హుందాగా స్వీకరించారు జానకమ్మ. ఆ తర్వాత కొన్నాళ్లకే... 1940లోనే కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరిపోయారు. కమ్యూనిస్ట్‌ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు జానకి అమ్మాళ్‌ మార్క్సిస్టు పార్టీతో పనిచేశారు.

జానకమ్మ పార్టీ
జానకమ్మ కాలి నడకన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేవారు. అనేక మందిని ఉద్యమం వైపు నడిపించారు కూడా. జాతీయోద్యమం ఇతివృత్తంతో పాటలు రాసుకునేవారు. భర్త గురుస్వామి (ఆయన హార్మోనియం వాయిద్యకారుడు) సహకారంతో మ్యూజిక్‌ కంపోజ్‌ చేసుకుని స్టేజి మీద పాడేవారు. ఆమె ప్రభావం ఆ పార్టీ మీద ఎంతగా ఉండేదంటే... తమిళనాడులోని తువారిమన్, శోలవందన్, తిరుమంగళం పరిసరగ్రామాల్లో కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అని చెప్పడానికి ‘జానకి అమ్మ కచ్చి (జానకమ్మ పార్టీ)’ అనే చెప్పుకునేవారు.

సగం చేవ చచ్చిపోతే...
మహిళలు ఇల్లు వదిలి బయటకు రాని రోజుల్లో... ఆమె, ‘వలస పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి సమాజంలో సగభాగం అయిన మహిళలు చేవలేక చూస్తూ ఉంటే కుదరద’ని చెప్పి చైతన్యపరిచారు. ఆమె ప్రసంగాల్లో మహిళల సాధికారత, మహిళల స్వయంప్రతిపత్తి, లింగ వివక్షలేని సమానత్వంతో కూడిన సమాజ సాధన, పరిశ్రమల్లో పని చేసే కార్మికుల హక్కులు, వారి ప్రయోజనాలు, అసంఘటిత రంగంలోని శ్రామికుల శ్రేయస్సు ప్రధానాంశాలుగా ఉండేవి.

ఆమె ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు తర్వాతి కాలంలో మంచి హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారని ఆమె స్నేహితురాలు నాగమ్మాళ్‌ చెప్పేవారు. జానకమ్మ స్వీయ క్రమశిక్షణ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేవారో, అంతే సున్నితమనస్కురాలు కూడా. ‘ఎమర్జెన్సీ సమయంలో పార్టీ కేడర్‌ పడుతున్న కష్టాలు చూసి తన నగలన్నీ అమ్మేసి వారిని కాపాడుకున్నారు. ఆ డబ్బు ఖర్చయిపోయిన తర్వాత పట్టు చీరలు అమ్మేయాల్సి వచ్చింది. ఖరీదైన ఆమె పట్టు చీరలకున్న జరీలో బంగారు, వెండి ఉండేది. జరీ అంచులను కాల్చి బంగారు చేసి అమ్మి రోజులు గడిపాం’ అని గుర్తుచేసుకున్నారు జానకమ్మ స్నేహితురాలు నాగమ్మాళ్‌.

పెట్టే చెయ్యే కానీ...
జానకమ్మ ఒకరికి పెట్టడమే కానీ ఎవరి నుంచి ఏమీ ఆశించే తత్వం కాదు. నాగమ్మాళ్‌ పెళ్లి కోసం జానకమ్మ తన ఖరీదైన పట్టుచీరను రెండో ఆలోచన లేకుండా ఇచ్చేసిన వైనాన్ని చెప్పుకుంటారు ఆమె స్నేహితులు. ఆమె తన పట్టుచీరలన్నింటినీ ఒక్కో సందర్భంలో ఒక్కో మంచి పని కోసం ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత ఆమె పట్టుచీరలను కొనుక్కోలేదు. నూలు చీరల్లో నిరాడంబరంగా జీవించారు. ఎవరు బహుమతులిచ్చినా స్వీకరించేవారు కాదు.

స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ కూడా తీసుకోలేదామె. తన మీద అభిమానంతో కలిసిన వారిని ఆమె ఒక్కటే కోరేవారు. ‘తాను పోయిన తర్వాత  అంత్యక్రియలను కమ్యూనిస్టు పార్టీ వాళ్లందరూ కలిసి చేయ’మని అడిగేవారు. ఆమె చివరి రోజుల్లో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫీస్‌లోనే గడిపారు. తిరునగర్‌లో నివసిస్తున్న కూతురు, అల్లుడు తమతోపాటు ఉండమని ఎంత కోరుకున్నా జానకమ్మ పార్టీ ఆఫీస్‌లో ఉండటానికే ఇష్టపడేవారు. దాంతో ఆఫీస్‌లోనే ఆమె కోసం ఒక గదిని కేటాయించారు. ఆస్త్మాతో బాధపడుతూ 1992, మార్చి ఒకటవ తేదీన చివరి శ్వాస తీసుకున్నారు.

రంగస్థలం వేదికగా మొదలైన జాతీయోద్యమ స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించారామె. సామాన్యుని హక్కుల కోసం పోరాటంలోనే జీవితాన్ని గడిపారు. అరెస్టులు,  జైలు జీవితం ఆమెను ఏనాడూ భయపెట్టలేదు. కులమతాలు, స్త్రీ–పురుష వివక్షను తీవ్రంగా వ్యతిరేకించే జానకమ్మ సిద్ధాంతం, మనిషిని మనిషిగా స్వీకరించాలనే ఆమె తత్వం... చివరి వరకు అలాగే కొనసాగాయి. అవి తరువాతి తరానికి ఆమె వదిలిన పాదముద్రలు.

జాతీయోద్యమంలో పాల్గొన్న జానకమ్మ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోలేదు. స్వతంత్ర భారతదేశంలో ఆమె ప్రజాసమస్యల మీద ఉద్యమించారు, అనేక దఫాలు అరెస్టయ్యారు కూడా. ఆమెలో స్త్రీశక్తిని చూసిన వాళ్లున్నారు. స్నేహమూర్తిని చూసినవాళ్లున్నారు. ఆత్మీయతను పంచే తల్లిని చూసిన వాళ్లూ ఉన్నారు. జానకమ్మలో... శ్రామికుల తరఫున పోరాడేటప్పుడు అకుంఠిత దీక్షతో పని చేసే శక్తిస్వరూపిణి కనిపించేది.

వారి హక్కుల కోసం అధికారులతో చర్చించేటప్పుడు ఆమెలో అపర మేధావి కనిపించేది. జానకమ్మను అమితంగా ఇష్టపడిన వాళ్లు... ఆమె మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం ‘జానకి అమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించారు. ఆ ట్రస్ట్‌ మహిళాశిశు అభివృద్ధి కోసం పని చేస్తోంది. ఆడశిశువును పుట్టగానే చంపేయడం, కడుపులోనే చంపేయడం అనే దురాలోచనను తుడిచిపెట్టాలన్న సదుద్దేశంతో పనిచేస్తోంది జానకి అమ్మ మెమోరియల్‌ ట్రస్ట్‌.

– మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top