Sakshi News home page

ఐ వాచ్ ఎలా ఉంటుందంటే...!

Published Wed, Jul 16 2014 11:45 PM

ఐ వాచ్ ఎలా ఉంటుందంటే...! - Sakshi

ఈ ప్రపంచంలో ‘ఐ ఫోన్ వాడకం దార్లు’అనే ప్రత్యేకమైన తరగతిని సృష్టించిన సంస్థ యాపిల్. ఐఫోన్ వాడటం అనేది ఒక హోదా. ఒక డిగ్నిటీ. ఒక మనస్తత్వం. మరి మార్కెట్‌లో ఇలాంటి గుర్తింపును సంపాదించుకొన్న యాపిల్ కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌తో పలకరించబోతోంది. మొబైల్‌ను స్మార్ట్‌ఫోన్‌గా మార్చేసి, ఇప్పుడు వాచ్‌ను కూడా మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దడానికి రెడీ అయ్యింది.
 
దాదాపు ఏడాది నుంచి మార్కెట్‌లో స్మార్ట్‌వాచ్‌లు సందడి చేస్తున్నాయి. శామ్‌సంగ్ గెలాక్సీ గేర్, సోనీ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే అందుబాటులో ఉన్న వీటి కన్నా, యాపిల్ కంపెనీ రూపొందిస్తున్నానని ప్రకటించిన స్మార్ట్‌వాచ్ గురించే జనాలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
 
ఇప్పటివరకూ ఈ స్మార్ట్‌వాచ్ గురించి కానీ, దాని కాన్సెప్ట్ గురించి గానీ యాపిల్ కంపెనీ అధికారికంగా స్పందించింది లేదు. యాపిల్ ఉద్యోగులు కూడా ఆఫ్ ది రికార్డ్‌గా స్మార్ట్‌వాచ్ గురించి మాట్లాడింది లేదు. వాళ్లంతా చాలా గుంభనంగా పనిచేసుకొంటూ వెళుతున్నారు. వాళ్ల గోప్యతను చూస్తే అసలు ఐ స్మార్ట్‌వాచ్ రూపొందుతోందా! లేదా! అనే సందేహం కూడా వచ్చింది. అయితే యాపిల్ సీఈవో టీమ్‌కుక్ స్మార్ట్‌వాచ్‌ను ధ్రువీకరించాడు. ఈ యేడాది చివరకల్లా అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనేది ఆయన మాటల సారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు!
 
వార్తాసంస్థ ‘రాయిటర్స్’ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఐవాచ్‌కు సంబంధించి డిజైన్ దాదాపు పూర్తి అయ్యింది. వచ్చే నెల నుంచి తైవాన్‌లో వీటి ప్రొడక్షన్ మొదలుకానుంది. అక్టోబర్ కళ్లా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
 
దీర్ఘచతురస్రాకారంలో ఉండే డిస్‌ప్లే 2.5 ఇంచెస్ డయాగ్నల్(కర్ణం)తో ఉంటుందనేది ఊహాగానం.
     
ఐ వాచ్‌కు వైర్‌లెస్‌చార్జింగ్‌కు సదుపాయం ఉంటుంది.
     
ఈ వేరబుల్ టెక్నాలజీ విషయంలో యాపిల్ కంపెనీ నైక్ సహకారం కూడా తీసుకొందని తెలుస్తోంది.
     
ధర విషయంలో మాత్రం ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ లేదు. మరి ధర విషయంలో అంచనాలను పరిశీలించినట్లైతే.. లైట్ వెయిల్ స్మార్ట్ వాచ్ ధర ప్రస్తుతం దాదాపు 150 పౌండ్లు ఉంటుంది. సెప్టెంబర్‌లో విడుదల కానున్న సోనీ స్మార్ట్ వాచ్-2 కూడా దాదాపు ఇదే ధరలో అందుబాటులోకి రానుంది.
 అయితే ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్ ధర స్థాయి ఎక్కువే. మరి ఈ రకంగా అంచనా వేస్తే యాపిల్ స్మార్ట్ వాచ్ ధర 180 పౌండ్ల నుంచి 220 పౌండ్ల వరకూ ఉండవచ్చు.
     
ఇక యాపిల్ కంపెనీలో ఎలాంటి రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయి. ఎవరిని హైర్ చేస్తోంది... వంటి అంశాలను బట్టి కూడా స్మార్ట్ వాచ్ గురించి అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
 

Advertisement
Advertisement