ప్రేమను బతికించుకోగలిగితే..? | Sakshi
Sakshi News home page

ప్రేమను బతికించుకోగలిగితే..?

Published Thu, Mar 31 2016 8:27 PM

ప్రేమను బతికించుకోగలిగితే..?

 హాలీవుడ్ సినిమా / ఇఫ్ ఓన్లీ
గడచిన క్షణం తిరిగి రాదు. జీవితంలో రివైండ్లు, రీటేకులు ఉండవు. ప్రతి మూమెంట్‌ని వీలైనంత ఆస్వాదించగలగాలి. ఉమర్ ఖయ్యూమ్ తన రుబాయితుల్లో గోలపెట్టి చెప్పింది - అదే. ఎంత ప్రేమించి, పెళ్లి చేసుకున్నవాళ్లు అయినా - పని ఒత్తిళ్లలో పడి, తమ భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తుంటారు. కోరుకోకుండానే ప్రేమ రాహిత్యానికి లోనవుతుంటారు. కాని చేసిన తప్పులు సరిదిద్దుకోగలిగితే..?

 ఇయాన్ ఓ బిజినెస్‌మ్యాన్. అతని గర్ల్‌ఫ్రెండ్ సమంతా ఆండ్రూస్ మ్యూజిషియన్. సమంతాతో సహజీవనం గడుపుతుంటాడు ఇయాన్. వారి ఒకరోజు జీవితమే 2004లో వచ్చిన ‘ఇఫ్ ఓన్లీ’ సినిమా. ఒకరోజు ఇయాన్ లేవగానే - వంటగదిలో సమంతాకి చేయి కాలుతుంది. చేతిలోని కోక్ టిన్ పగిలిపోతుంది. ఆఫీస్‌లో ఓ ముఖ్యమైన సమావేశంలో ఉండగా - సమంతా వచ్చి ఇయాన్‌ని డిస్ట్రబ్ చేస్తుంది. తనని పట్టించుకోవడం లేదని నిందిస్తుంటుంది. ఇదివరకటిలాగే తనని ప్రేమించమని అడుగుతుంది. ఆవేశంలో మాటా మాటా పెరిగి సమంతా ట్యాక్సీలో బయల్దేరుతుంది. ఆ ట్యాక్సీ డ్రైవర్ వృద్ధుడు చాలా విలక్షణంగా కనబడుతుంటాడు. ట్యాక్సీలో డిజిటల్ క్లాక్ ఓ టైమ్ చూపిస్తుంటుంది. అదే సమయంలో ఘోర ప్రమాదం జరిగి, సమంతా చనిపోతుంది.

ఆ బాధతో ఇంటికొచ్చిన ఇయాన్‌కి సమంతా రాసుకున్న మ్యూజికల్ నోట్స్ కనబడుతుంది. తన సంగీత కచేరీ చేయడానికి రాసుకున్న నోట్స్ అది. తన ప్రియురాలి చిన్న చిన్న కోరికలు తీర్చలేకపోయినందుకు, ఆమెని శాశ్వతంగా దూరం చేసుకున్నందుకు బాధతో విలవిలలాడుతుంటాడు. ఇయాన్ నిద్రలోకి జారుకుంటాడు. మెలకువ వచ్చేటప్పటికి సమంతా బతికే ఉంటుంది. మొదట భయపడ్డా, అంతకుముందు జరిగినదంతా కల అని ఓ నిర్ణయానికొస్తాడు.

 ఆ కలలో లాగానే - సమంతా చేయి కాలిపోతుంది - కోక్ టిన్ పగిలిపోతుంది. ఇయాన్‌లో టెన్షన్ ప్రారంభమవుతుంది. కలలో లాగే సమంత చనిపోతుందా అనే భయం. అందుకే ప్రతిక్షణం అపురూపం అతనికి. ఇయాన్ సమంతాని లండన్ సమీపంలోని తన పల్లెటూరికి తీసుకెళ్తాడు. ప్రకృతి అందాల మధ్య తమ ప్రేమని తల్చుకుంటారు. తిరిగి లండన్ తీసుకొచ్చాక ‘లండన్ ఐ (అతి పెద్ద జెయింట్ వీల్)’ ఎక్కేస్తాడు ఇయాన్. ఆ తర్వాత సమంతా సంగీత కచేరికి హాజరవుతాడు. ఇయాన్‌తో పాటు సభికులంతా సమంతా ప్రావీణ్యాన్ని అభినందిస్తారు. ఆ రోజంతా చాలా ఆనందంగా, ప్రతి క్షణమూ ప్రేమభరితంగా గడిచిపోయింది. ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు ఇయాన్, శామ్. అద్భుతమైన బ్రాస్‌లెట్ కానుకగా ఇచ్చాడు.

తెలుగులో ‘ఇఫ్ ఓన్లీ’ స్ఫూర్తితో ఆ మధ్యకాలంలో రెండు సినిమాలు వచ్చాయి. సుమంత్ ‘పౌరుడు’ సినిమా డెరైక్ట్ చేసిన రాజ్ ఆదిత్య 2009లో ‘మళ్లీ మళ్లీ’ అనే సినిమా తీశాడు.

ఉదయ్‌కిరణ్, శ్వేతాబసుప్రసాద్‌జంటగా ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ అనే సినిమా 2012లో వచ్చింది.

అయితే ‘మళ్లీ మళ్లీ’ చిత్ర దర్శకుడు రాజ్ ఆదిత్య (2009), ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా’ హీరో ఉదయ్‌కిరణ్ (2014) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం గొప్ప విషాదం.

హిందీలో 2008లో వచ్చిన ‘రుబారు’ కూడా ‘ఇఫ్ ఓన్లీ’ కాపీయే!

 

 బయటికొచ్చారు. కలలో వాళ్లు వచ్చిన రెస్టారెంట్ కూడా అదే. ట్యాక్సీ వచ్చింది. కలలో కనబడ్డ ట్యాక్సీ అదే. ట్యాక్సీ డ్రైవర్ కూడా అచ్చం అతనే. ఇయాన్‌లో టెన్షన్ ఎక్కువైంది. ఇద్దరూ ట్యాక్సీలో కూర్చున్నారు. ట్యాక్సీలో డిజిటల్ క్లాక్. కలలో ఏ టైమ్ చూపిస్తుందో - అదే సమయం చూపిస్తుంది. రాత్రి 11 గంటలు - ట్యాక్సీకి భయంకరమైన యాక్సిడెంట్.

 హాస్పిటల్‌లో శామ్ ఫ్రెండ్ పరుగెత్తుకుంటూ వచ్చేసరికి, శామ్ ఏడుస్తూ కనబడింది. యాక్సిడెంట్‌లో ఇయాన్ చచ్చిపోయాడు. అత్యంత విషాద భరితమైన ముగింపుతో సాగిన ఈ సున్నితమైన ప్రేమకథలో హీరో హీరోయిన్లూ - పాల్ నికోలస్, జెన్నిఫర్ హెవిట్ నటించారు. దర్శకుడు గిల్ జంగర్. క్రిస్టీనా వెల్ష్ రచయిత.

 ఒకటే జీవితం - ఏ క్షణాన జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదు. బతికినన్ని క్షణాలు మనల్ని ప్రేమించేవాళ్లని ఆనందపరుస్తూ, బాధ్యతలు నిర్వహించగలిగితే చాలు అని చెప్పిన గొప్ప కథ ‘ఇఫ్ ఓన్లీ’. ముఖ్యంగా ఒక రోజులో జరిగే సంఘటనలని - రెండు వెర్షన్‌లలో చెప్పడమనేది అద్భుతమైన స్క్రీన్‌ప్లే టెక్నిక్. ‘స్లైడింగ్ డోర్స్’, ‘రన్ లోలా రన్’ లాంటి సినిమాలు - ఈ స్క్రీన్‌ప్లే స్టయిల్‌లో చెప్పినవే.  - తోట ప్రసాద్

Advertisement
 
Advertisement
 
Advertisement