మన బులంద్‌ బెహన్‌

Fear the government job in the state - Sakshi

 పరిచయం  చంద్రకళ

ఉన్నతమైన ఆశయాలున్న గర్జనపల్లి చెల్లిసామాన్యమైన కుటుంబంలో పుట్టి...శిఖరాన్ని అధిరోహించిన కరీంనగర్‌ బిడ్డ.అసలు ‘బులంద్‌’ అంటేనే ఎల్తైన, ఉన్నతమైన అని అర్థం.మన తెలుగు బిడ్డ బానోత్‌ చంద్రకళ...యూపీలోని బులంద్‌ శహర్‌ని పాలించింది.ఆలోచన గొప్పదైనప్పుడు...ఆశయం ఉన్నతమైనదైనప్పుడు...లక్ష్యం ఎల్తైనదైనప్పుడు...కీర్తి... కిరీటమవుతుంది.బానోత్‌ చంద్రకళ, ఐఏఎస్‌... మన తెలుగింటి అమ్మాయి. కరీంనగర్‌ జిల్లాలో పుట్టింది. ఉత్తర ప్రదేశ్‌లో అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతోంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి మగవాళ్లు కూడా భయపడతారు. అలాంటిది 38 ఏళ్ల చంద్రకళ పదేళ్లు అక్కడ నెగ్గుకు వచ్చింది. అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వంలోనూ నిజాయితీ కలిగిన మంచి చురుకైన అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. యోగి ఆదిత్యనాథ్‌ హయాంలోనూ అదే గౌరవాన్ని అందుకుంది.  ఐఏఎస్‌ కావడానికి చంద్రకళ పుట్టిల్లు వడ్డించిన విస్తరేమీ కాదు. ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చిందామె. ఒక్కొక్క మెట్టునూ అధిరోహిస్తూ విజయాన్ని తన దగ్గరకు తెచ్చుకుంది.

సామాన్య కుటుంబం
కరీంనగర్‌ జిల్లా, ఎల్లారెడ్డి మండలం, గర్జన పల్లి గ్రామం ఆమెది. పెద్దగా సౌకర్యాల్లేని లంబాడా తండా అది. తండ్రి కిషన్‌ రామగుండం ఎరువుల కంపెనీలో ఫోర్‌మన్‌. మొత్తం నలుగురు పిల్లలు, అన్న రఘువీర్, తమ్ముడు మహావీర్, చెల్లెలు మీనా. చంద్రకళ తల్లి లక్ష్మికి పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనే కల ఉండేది. కానీ కోఠీ ఉమెన్స్‌ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేస్తుండగానే పెళ్లి చేశారు. పెళ్లి తరవాత డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్‌లో ఎం.ఏ పట్టా అందుకుంది. గ్రూప్‌ వన్‌ సర్వీసెస్‌ ప్రిపరేషన్‌ మొదలుపెట్టింది. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తరవాత ప్రతి అడుగునూ ఒక చాలెంజ్‌గానే వేసింది. ఒక సవాల్‌ని ఎదుర్కొంటున్నట్లు ప్రిపేరైంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలో టాపర్‌. సివిల్‌ సర్వీసెస్‌లో 2008లో 409వ ర్యాంకుతో ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌లో ఐఏఎస్‌ ఆఫీసర్‌గా నియామకం. లక్ష్మి నలుగురు పిల్లల్లో అత్యున్నత స్థాయికి చేరిన బిడ్డ చంద్రకళ. ఈ సంతోషం లక్ష్మికి మాత్రమే కాదు చుట్టుపక్కల అనేక లంబాడా తండాల జనం కలెక్టరయింది తమింటి బిడ్డే అన్నంతగా సంతోషించారు. ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బులంద్‌ శహర్, బిజౌర్‌ జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ హోదాలో పనిచేసింది. కలెక్టర్‌గా బాధ్యతల నిర్వహణలో రాజీ పడని అధికారిగా, హార్డ్‌ వర్కర్‌ అనే గుర్తింపు వచ్చిందామెకు.

ఆగని పయనం 
ప్రయాణానికి గమ్యం ఉండాలి, జీవితానికి లక్ష్యం ఉండాలి. గమ్యం లేని ప్రయాణానికి, లక్ష్యం లేని జీవితానికీ అర్థం ఉండదు. అందుకు చంద్రకళ ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లల్ని పెద్ద హోదాల్లో చూడాలనే తపన తప్ప ఏం చదివించాలో తెలియని అమాయకత్వం లక్ష్మిది. మార్గదర్శనం చేసేవాళ్లు లేకపోవడంతో కొంతకాలం తడబాట్లతో సాగింది చంద్రకళ పయనం. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే... లక్ష్యం అంటూ స్థిరంగా ఏర్పరుచుకోక ముందు కూడా ప్రయాణం ఆపలేదామె. తనకు ఇష్టమైన కోర్సులో కొనసాగింది. మెదడులో ఒకసారి కెరీర్‌ అనే బీజం పడిన తర్వాత ఇక వెనక్కి చూసుకోలేదు. అందరిలో ఒకరిగా కాదు, పదిమందిలో గౌరవం అందుకునే బాధ్యతాయుతమైన హోదాలో జీవించాలనే కోరిక ఆమె బుర్రలో పడిన తర్వాత ఆమెకు ఏదీ కష్టంగా అనిపించలేదు. గర్భిణిగా బిడ్డను మోస్తున్నప్పుడు కానీ, బిడ్డకు తల్లి అయిన తర్వాత కానీ ఆమె ప్రిపరేషన్‌లో విరామం తీసుకోలేదు.

మోదీ స్ఫూర్తితో...
సాధారణ పాలనాధికారాలు, బాధ్యతలతోపాటు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాల్లో స్వచ్ఛభారత్‌ను ప్రత్యేక శ్రద్ధతో నిర్వర్తిస్తోందామె. ఢిల్లీ నగరం దాటి ఉత్తరప్రదేశ్‌లో అడుగు పెట్టగానే సరిహద్దు దాటామనే సంగతి సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోకి వీధుల్లో రాజ్యమేలే చెత్త స్వాగతం పలుకుతుంటుంది. అలాంటి రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌ కోసం రోజుకు ఇరవై గంటలైనా పని చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రకళ స్వచ్ఛభారత్‌ ప్రోగ్రామ్‌ను వాడవాడలా అమలు చేయించడానికి కంకణం కట్టుకుంది. ఇంతలో ప్రధాని అధికార కార్యాలయం ఆమె సేవలను కోరుకుంది. చంద్రకళను డ్రింకింగ్‌ వాటర్‌ అండ్‌ శానిటేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం  ఆమెను డెప్యుటేషన్‌ మీద బదిలీ చేసింది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం శ్రమించే చంద్రకళ ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావించింది. 

సోషల్‌ మీడియాలో చురుకు
చంద్రకళకు ఇష్టమైన ఆట బ్యాడ్మింటన్‌. పుస్తకాలు చదవడం, చారిత్రక ప్రదేశాలు చూడడం, వంట చేయడం, యోగసాధన ఆమె హాబీలు. ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండే చంద్రకళకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. అలాగే కొద్దిపాటి విమర్శలు కూడా. సోషల్‌ మీడియాను పరిపాలన సౌలభ్యం కోసం కంటే ప్రచారానికే ఎక్కువగా వినియోగిస్తోందనే అపవాదు వచ్చి పడింది. ఆమెలో ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం రెండూ ఎక్కువే. ఆ లక్షణాలనే ఒక్కమాటలో ‘ఆమె అహంకారి’ అనేసే వాళ్లూ ఉన్నారు. వృత్తిపరమైన విధుల నిర్వహణలో రాజీ పడనంత వరకు ఎవరికీ తలొగ్గాల్సిన పనిలేదనేది ఆమె ఫిలాసఫీ.

మూడేళ్ల కిందట బులంద్‌ శహర్‌ జిల్లాలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది చంద్రకళ. మహమూద్‌పూర్‌లో కొత్తగా వేసిన రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం నాసిరకంగా ఉంది. కొన్ని టైల్స్‌ పగిలిపోయి ఉన్నాయి, కొన్నయితే ఆనవాలుకు కూడా లేవు. ఆ రోడ్లను చూసి ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మీకిది అవమానంగా లేదా? ఇది ప్రజల డబ్బు. ఈ నష్టాన్ని మీ జీతాల నుంచి కట్టిస్తారా. మీరు  రాత్రి వేసిన రోడ్లు ఉదయానికి పగిలిపోతాయా’ అంటూ మున్సిపల్‌ అధికార్లను, కాంట్రాక్టర్‌ను గట్టిగా మందలించింది. ఆ వీడియో వైరల్‌ అయింది. పై ఫొటో ఆ వీడియోలోదే.ఆమె ఆగ్రహం అధికారులకు, రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్‌లకు కష్టంగా అనిపించింది. సామాన్య ప్రజలు మాత్రం... ఇలాంటి అధికారులుంటే  దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. అప్పుడప్పుడూ అయినా ఇలాంటి వాళ్లు వస్తుంటే గ్రామాలు, పట్టణాలు బాగుపడతాయనుకున్నారు. రోడ్ల తనిఖీ తర్వాత ఆమె ఆరోజు సికందరాబాద్‌లో 36 గంటల పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఏడు బృందాలు, ఒక్కో బృందంలో అరవై మంది పాల్గొన్న పరిశుభ్రత ప్రోగ్రామ్‌లో 36 గంటల్లో జిల్లాలోని ప్రధాన కూడళ్లన్నీ శుభ్రమయ్యాయి. 
  – మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top