మనువును కాల్చేశాడు పదవిని కాలదన్నాడు

Dr  Babasaheb Ambedkar on his 128th Birth Anniversary - Sakshi

 బాబా సాహెబ్‌

అంబేడ్కర్‌ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది. మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం. స్త్రీ హక్కుల కోసం అంబేద్కర్‌ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు.

హక్కులు, స్వేచ్ఛ, సాధికారత, ఆత్మగౌరవంపై అంబేడ్కర్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కులం దుర్మార్గాన్నే కాదు స్త్రీల మీద అణిచివేత ధోరణులను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఒక  సమాజం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి  స్త్రీ అభివృద్ధి అనేది కొలమానం అనేవారు. తన ఉపన్యాసాలలో స్త్రీ అణచివేత, కులవ్యవస్థ మధ్య ఉన్న లంకెను  గురించి చర్చించేవారు.‘ది రైజ్‌ అండ్‌ ఫాల్‌ ఆఫ్‌ హిందూ వుమెన్‌’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి  నెట్టేవేసిన సామాజిక పరిస్థితులు గురించి లోతుగా చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధసంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని చెబుతూ... బుద్దుడు, ప్రసంజిత్‌ మహారాజుల మధ్య జరిగిన ఒక సంఘటనను ఉదహరిస్తుండేవారు అంబేడ్కర్‌. తనకు ఆడపిల్ల జన్మించిందన్న కారణంతో ప్రసంజిత్‌ మహారాజు దుఃఖితుడవుతున్న సమయంలో–‘‘ఆడబిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు.

ఆడబిడ్డ మగబిడ్డకు ఏమాత్రం తీసిపోదు’’ అంటాడు బుద్దుడు.తన ఉపన్యాసాల ద్వారా స్త్రీ చైతన్యానికి ప్రయత్నించేవారు అంబేడ్కర్‌. మారుతున్న  సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలివేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు.వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్‌ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్‌ మాటలు ఎంతో  దోహదపడ్డాయి.స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు అంబేడ్కర్‌. ఆయన నేతృత్వంలో ఏర్పడిన ‘పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ’ ఎందరో బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. మహిళలు చదుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేసింది. అంబేడ్కర్‌ మనుస్కృతి ప్రతులను దగ్ధం చేయడాన్ని చాలామంది ‘కులం’ కోణం నుంచే చూస్తారుగానీ ఇందులో స్త్రీ దృకోణం కూడా ఉంది.

మనుస్మృతి అనేది స్త్రీ కాళ్లకు, మేధస్సుకు బంధనాలు వేస్తుందనే నిరసన కూడ మనుస్మృతి దగ్ధం వెనుక ఒక ప్రధాన కారణం.కులం, స్త్రీ అణచివేతను విడి విడి సమస్యలుగా చూడలేదు అంబేడ్కర్‌. రెండు సమస్యలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. బాల్యవివాహాలకు దూరంగా ఉండాలని చెప్పిన అంబేడ్కర్,  స్త్రీ దృష్టి కోణం నుంచి కుటుంబ నియంత్రణను గట్టిగా సమర్థించేవారు.దళిత స్త్రీల కట్టుబొట్టును నిర్ణయించి, నియంత్రించిన అగ్రకులవ్యవస్థ  కుట్రను కూడా తన ప్రసంగాలలో ఎండగట్టేవారు అంబేడ్కర్‌. దళిత మహాసభలు జరిగినప్పుడు, స్త్రీల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రసంగించేవారు.‘‘పాత, మురికి బట్టలకు  దూరంగా ఉండాలి’’ అని చెప్పేవారు. దీని ఉద్దేశం దళిత స్త్రీలు అందంగా, ఆడంబరంగా  తయారవ్వాలని కాదు... కుల ఆధారిత వస్త్రధారణను నిరసించడం మాత్రమే ఆయన మాటల వెనుక ఉన్న సారాంశం. అంబేడ్కర్‌ మాటల ప్రభావంతో ఎన్నో దళిత మహిళాసంఘాలు తమాషా(పాటలతో కూడిన  నృత్యం)లకు దళిత స్త్రీలు దూరంగా ఉండాలని ఒక తీర్మానం చేశాయి.

ప్రదర్శన సమయంలో దళిత స్త్రీలు నెత్తి మీద గ్యాస్‌ దీపాలు మోయకూడదని కూడా తీర్మానం చేశాయి.పాట కావచ్చు, పని కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు...ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యను అనుమతించకూడదని అంబేడ్కర్‌ దళిత స్త్రీలకు చెప్పేవారు.కుటుంబవ్యవస్థలో స్త్రీలకు  కొన్ని హక్కులు కల్పిస్తూ తాను తయారుచేసిన ‘హిందూ కోడ్‌’ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడానికి శతవిధాల ప్రయత్నించారు అంబేడ్కర్‌. సంప్రదాయ ఛాందసుల కుట్ర వల్ల ఈ బిల్లు  ఆమోదం పొందలేదు. దీనికి నిరసనగా తన మంత్రి పదవికి  రాజీనామా చేసి స్త్రీల హక్కులపై తన నిబద్దతను చాటుకున్న ధీశాలి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌.
(సౌజన్యం : డాక్టర్‌ బి. విజయభారతి)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top