
దారి తప్పిన మనిషి జీవితం ఎంత దుర్భరంగా మారిపోతుందో హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌కి క్రమంగా తెలిసివస్తోంది. స్త్రీ లౌల్యం అతడి పరువు మర్యాదల్ని పసిఫిక్ మహాసముద్రంలో కలిపేసింది. కోర్టు కేసులు అతడి ఆస్తుల్ని హారతి కర్పూరంగా కరిగించేస్తున్నాయి. సినిమా ఛాన్సులు ఇచ్చేందుకు, ఇచ్చినందుకు ప్రతిఫలంగా వైన్‌స్టీన్ తమపై అనేకసార్లు లైంగిక అఘాయిత్యాలకు పాల్పడ్డాడని ఈ మూడు నెలల్లోనూ దాదాపు వందమంది మహిళలు ఒకరొకరుగా బయటికి వచ్చి అతడిపై ఫిర్యాదు చేశారు. ఆ కేసులు నడుస్తుండగానే, వైన్‌స్టీన్ మాజీ భార్య ఈవ్, అతడి నుంచి తనకు రావలసిన 5 మిలియన్ డాలర్ల బకాయీలను ఇప్పించాలని రెండు రోజుల క్రితమే లాయర్‌ను సంప్రదించింది.
విడాకుల పరిష్కార పత్రంపై వైన్‌స్టీన్ చేసిన సంతకం ప్రకారం ఈవ్‌కు అతడు 60 మిలియన్ డాలర్లు ఇవ్వవలసి ఉండగా, వాటిల్లో అతడు పిల్లల సంరక్షణకు ఇచ్చేందుకు సమ్మతించిన ఐదు మిలియన్ డాలర్లను ఇంకా ఇవ్వలేదు. అది కాకుండా వైన్‌స్టీన్ జీవితాంతం యేటా యాభై వేల డాలర్లను సెలవుకాలం గడిచేందుకు ఈవ్‌కు ఇవ్వవలసి ఉంటుంది. లాయర్లకు ఫీజుగా, బాధితులకు పరిహారంగా వైన్‌స్టీన్ దగ్గర ఉన్నదంతా హరించుకుపోతే, ఇక తనకేమీ మిగలకపోవచ్చునన్న భయంతో ఈవ్ తక్షణం తనకు రావలసిన డబ్బు ఇప్పించాలని కోరుతోంది. తప్పు చేసినవాళ్లను చట్టం శిక్షిస్తుంది. అంతకన్నా పెద్ద శిక్ష.. సొంత మనుషులు కూడా దూరమైపోవడం!