నన్ను వెళ్లనివ్వు

Danger to the nation and the people - Sakshi

చెట్టు నీడ

‘‘దేశానికి ఆపద, ప్రజలకు ప్రమాదం వచ్చిపడ్డాయి. కౌరవసేనను ఎదిరించడానికి తనకో సారథి కావాలంటున్నాడు రాకుమారుడు. అతని శౌర్యధైర్యాలు సారథి లేనికారణంగా నిర్వీర్యం కావడానికి వీలు లేదు. బృహన్నల ఒకప్పుడు సారథి. అర్జునుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకున్నవాడు. అందువల్ల ఉత్తరకుమారుడికి సారథిగా పంపితే కార్యం సానుకూలమవుతుంది’’ అని సలహా చెప్పింది సైరంధ్రి.  అలాగే అన్నాడు ఉత్తరకుమారుడు. బృహన్నలను పిలిచి ‘‘కౌరవులు మన గోవులను అపహరించుకుపోతున్నారు. వెంటనే రథం సిద్ధం చెయ్‌. కౌరవుల్ని పట్టుకుని నా ప్రతాపం చూపించాలి. తొందరగా పద’’ అంటూ హెచ్చరించాడు ఉత్తరకుమారుడు. క్షణాలలో రథం సిద్ధమైంది. గుర్రాలు ఆగమేఘాల మీద పోతున్నాయి. మహాసముద్రంలా ఉన్న కౌరవసేనను చూడగానే ఉత్తరకుమారుడి గుండెలు అవిసిపోయాయి. కాళ్లు గజగజా వణుకుతుండగా రథం మీద నిలబడటానికి కూడా ఓపిక లేనట్లుగా కూలబడిపోయాడు. ‘‘బృహన్నలా! మనవల్ల కాదు. రథాన్ని వెనక్కి తిప్పు. వెళ్లిపోదాం. బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అన్నాడు. 

బృహన్నల చిరునవ్వు నవ్వాడు. ‘‘ఉత్తరకుమారా! నువ్వు రాకుమారుడివి. అంతఃపుర స్త్రీల ముందు అనేక ప్రతిజ్ఞలు చేసి మరీ యుద్ధభూమికి వచ్చావు. మనం ఇప్పుడు శత్రువులకు భయపడి ఆవుల్ని తీసుకెళ్లకుండా ఉత్తిచేతులతో వెళ్తే మనల్ని చూసి అందరూ నవ్వుతారు. వెనకాముందూ చూసుకోకుండా బీరాలు పలకకూడదు. ధైర్యంగా పోరాడు. వెనక్కి వెళ్లే ఆలోచన మానుకో’’ అన్నాడు బృహన్నల. ‘‘నావల్ల కాదు, ఆడవాళ్లు నవ్వితే నవ్వనీ. ఎగతాళి చేస్తే చేయనీ, నన్ను మాత్రం వెళ్లనివ్వు’’ అంటూ  రథం మీదినుంచి కిందికి దూకి పిచ్చివాడిలా పరుగెత్తుతున్న ఉత్తరకుమారుడి వెంటపడి పట్టుకున్నాడు బృహన్నల. అతన్ని రథం మీద కూర్చోబెట్టి తానే కార్యక్రమం నడిపించాడు. ప్రజల ముందు డాంబికాలు పలికి తీరా యుద్ధభూమికి వచ్చాక బెదిరిపోయి తిరుగుముఖం పట్టి పారిపోయిన ఉత్తరకుమారుడి కథ చెప్పే నీతి ఒకటే తగని మాటలు చెప్పకండి. తగని పనులు చేయకండి అని. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top