మళ్లీ పాడుకునే పాట | Analysis On Song of Solomon Novel | Sakshi
Sakshi News home page

మళ్లీ పాడుకునే పాట

Aug 12 2019 1:34 AM | Updated on Aug 12 2019 1:36 AM

Analysis On Song of Solomon Novel  - Sakshi

టోనీ మోరిసన్‌ రాసిన ‘సాంగ్‌ ఆఫ్‌ సాలొమన్‌’ –అమెరికా, మిచిగాన్‌లో ఉన్న ‘సౌత్‌ సైడ్‌’ అన్న కాల్పనిక ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది. అది నల్లవారుండే ప్రాంతం. ఎగరడానికి ప్రయత్నించి, చనిపోయిన స్మిత్‌తో నవల మొదలవుతుంది. చుట్టూ పోగయిన జనాల్లో ఉన్న రూత్‌కు అప్పుడే పురిటి నొప్పులు మొదలై, మూడో మేకెన్‌ డెడ్‌కు జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు ఆస్పత్రిలో పుట్టిన మొట్టమొదటి ఆఫ్రికన్‌–అమెరికన్‌.

కొత్తగా స్వేచ్ఛ పొందిన నల్లవారిలో ఒకరైన మూడో మేకెన్‌ డెడ్‌కు తాతైన సాలొమన్‌కు ‘మేకెన్‌ డెడ్‌’ అన్న పేరు పెట్టినది, తాగి ఉన్న ఓ ఆర్మీ ఆఫీసర్‌. ఆ వెక్కిరింత పేరే మూడు తరాలపాటు కొనసాగుతుంది. మూడో మేకెన్‌ డెడ్, చాలాకాలం చనుబాలు తాగడం వల్ల, అతనికి ‘మిల్క్‌మాన్‌ డెడ్‌’ అన్న వెక్కిరింపు పేరు స్థిరపడుతుంది. ఈయన తండ్రయిన రెండవ మేకెన్, ఆస్తులు పోగుచేసుకోవడం తప్ప జీవితంలో మరే సంతోషం కనుక్కోలేకపోయిన కర్కోటకుడు. ఇరుగు పొరుగులందరిలో కారున్నది అతనికొక్కడికే. ‘అతని కుటుంబం కార్లో వెళ్ళడాన్ని వారు అసూయతోనూ, మరెంతో వినోదంగానూ చూసేవారు.’

ఆ ఊర్లో ఆ అతి ధనిక నల్ల కుటుంబంలో– తల్లి నిర్లిప్తత, తండ్రి పీనాసితనం, మేనత్త పిలాతు ఆచరణాత్మకత, ఇద్దరు అక్కల ‘శుచికరమైన కన్యత్వం’ మధ్యన పెరిగిన మిల్క్‌మాన్‌కు ప్రేమ, నిబద్ధత అర్థం కావు. ఆర్థిక స్వాతంత్య్రం పొందడానికి, పిలాతు వద్ద ఉందని ఊహించుకున్న బంగారం కొట్టేసే పథకం వేస్తాడు.
‘నేను చిన్న స్త్రీని. అల్పమైనదాన్ని అన్న అర్థంలో కాదు. చిన్నదానిగా నొక్కేశారు’ అని రూత్‌ తన గురించి చెప్పుకుంటుంది. పిలాతు మనవరాలైన హాగరు, మిల్క్‌మాన్‌ను ఆరాధిస్తుంది. వారి కుటుంబ స్నేహితుడైన గిటార్, నల్లజాతిపై జరిగే అత్యాచారాల గురించి పోట్లాడుతుంటాడు. ‘నీ సమస్త జీవితాన్నీ మిల్క్‌మాన్‌కు అర్పించుకుంటున్నావు. దానికి ఏ వెలా లేదా? నీకే అలా అనిపిస్తే, అతనెందుకు లెక్కచేయాలి’ అంటూ హాగరును మందలిస్తుంటాడు. 

ఒకసారి, తండ్రి తమ కుటుంబ చరిత్ర గురించి సూచనప్రాయంగా చెప్పిన తరువాత, మిల్క్‌మాన్‌ తన ముత్తాత గురించి తెలుసుకోవడానికి దక్షిణ వర్జీనియా ప్రయాణిస్తాడు. పూర్వీకుల అసలు పేర్లూ, చరిత్రా కనుక్కుంటాడు. తాత పేరు ‘సాలొమన్‌’ అని తెలిసి, కుటుంబం పట్ల గర్వపడతాడు. ఒక ఊర్లో పిల్లలు, సాంగ్‌ ఆఫ్‌ సాలొమన్‌ పాట పాడటం విన్నప్పుడు, దానికీ తన కుటుంబ చరిత్రకూ సంబంధం ఉందని తెలుసుకుంటాడు. మిచిగాన్‌లో – మిల్క్‌మాన్‌కు గురిపెట్టిన గిటార్‌ తుపాకీగుండు తగిలి, పిలాతు మరణిస్తుంది. తన బలహీనతలనూ, అల్పత్వాన్నీ గుర్తించిన 32 ఏళ్ళ మిల్క్‌మాన్‌– సాలొమన్‌ పాటను గుర్తు చేసుకుంటూ, గిటార్‌ వైపు ఎగురుతాడు. తరువాత జరిగినదేమిటో చెప్పరు రచయిత్రి. అయితే, అది అతను తన కుటుంబ వంశక్రమానికి తిరిగి వచ్చాడన్న లాంఛనప్రాయ క్రియ అని అర్థం అవుతుంది. సాంస్కృతిక గుర్తింపు కోసమని చేసే వెతుకులాట గురించి చెప్పే ఈ పుస్తకం, బానిసత్వాన్ని తప్పించుకోవడానికి ఆఫ్రికా ఎగిరిపోయే ఆఫ్రికన్‌– అమెరికన్‌ జానపద కథని ఆధారంగా తీసుకుని రాసినది.

కొంత మాయా వాస్తవికతా, ప్రతీకవాదం, అణచివేత, వివక్ష పట్ల కోపం ఉన్న ఈ కుటుంబ చరిత్రలో అనేక పాత్రలు ఉన్నాయి. మగవాళ్ళెప్పుడూ తమ ఉనికిని తప్పించుకుని పారిపోతూ ఉండగా, స్త్రీలు ప్రేమలో పిచ్చివాళ్ళవుతారు. వారు జాత్యహంకారానికి బలి అవడమేగాక, తమ పురుషుల స్వేచ్ఛకు కూడా మూల్యం కూడా చెల్లిస్తారు. ప్రథమ పురుషలో సాగే కథనం భూతకాలంలో ఉంటుంది. ఇరవయ్యవ శతాబ్దంలో ఆఫ్రికన్‌ అమెరికన్ల బానిసత్వపు చేదు వారసత్వం, వారి కుటుంబాల్లో ఉండే సంక్లిష్టతలను స్పృశిస్తారు రచయిత్రి. సంగీతం అన్న మూలాంశం నవలంతటా కనిపిస్తుంది. నవల ఎగిరే ప్రయత్నంతోనే మొదలవుతుంది, ముగుస్తుంది.

1977లో ప్రచురించబడిన నవలిది. ఆఫ్రికన్‌ అమెరికన్‌ అయిన టోనీ మోరిసన్‌ నోబెల్‌ పురస్కారం పొందిన మొట్టమొదటి నల్లజాతి మహిళ(1993). ఆమె రచనల్లో– ఇతిహాస ఇతివృత్తాలు, సున్నితమైన భాష, వివరమైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జీవితాలుండటం వల్ల అన్నీ పేరు పొందినవే. గత వారమే ఆమె మరణించారు(18 ఫిబ్రవరి 1931– 5 ఆగస్ట్‌ 2019).
  -యు.కృష్ణ వేణి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement