మేలు చేసినోళ్లకే.. | Y.S Rajasekhara Reddy made good rule | Sakshi
Sakshi News home page

మేలు చేసినోళ్లకే..

Apr 23 2014 2:56 AM | Updated on Aug 14 2018 4:21 PM

వానొస్తేనే పైరు, లేకపోతే దేశాలు పట్టుకుని తిరగాలి. ‘ఎండైన, వానైనా, గాలిలా ఇట్టా ఉండడం వండుకు తినడం, పనులకు పోవడం. ఎక్కడ పనులుంటే అక్కడికిపోయి వలస బతుకులు బతుకుతున్నాం.

వానొస్తేనే పైరు, లేకపోతే దేశాలు పట్టుకుని తిరగాలి. ‘ఎండైన, వానైనా, గాలిలా ఇట్టా ఉండడం వండుకు తినడం, పనులకు పోవడం. ఎక్కడ పనులుంటే అక్కడికిపోయి వలస బతుకులు బతుకుతున్నాం. పొద్దున ఆరుకు పోతే రాత్రి ఏడుకు వచ్చేది. శనిక్కాయ చేలల్లో పనులకు పోతున్నాం. మనిషికి 100 నుంచి 150 రూపాయలు కూలీ వస్తాది. మా ఊరిలో ఉపాధి పనులు లేవు. వానొస్తే సొద్ద, కంది పండుతాయి. లేకుంటే ఒట్టి భూములే. పిల్లలను చదివించుకునేందుకు లెక్క  ఉంటే గదా? వైఎస్  హయాంలో బాగా చేసినాడు.  
 
 ఆయన్నే తలుచుకుంటుంటాం. బియ్యం, పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు అందరికీ ఇచ్చాడు. ఆయన పోతానే పించన్ తీసేసిండు. ఉపాధి కట్ చేశారు. ఆయన టైంలో వంద రూపాయలు కూలీపడేది. ఇప్పుడేమో 30 రూపాయలు కూడా రావడం లేదు. దీంతోనే దేశాలు పట్టుకుని తిరుగుతున్నాం. జగన్ బాగా చేస్తాడనే నమ్మకముంది. ఈయనకే ఓటేయాలనుకుంటున్నాం. ఓయమ్మ చంద్రబాబా!! ఆయన మాటలు నమ్మలేం. నమ్మితే మనుషులను ఇతర దేశాల్లో అయినా అమ్మనైనా అమ్ముతాడు. ఆయన హయాంలో ఏమీ జరగలేదు.
 
 ఓ. వెంకట్రామిరెడ్డి,కడప
 ‘‘కోనసీమను తలపించే ప్రాంతం...పెన్నానదికి ఆవల, ఈవల గట్టు వెంబడి ఉన్న  గ్రామాలు...పచ్చటి పైర్లతో కళకళలాడే పంట పొలాలు....నేడు బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి. అయితే ఇందుకు నీరులేక కాదు...కరెంటు కోతలతోనే. కనీసం తాగునీటి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన దుస్థితిలో గ్రామాలున్నాయి. ‘సాక్షి’ బృందం రాజంపేట నియోజకవర్గం లోని సిద్దవటం మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించింది. రోడ్డు వెంబడి ఉన్న గ్రామాల్లో పొలాల్లో పనులు చేసుకుంటున్న అన్నదాత కష్టాలను తెలుసుకుంది.  80 ఏళ్ల వయసులో సైతం పూట గడవక పొలం పనులు చేసుకుంటున్న అవ్వాతాతలు వారి కష్టాన్ని పంచుకున్నారు.  గ్రామాల్లో చిన్నచిన్న బంకుల వద్ద సమావేశమై మాట్లాడుకుంటున్న  వారితో మాట కలిపింది. పశువులు మేపుకుంటున్న కాపరుల అంతరంగాన్ని తెలుసుకుంది. ఉపాధిలేక వేరే ఊరికి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీల వ్యధను... ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీల అవస్థలు..  బుట్టలు అల్లుకుని జీవించే ఎస్టీల బాధలను, వారి స్థితిగతులను అడిగి తెలుసుకుంది.’’
 
 వారందరి మాట ఒక్కటే... మేలు చేసేవాళ్లకే ఓటు వేస్తామని తన మనసులోని మాట  చెప్పారు. ‘పెద్దాయన’ పాలనతో మాకు నమ్మకం కుదిరింది. కళ్లబొల్లి మాటలు, వెన్నుపోటు పొడిచే వారి మాటలు, చెప్పేవారి పాలనను చూశాం. వెన్నుపోటు పొడిచే నాయకులను నమ్మం. పెద్దాయన కుమారుడు యువ నాయకుడు మంచి చేస్తాడనే నమ్మకముంది. మా కష్టాలు.. కన్నీళ్లు తుడిచే నాయకుడు ఆయనేనని ఆశ ఉంది. ఆయనకే ఓట్లు వేస్తామని చెప్పారు.  
 
 గూడు కట్టిన దేవుడు
 రాజశేఖర్‌రెడ్డిహయాంలో ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. బుట్టలు అల్లుకోవాలె. దీంతోనే తిండికిపోవాలా, పొదుపులు చెల్లించాలా. బీదరికాలే చెడ్డవి. ఉపాధి పనులు ఎప్పుడు పెడతారో తెలీదు. మాబోటోళ్ల కష్టాల గురించి పట్టించుకునే వాళ్లకే ఓటేస్తాం!
 - సుబ్బలక్షుమ్మ, నాగమ్మ
 
 పనిచేయకపోతే బువ్వ ఎట్టా?
 పనిచేయకపోతే బువ్వ ఎట్టా నాయనా? రూ. 200 పింఛన్ ఇస్తే ఏమైతాది? వక్క పేడు, ఆకు రావు. ఆ యాలకు రూ.70 పింఛన్ వస్తుండే. రాజశేఖర్‌రెడ్డి రూ. 200కు పెంచినాడు. ఇప్పుడు సరిపోవడం లేదు. జరగనపుడు  పొలం పని చేయాల్సిందే..తప్పదు....అంటూ 80 ఏళ్ల నాగమునెమ్మ గోడు వెళ్లబోసుకుంది.
 
 చంద్రబాబుపై నమ్మకం లేదు..
 చంద్రబాబునాయుడి పాలన చూశాం...ఆయన తొమ్మిదేళ్లలో కొన్నన్నా మంచి పనులు చేసివుంటే నమ్మేటోళ్లం.  ఆయన ఏమీ చేయలేదు.   కరెంటు బిల్లులతో కుళ్ల బొడిచినాడు. ఇప్పుడేమో తొమ్మిది గంటల కరెంటు అంటున్నాడు. ఆయన్ను నమ్మం. పెద్దాయన కొడుకు  జగన్‌పైనే నమ్మకం ఉంది. జగన్ మాటమీద నిలబడతాడని నమ్మకం ఉంది.      
 - శేషారెడ్డి, రైతు, సంటిగారిపల్లె
 
 కరెంటు కష్టాలు తప్పడం లేదు
 మాకు మూడెకరాల పొలం ఉంది. కరెంటు ఎప్పుడు పోతుందో, వస్తుందో తెలీడం లేదు. పొలం బీడు పెట్టుకున్నాం. పొద్దుతిరుగుడు కట్టెలను ఇప్పుడు కాలుస్తున్నాం. కరెంటు సరిగా ఉంటే ఈ పాటికి ఈ పొలంలో పైరు పెట్టే వాణ్ణి.
 - గుజ్జెల శ్రీనివాసులురెడ్డి, మాచుపల్లె
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement