గంటా సీట్ల తంటా | Telugu Desam Party caught in ticket tangle | Sakshi
Sakshi News home page

గంటా సీట్ల తంటా

Apr 9 2014 10:19 AM | Updated on Jul 28 2018 6:43 PM

గంటా సీట్ల తంటా - Sakshi

గంటా సీట్ల తంటా

జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో తెలుగుదేశం పార్టీలో కల్లోలం రేగుతోంది.

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీరుతో తెలుగుదేశం పార్టీలో కల్లోలం రేగుతోంది. పూటకో నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానంటూ ఆయన చెప్పడంతో పార్టీ అధిష్టానం తల పట్టుకుంటోంది. ఆయన రాక పార్టీకి బలుపుగా మారుతుందనుకుంటే.. అదంతా.. వాపేనని తేటతెల్లమవుతోంది. తనను నమ్ముకున్న సహచరులను ఇప్పటికే నట్టేట ముంచిన గంటా తీరు ఇప్పుడు జిల్లాలో పార్టీని కూడా అధోగతి పాల్జేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సీటు వ్యవహారం తేలక.. మిగిలిన స్థానాలను కూడా ఎవరికీ కేటాయించలేని పరిస్థితి  పెట్టుకున్నారు.
 
కాంగ్రెస్ నుంచి పల్లా శ్రీనివాసరావు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ ఆశలూ అడియాశలయ్యాయి. పార్టీ అధిష్టానం గంటాను విశాఖ లోక్‌సభ బరిలో దించాల న్న ప్రతిపాదనలు చేయడం.. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి ఈ స్థానంలో షర్మిల బరిలో నిలుస్తారన్న వార్తల తో.. అదే జరిగితే తనకు డిపాజిట్లు కూడా దక్కవన్న భయం తో గంటా ససేమిరా అన్నట్టు తెలిసింది. అందుకే ఈ స్థానా న్ని పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించినట్టు సమాచారం.
 
వీటి తర్వాత పెందుర్తిపై కూడా కాస్త మనసుపడ్డారు. అదీ కుదిరేది కాదని తేలడంతో.. తాజాగా ఆయన దృష్టి భీమిలిపై పడింది. ఇదే స్థానాన్ని ఆ పార్టీ సీనియర్ నేత ఎం.వి.వి.ఎస్.మూర్తి కూడా ఆశిస్తుండడం.. గంటాకు ఆటంకంగా మారింది.
 గ్రామీణ జిల్లాలో ఏదో ఒక నియోజక వర్గం నుంచి బరిలో నిలుద్దామన్నా.. అక్కడ గంటాకు భరోసా ఇచ్చే కనీస క్యాడర్ కూడా దొరకని పరిస్థితి. దీంతో గంటా తన నిర్ణయాన్ని ఇప్పటికీ వెల్లడించలేకపోతున్నారు.
 
అధినేతకూ తలనొప్పి!

గంటా సీటు కేటాయింపు వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా తలనొప్పిగా మారిందని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. ఇప్పటికే అధినేత నుంచి పలుమార్లు గంటాకు ఫోన్ చేసినా ఆయన స్పష్టం చేయలేదని పేర్కొంటున్నారు. గంటా స్థానం తేల్చాకే మిగిలిన స్థానాలు ఖరారయ్యే అవకాశం ఉండడంతో సొంత పార్టీ నేతల నుంచి గంటా తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
ఆయన్ని నమ్ముకుని పార్టీలోకి వచ్చిన చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు స్థానాలు ఎలానూ గల్లంతవడం, కన్నబాబు పరిస్థితి కూడా అదే తీరున ఉండడంతో.. భీమిలిని ఆశిస్తోన్న అవంతి శ్రీనివాస్‌కూ గంటా తీరుతో చిర్రెత్తుకొస్తోంది. తన స్థానానికి ఎసరెడితే.. తానేం చేయగలనో.. ఎన్నికల్లో నిరూపిస్తానంటూ.. అవంతి బాహాటంగానే తన అనుచరుల వద్ద చెప్తున్నట్టు సమాచారం. దీంతో గంటా ఏ స్థానం నుంచి బరిలో నిలుస్తారన్నది భేతాళ ప్రశ్నగానే మారుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement