
పవన్ కళ్యాణ్ సమాజ సేవ చేశారా?
సర్వే పేరుతో సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: సర్వే పేరుతో సీఎన్ఎన్-ఐబీఎన్ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత మైసూరారెడ్డి విమర్శించారు. ప్రజల చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. ఇంత మోసపూరిత సర్వే తానెప్పుడూ చూడలేదన్నారు. ఇదంతా కుట్ర పూరిత సర్వే అని మండిపడ్డారు. అంకెల గారడీ తప్ప ఇందులో వాస్తవాలు లేవన్నారు.
సీఎన్ఎన్-ఐబీఎన్, ఈనాడులో పెట్టుబడిదారులెవరో అందరికీ తెలుసునని చెప్పారు. పతనావస్థలో ఉన్న టీడీపీని భూతద్దంలో చూపేందుకు సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వే ప్రయత్నం చేసిందన్నారు. ఈ సర్వే తప్పుల తడకని ఆ ఛానెల్ చర్చలో పాల్గొన్నవారే చెప్పారని వెల్లడించారు. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలు ఎప్పుడూ వాస్తవాలకు దగ్గరగా రాలేదని గుర్తు చేశారు. నీల్సన్ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటే టీడీపీ నేతలు ఆ సర్వేపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నీల్సన్ మార్గ్ 50 వేల శాంపిల్స్‌తో సర్వే చేస్తే, సీఎన్ఎన్-ఐబీఎన్ కేవలం1300 మందితో మాత్రమే సర్వే నిర్వహించిందన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పవన్ సినిమాల్లో నటించడమే తప్ప.. ఏ రోజైనా సమాజ సేవ చేశారా అని మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు.