విధానమండలి ఎన్నికలు : చైర్మన్ ఎవరో | Legislative Council elections | Sakshi
Sakshi News home page

విధానమండలి ఎన్నికలు : చైర్మన్ ఎవరో

May 6 2014 10:19 PM | Updated on Aug 29 2018 8:54 PM

విధానమండలి ఎన్నికలు : చైర్మన్ ఎవరో - Sakshi

విధానమండలి ఎన్నికలు : చైర్మన్ ఎవరో

విధానమండలి చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందనే విషయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో పది రోజుల సమయం ఉంది.

 సాక్షి ముంబైః విధానమండలి చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందనే విషయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో పది రోజుల సమయం ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విధానమండలి చైర్మన్ పదవికి గురువారం జరగబోయే ఎన్నికల బరిలో మహాకూటమి కూడా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. దీంతో ఈసారి చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారనుందని తెలుస్తోంది. అధికారపక్షం కాంగ్రెస్‌లోనూ విధానమండలి చైర్మన్ పదవి కోసం పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత విధానమండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్‌తోపాటు ఎమ్మెల్యే శరద్ రణపిసే ఆసక్తి కనబరుస్తుండడంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహాకూటమి కూడా చైర్మన్ పదవి కోసం అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో ఉంది.

 మండలి బడ్జెట్ సమావేశాలు జూన్ రెండో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అయినా చైర్మన్ ఎన్నికల కోసం ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ప్రత్యేకంగా విధానమండలి సమావేశ పరుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు మండలిలో తొమ్మిది స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అందరు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీరిలో ప్రస్తుత విధానమండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్ కూడా ఉన్నారు. అదేవిధంగా విధానమండలి ప్రతిపక్ష నాయకులు వినోద్ తావ్డే కూడా తిరిగి ఎంపికయ్యారు. ఇది ఇలా ఉండగా మండలి చైర్మన్ పదవిని మళ్లీ శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే జూన్‌లో బడ్జెట్ సమావేశాలు జరపాల్సి ఉండగా, ఎవరు ఊహించని విధంగా శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు మళ్లీ పట్టం కట్టేందుకే ముఖ్యమంత్రి గురువారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంటున్నారు. 

మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే,  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మోహన్ ప్రకాష్‌కు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు మళ్లీ పదవి కట్టబెట్టడం ఇష్టం లేదని వినికిడి. దళితవర్గానికి చెందిన ఎమ్మెల్యే శరద్ రణపిసేను విధానమండలి చైర్మన్‌గా చేయాలని వీళ్లు ప్రయత్నిస్తున్నారు.

 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళితవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు విధానమండలి చైర్మన్ పదవి కట్టబెడితే రాజకీయంగా ఎంతో ప్రయోజనం ఉంటుందని మాణిక్‌రావ్ ఠాక్రే వర్గం వాదిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి వర్గం మాత్రం దేశ్‌ముఖ్‌కు మద్దతు పలుకుతోంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఎవరివైపు మొగ్గుచూపనుందనేది వేచి చూడాల్సిందే. ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గానికి చెందిన అభ్యర్థికి అధిష్టానం మద్దతు పలికితే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రికి తలనొప్పులు మొదలైనట్టేనని భావించవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

 ఇక లోక్‌సభ  ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారతాయని, అందుకే ఇంత త్వరగామండలి చైర్మన్ ఎన్నికలు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు మహాకూటమి అభ్యర్థిని బరిలోకి దింపినట్టయితే, తమ అభ్యర్థి గెలుపు కోసం కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేయాల్సి ఉండవచ్చని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement