వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని ఆ పార్టీ హుజూర్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మేళ్లచెర్వు, నూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని ఆ పార్టీ హుజూర్‌నగర్ అసెంబ్లీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ప్రచార రథంపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై ఆయన మేళ్లచెర్వు మండలం తమ్మారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ అనుమతితో నడిచే వాహనంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
ఈ దాడి చేయించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన అనుచరులకు ప్రజాస్వామ్యం, చట్టాలు, రాజ్యాంగం పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. రౌడీషీటర్లు, బైండోవర్ కేసులున్న వారు ప్రచారరథంపై దాడి చేయడం అత్యంత హేయమన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు, వైఎస్ అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ పది రోజులు 24గంటలు కష్టపడి సైనికుల్లా పనిచేసి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.