ఇంత నిర్లక్ష్యమా?!

Sakshi Editorial On RTC Bus Accident At Kondagattu In Jagtial District

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ‘ప్రగతి రథం–ప్రజల నేస్తం’ లోగోతో ఉంటాయి. ‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, క్షేమకరం’ అన్న నినాదాలకు కూడా కొదవలేదు.  కానీ జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకున్న ప్రమాదంలో కనీవినీ ఎరుగని రీతిలో 57మంది ప్రయాణీకులు బలైపోయారు. దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో చిన్న పిల్లలతోసహా 102మంది ప్రయాణికులున్నారని చెబుతున్నారు. అనేకులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు.  మన రహదారుల వాలకం చూస్తున్నా, వాటిపై ప్రతి క్షణం పరుగులు తీసే వాహనాల తీరును గమనిస్తున్నా ఇంటి నుంచి బయటికెళ్లినవారు క్షేమంగా తిరిగొస్తారన్న గ్యారెంటీ ఉండటం లేదు. కానీ మంగళవారంనాటి ప్రమాదం అన్నిటినీ తలదన్నింది.

బస్సులో డ్రైవర్‌తోసహా 51మంది ప్రయాణికులకు మించరాదన్న నిబంధన ఉండగా ఈ వాహనంలో అంతకు రెట్టింపు సంఖ్యలో ఎలా ఉన్నారన్న సందేహం తలెత్తుతోంది. ఇది చాలదన్నట్టు ప్రమాద సమయానికి అది పెను వేగంతో వెళ్తున్నదని గాయపడినవారిలో కొందరు చెబుతున్నారు. ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్న బస్సును వేగంగా పోనిస్తూ మలుపు తిప్పితే అందరూ అటువైపు ఒరిగిపోతారు. దాంతో బరువు ఒకవైపే పడి బస్సు అదుపు తప్పి ఉండొచ్చునన్నది నిపుణులు చెబుతున్న మాట. అంటే బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండకపోతే ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదు. కనీసం ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసేవి కాదు. మృతుల్లో చాలామంది ఊపిరాడక చనిపోవ డాన్ని గమనిస్తే ఈ సంగతి అర్ధమవుతుంది.
 
కొండగట్టులో కొలువైన ఆంజనేయుడి దర్శనం కోసం భారీ సంఖ్యలో అక్కడికి భక్తులు వెళ్తుం టారు. మంగళవారాలు ఈ రద్దీ మరింత అధికం. ఇటువంటి మార్గాల్లో సాధారణ ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఇటీవలికాలంలో దాన్ని గాలికొదిలేస్తు న్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థగా కాక ప్రైవేటు సంస్థ మాదిరిగా వ్యవహరిస్తోంది. అధికా దాయం లభించే రూట్‌లలో తక్కువ బస్సులతో ఎక్కువ ఆదాయం రాబట్టడం ఎలా అన్నదే దానికి ప్రధానమైపోయింది. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కంట్రోలర్లను నియమిస్తే ప్రయాణికుల సంఖ్యను గమనించి వారు డిపో మేనేజర్‌కు వర్తమానం పంపే వీలుంటుంది. అలాంటపుడు అవసర మనుకున్నప్పుడు అదనపు బస్సుల్ని పంపే అవకాశం ఏర్పడుతుంది.

కానీ డిపో నుంచి బయల్దేరిన బస్సు ఎలా ఉందో, డ్రైవర్‌ పరిస్థితేమిటో, అది వెళ్లిన రూట్‌లో రద్దీ ఎలా ఉందో గమనించే నాథుడు లేకుండా పోయాడు. బస్సులుంటే సరిపోదు. తగినంతమంది డ్రైవర్లుండాలి. కానీ ఆ రెండు విషయా ల్లోనూ ఆర్టీసీ తీసికట్టే. రిటైరవుతున్నవారి స్థానంలో కొత్తవారిని తీసుకోవటం లేదని, ఉన్నవారితోనే అదనపు గంటలు పనిచేయిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఒక డ్రైవరు ఎనిమిది గంటలు పని చేయాల్సి ఉండగా,  కనీసం అయిదారు గంటలు అదనంగా పనిచేయకతప్పడం లేదని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. అలాగే బస్సుల ఫిట్‌నెస్‌ గురించి పట్టడం లేదని చెబుతున్నాయి. ఇలాంటి పరి స్థితులు డ్రైవర్లపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఇటు బస్సు రావటంలో జాప్యం జరిగితే ప్రయాణికుల్లో అసహనం, ఆత్రుత పెరుగుతాయి. వచ్చిన బస్సు ఎక్కకపోతే వేరే బస్సు రావటానికి మరెంత సమయం పడుతుందోనన్న ఆందోళన వారిని ఆవహిస్తుంది. దాంతో కష్టమైనా, ఎంతో అసౌకర్యంగా ఉన్నా వచ్చిన బస్సే ఎక్కడానికి ప్రయత్నిస్తారు. లాభాలు ఆర్జించి కోట్లకు పడగెత్తాలన్న దురాశతో ప్రైవేటు సంస్థలు గతంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాయి. కనుకనే అప్పట్లో బస్సు రూట్ల జాతీయం కోసం అందరూ డిమాండు చేసేవారు. కానీ ఇప్పుడు యూనియన్లు, సిబ్బంది చెబు తున్న మాటలు వింటుంటే ఆర్టీసీ కూడా అదే రూట్లో వెళ్తోందన్న భావన కలుగుతుంది. 

ప్రమాదం సంభవించిన బస్సును నడిపిన డ్రైవర్‌ శ్రీనివాస్‌కు మంచి పేరుంది. నెలక్రితం ఆయనకు అవార్డు కూడా వచ్చింది. మద్యం అలవాటు లేదంటున్నారు. ఇన్ని అనుకూలాంశాలు కూడా ఒక పెను ప్రమాదాన్ని నివారించలేకపోయాయి. ప్రమాదం సమయానికి బస్సు వేగంగా వెళ్తున్నదని బస్సులోని ప్రయాణికులతోపాటు బయటివారు కూడా చెబుతున్నారు. ఒకటి రెండు వాహనాలను ఓవర్‌ టేక్‌ చేయడంతోపాటు ప్రమాదం జరగడానికి ముందు బస్సు ఒక ఆటోను ఒరుసుకుంటూ పోయింది. దీన్నంతటిని గమనిస్తే బ్రేకులు విఫలం కావడం వల్ల డ్రైవర్‌ బస్సుపై అదుపు కోల్పోయాడా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ బస్సు ఇంతక్రితం వేరే డిపోలో ఎక్స్‌ ప్రెస్‌గా తిరిగి ఇప్పుడు పల్లె వెలుగు బస్సుగా రూపు మార్చుకుని వచ్చిందంటున్నారు. పైగా 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సును తక్కుగా పరిగణించి పక్కన పడేసే నిబంధనను మూడేళ్లక్రితం సవ రించి దాన్ని 10 లక్షల కిలోమీటర్లకు పెంచారని చెబుతున్నారు.

చిత్రమేమంటే ఇప్పుడు ప్రమాదానికి గురైన బస్సు ఆ పరిమితిని కూడా దాటిపోయి, రెండు నెలలక్రితమే 20 లక్షల కిలోమీటర్ల స్థాయికి చేరుకుందని అంటున్నారు. అలాంటి బస్సుకు రంగులద్ది, మరమ్మతులు చేసి రోడ్డెక్కించిన పాపం ఎవరిదో, అసలు పాత నిబంధనలను ఎవరు ఏ ప్రాతిపదికన సవరించారో తేలాలి. ఇంకా దారుణ మేమంటే ఇలాంటి డొక్కు బస్సులు జగిత్యాల డిపోలోనే మరో 20 ఉన్నాయంటున్నారు. ఇతర డిపోల్లో ఎన్ని ఉన్నాయో కూడా లెక్క తీయాలి. వాటిని తక్కుగా పరిగణించాలి. అలాగే ఇప్పుడు ప్రమాదం జరిగిన రోడ్డు నిర్మాణంలో ఇంజనీరింగ్‌ లోపాలున్నాయని గుర్తించారని, అందువల్లే ద్విచక్ర వాహనాలు తప్ప వేరే వాహనాలు వెళ్లకూడదన్న నిబంధన మొన్నటివరకూ ఉండేదని చెబుతున్నారు. ఆ నిబంధన మారిందా లేక జగిత్యాల డిపో అధికారులు అధికాదాయానికి ఆశ పడి దాన్ని ఉల్లంఘించారా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సాధారణ పౌరుల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని కొండగట్టు ఘాట్‌ రోడ్డు దుర్ఘటన నిరూపించింది. ఇది సహించరాని నిర్లక్ష్యం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top