‘హస్త’లాఘవం

Sakshi Editorial On Congress Stand Over Defections In Rajasthan

చట్టాలు, సంప్రదాయాలు కాగితాలకూ... విలువలన్నీ ప్రసంగాలకూ పరిమితమైనప్పుడు కపట త్వమే రాజ్యమేలుతుంది. గత కొంతకాలంగా వివిధ రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేలను అక్కడ రాజ్యమేలు తున్న వేరే పార్టీలు తన్నుకుపోతున్నప్పుడల్లా కాంగ్రెస్‌ ఆక్రోశపడింది. ప్రజాస్వామ్యం నాశనమై పోతోందంటూ గుండెలు బాదుకుంది. రాజస్థాన్‌లో ఇప్పుడు తాను సైతం అదే పని చేసి విలువల గురించి తనకు పట్టింపు లేదని నిరూపించుకుంది. 200 స్థానాలున్న రాజస్థాన్‌ అసెంబ్లీకి నిరుడు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్‌పీలు పొత్తు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్‌ 99 స్థానాలు, బీజేపీ 73 స్థానాలు గెల్చుకోగా బీఎస్‌పీ అభ్యర్థులు ఆరుగురు నెగ్గారు. స్వతంత్రులుగా నెగ్గిన 14 మందిలో 12మంది ఈ ఏడాది మొదట్లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బీఎస్‌పీ ఎమ్మెల్యేలు మాత్రం బయటినుంచి మద్దతిస్తున్నారు.

కానీ కాంగ్రెస్‌కు ఇది సరిపోలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌– జేడీఎస్‌ ప్రభుత్వం కుప్పకూలినప్పటినుంచీ రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కునుకు కరువైన ట్టుంది. అందుకే నమ్మి వచ్చి పొత్తు కుదుర్చుకున్న పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు అది ఏమాత్రం సందేహించలేదు. ముందూ మునుపూ తమ పార్టీవారిని బీజేపీ లోబరుచుకుంటుందని జడిసి తానే ఆ పని చేసింది! ఇంతకన్నా సిగ్గుమాలినతనం ఉంటుందా? పైగా బీఎస్‌పీ ఎమ్మెల్యేలు వారంతట వారే తమ పార్టీలోకి వస్తున్నారని, ఆ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిళ్లూ లేవని రాజ స్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అంటున్నారు. ఇలాంటి మాటల్నే గోవాలోనూ, కర్ణాటకలోనూ బీజేపీ చెప్పింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ చెప్పింది.

ఫిరాయింపుల విషయంలో వామపక్షాలూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మినహా ఇతర పార్టీలేవీ నియమ బద్ధంగా ఉండటం లేదు. తమకు అన్యాయం జరిగినప్పుడు గగ్గోలు పెట్టడం, ఆనక అదే పని తామూ చేయడం వాటికి రివాజుగా మారింది. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పాటిం చలేదు. 2014లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ సభ్యులు 23మందిని కొనుగోలు చేసినప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఫిరాయింపుల విషయంలో ఏ వైఖరిని ప్రదర్శించిందో ఇప్పుడు కూడా అదే వైఖరితో ఉంది. తెలుగుదేశం నుంచి తమ పార్టీలో చేర తామని కొందరు ఎమ్మెల్యేలు ముందుకొచ్చినా పదవులకు రాజీనామా చేశాకే ఆ సంగతి పరిశీలిస్తా మని స్పష్టం చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు. నిజానికి విపక్ష నేతగా ఉన్నప్పుడే ఆయన ఈ పని చేసి చూపారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో అప్పటికి తెలుగుదేశం ఎమ్మెల్సీగా కొత్తగా ఎన్నికై, ఆ ఉప ఎన్నికలో తమతో చేతులు కలపడానికొచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ బీఎస్‌పీని వెన్నుపోటు పొడవటం ఇది మొదటిసారి కాదు. 2009లోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో మెజారిటీకి కూతవేటు దూరంలో కాంగ్రెస్‌ ఆగిపోయినప్పుడు అది నిర్లజ్జగా బీఎస్‌పీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అప్పట్లో కూడా ఆరుగురు బీఎస్‌పీ ఎమ్మెల్యేలనూ చేర్చు కుని వారిలో ముగ్గురికి మంత్రి పదవులు, మిగిలినవారికి పార్లమెంటరీ సెక్రటరీ పదవులు పంచింది. చిత్రమేమంటే పాత అనుభవాలను పక్కనబెట్టి బీఎస్‌పీ మళ్లీ 2018లో కూడా కాంగ్రెస్‌తోనే కూటమి కట్టింది. కానీ రెండోసారి కూడా కాంగ్రెస్‌ తన వెనకటి గుణాన్నే ప్రదర్శించింది. రాజస్థాన్‌లో మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. మరోపక్క పార్టీలో తన ప్రత్యర్థి సచిన్‌ పైలెట్‌తో ముఖ్యమంత్రి గెహ్లోత్‌కు ఇబ్బందులున్నాయి. ఇలాంటి సమయంలో బీఎస్‌పీ ఎమ్మెల్యేల చేరికతో పార్టీలో తన స్థానం పదిల మని ఆయన లెక్కలేస్తున్నట్టు కనబడుతోంది. చిత్రమేమంటే గెహ్లోత్‌ చేసిన పని స్థానిక బీజేపీ నేత లకు ‘అనైతికం’గా కనబడుతోంది.  

స్థానికంగా కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉండే పార్టీలు జాతీయ పార్టీలుగా చలామణి కావడం కోసం వేరే రాష్ట్రాల్లో పోటీ చేస్తాయి. అరుదుగా ఒకటి రెండుచోట్ల నెగ్గినా, చాలా సందర్భాల్లో డిపాజిట్లు కోల్పోతుంటాయి. కానీ యూపీలో గెలుపోటములతో సంబంధం లేకుండా బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీఎస్‌పీకి దేశవ్యాప్తంగా ఉన్న దళితుల్లో కూడా అంతో ఇంతో పలుకుబడి ఉంది. కనుక ఇతర చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తుంటారు. అయితే మౌలికంగా అది ప్రాంతీయ పార్టీయే కనుక ఇతర రాష్ట్రాల్లో గెలిచినవారిని నిలుపుకోవడానికి అవసరమైన విధానాలు, కార్యక్ర మాలు దానికి ఉండవు. పార్టీ నిర్మాణం కూడా అందుకు అనుగుణంగా ఉండదు. పైగా పార్టీని విశాల ప్రాతిపదికగా పునర్నిర్మించడానికి, భిన్న వర్గాలను కలుపుకొని వెళ్లడానికి బీఎస్‌పీ ప్రత్యేకంగా చేస్తున్న ప్రయత్నాలు లేవు. వీటన్నిటినీ ఆసరా చేసుకునే రాజస్థాన్‌ సర్కారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఖరీదు చేయగలిగింది.

కానీ ఎదుటి పార్టీ బలహీనతలు వినియోగించుకోవడానికి, లబ్ధి పొందడానికి ఏ మాత్రం వెరపు ప్రదర్శించని కాంగ్రెస్‌ మరి ఇన్నాళ్లూ శ్రీరంగ నీతులు ఎందుకు చెప్పినట్టు? పార్ల మెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ ఈ ఫిరాయింపులు ఒక జాడ్యంగా మారాయి. కొన్నాళ్లక్రితం తెలుగుదేశం రాజ్యసభ ఎంపీలు తమ పార్టీని బీజేపీలో ‘విలీనం’ చేసి చంద్రబాబు మినహా అందరినీ విస్మయపరిచారు. బాబే పంపారో, వారే ‘విలీనమ’య్యారో గానీ ఆ ప్రహసనం మాత్రం ఫిరాయిం పుల నిరోధక చట్టం బలహీనతల్ని మరోసారి బట్టబయలు చేసింది. అది పనికిమాలినదని ఇలా పదే పదే రుజువవుతోంది. కనుక దాన్ని సవరించడం తక్షణావసరం. ముఖ్యంగా ఫిరాయింపుదార్లపై నిర్ణయం తీసుకునే హక్కును స్పీకర్ల నుంచి తప్పించి ఎన్నికల సంఘానికో, తటస్థంగా పనిచేసే మరో సంఘానికో అప్పజెప్పాలి. ప్రజాస్వామ్యంపైనా, ప్రజాస్వామిక విలువలపైనా దేశ ప్రజల్లో అడు గంటుతున్న విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే ఇది తప్పనిసరని పాలకులు గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top