మీడియాను మార్చిన ‘టేపులు’

వినోద్ మెహతా


రాడియా టేపుల ఉదంతం పత్రికా రచయితల పట్ల ప్రజానీకంలో ఉన్న భ్రమ లను పటాపంచలు చేసిందని ‘ఔట్‌లుక్’ ఆంగ్లపత్రిక సంపాదక మండలి చైర్మన్ వినోద్ మెహతా చెబుతున్నారు. టేపులు బయటపడిన తరువాత మీడియాలో గణనీయమైన మార్పులు వచ్చాయని కూడా అంటున్నారు. ‘ఎడిటర్ అన్‌ప్లగ్డ్: మీడియా, మేగ్నెట్స్, నేతాస్, అండ్ మీ’ పేరుతో మెహతాజ్ఞాపకాల రెండో సంకలనం ఇటీవల విడుదలవుతున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సీనియర్ జర్నలిస్ట్ ఎన్నో చేదునిజాలను ఆవిష్కరించారు.

 

 కొన్ని భాగాలు:

 ప్ర: రాడియా టేపుల వార్తాకథనం ప్రచురించాలని ఎప్పుడు నిర్ణయించారు? దాని పర్యవసానాలు ‘ఔట్ లుక్’ పత్రిక మీద ఏ విధంగా ఉంటాయని ఊహించారు?

 జ: కథనం చాలా మంది వ్యక్తుల, సంస్థల ప్రతిష్టకు గురిపెడుతుందని అంచనా వేశాను. అందులో రతన్ టాటా పేరొకటి. ఆయన అసాధారణమైన పలుకుబడి కలిగినవారు మాత్రమే కాదు, ఆయన సంస్థ వ్యాపార ప్రకటనా రంగాన్ని శాసిస్తోంది. ఆ సంస్థకు ఎంతో ప్రఖ్యాతి ఉంది. కానీ, టేపులలో ఉన్న విషయం ప్రజా ప్రయోజనం దృష్ట్యా వెలువరించక తప్పనిస్థాయిలో ఉంది. అయినా ఆ పేరు లేకుండా ప్రచురిస్తే మోసగించడమే కూడా. కానీ ఈ కథనంతో నేను ప్రస్తావించిన జర్నలిస్టుల పేర్లతో ఇబ్బంది పడ్డాను. ఆ ఇద్దరు-బర్కా (దత్), వీర్(సింఘ్వీ) నా మిత్రులే.

 

 ఇప్పటికీ మిత్రులేనా?

 నన్ను ఎన్డీటీవీ నుంచి బహిష్కరించారు. అంతక్రితం వారానికి రెండు సార్ల యినా కనపడుతూ ఉండేవాడిని. కానీ టేపుల కథనం తరువాత నన్ను ఎప్పు డూ పిలవలేదు. ఈ పుస్తకంలో ‘టీవీ, నేను’ అనే అధ్యాయం ఉంది. బుల్లితెర మీద చిన్నపాటి టీవీ స్టార్‌ని కావడం మీద, నిత్యం రాత్రివేళ సాగే పిడివాదాల మీద భిన్నాభిప్రాయాలను నమోదు చేశాను. నిజానికి టీవీని ఏమీ పట్టించుకోని పత్రికా రచయితల తరం నాది.

 

 బర్కా, వీర్‌లతో సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించారా?

 ఎన్డీటీవీ ఒక కార్యక్రమం ప్రసారం (ఆ టేపులలో బర్కాదత్ చెప్పిన దానికి వివరణ ఇవ్వడానికీ, సమర్థించుకోవడానికీ)చేసింది. ‘ఈ కార్యక్రమానికి రావడానికి వినోద్ మెహతా నిరాకరించారు’ అంటూ అప్పుడు స్క్రోలింగ్ వేసిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఇది పత్రికా విలువలకు పూర్తిగా విరుద్ధమని బర్కాదత్‌కు చెప్పడానికి నేనెవరిని అన్నది నా భావన. నాకు హితబోధలు ఇష్టం ఉండదు. ‘జర్నలిస్టుగా నేను నీ కంటే ఎన్నో ఏళ్లు ఎక్కువ అనుభవం కలిగినవాడిని. వృత్తిపరంగా నీవు చేసింది తప్పు’ అని ఆమెకు చెప్పాలనీ అనుకోలేదు. ప్రణయ్‌రాయ్ (ఎన్డీటీవీ అధిపతి) నాకు ఫోన్ చేసి ఆ కార్యక్రమానికి రమ్మన్నారు. రానని చెప్పాను. మీరు మా జర్నలిస్టులను విమర్శించారు కాబట్టి రావాలన్నారాయన.

 

 మీ కార్యక్రమంలో విమర్శించలేదు కదా అన్నాను. నేను ఆమెను విమర్శించానంటే, అది ‘ఔట్‌లుక్’లో జరిగింది. దానికి ఆమె స్పందించవచ్చు. అయితే బర్కా తన వివరణను బుధవారానికి పంపవలసి ఉంది. కానీ పంపలేదు. నేను ప్రణయ్‌కి ఫోన్ చేసి, మిత్రమా! ఆమె వివరణ పంపలేదు. నేను పేజీలు (అచ్చుకు పంపకుండా) ఆపి ఉంచలేను అని ప్రణయ్‌కి చెప్పాను. ఆయన మరో పదినిమిషాల సమయం కోరారు. వెంటనే బర్కా తన స్పందనను పంపారు. ఒక్క అక్షరం కూడా మార్చకుండా అచ్చు వేశాం. వీర్ సింఘ్వి విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనైతే ఏడాది తరువాత రాశారు. తాను ఎక్కడో టేపులు సంపాదించాననీ, అవి నకిలీవని తేలిందని రాశారు.

 

 అది మీ ఉద్యోగానికి ముప్పు తెచ్చిందని అనుకోవచ్చా?

 ప్రకటనకర్తలతో ఇబ్బందులు వచ్చాయి. టాటాలు ‘ఔట్‌లుక్’ను బహిష్క రించారు. కానీ దీనితోనే నా పదవి పోయిందని చెప్పలేను. అప్పటికి నేను ఎడి టర్‌గా వచ్చి 17 ఏళ్లయింది. రహేజాలు (అధిపతులు) నాతో సఖ్యంగానే ఉన్నా రు. కానీ వాళ్లు ఎడిటర్ మార్పును సూచించినప్పుడు నేను సరేనన్నాను.

 

 టేపులు ఒకరిద్దరు జర్నలిస్టులనే కాదు, మొత్తం మీడియానే ఎత్తిచూపాయి కదా!

 ఇది మొత్తం జర్నలిస్టుల ప్రతిష్టనే దిగజార్చింది. అవినీతి మీద జరిగిన ఒపీనియన్ పోల్స్‌లో జర్నలిస్టులు టాప్ టెన్‌లో రావడం మొదలైంది. సేవకు సంబంధించి వేరొక పోల్స్‌లో చూస్తే జర్నలిస్టుల పేరే లేదు. జర్నలిస్టులతో పాటు ఉపాధ్యాయులు, శాస్త్రజ్ఞుల వర్గం కూడా వచ్చి చేరింది.

 

 ఇప్పుడున్న వారిలో గొప్ప ఎడిటర్ అని మీరు ఎవరి పేరైనా చెబుతారా?

 లేదు. నేను ఆఖరిగా ప్రశంసించినది కుష్వంత్‌సింగ్‌నే. కొత్త ఎడిటర్లు బహు ముఖ ప్రజ్ఞాశాలురు. కానీ వారి నుంచి నేను నేర్చుకోవలసిందేమీ లేదు.

 (స్క్రోల్.ఇన్ వెబ్‌సైట్ సౌజన్యంతో)

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top