ట్రంప్‌ తప్పుడు నిర్ణయం

Donald Trump Took Wrong Decision Over WHO - Sakshi

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిపై పోరాడుతున్నాయి. వేరే దేశాల సాయానికి అర్థిస్తున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో ఇతరులు అమలుచేస్తున్న మెరుగైన విధానాలు తామూ అను సరిస్తున్నాయి. ఇలా ఎవరికి వారు కరోనా పోరులో నిమగ్నమైన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులివ్వడాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు. ఈ సంస్థ మౌలిక లక్ష్యాలు ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం., సభ్య దేశాలన్నిటికీ ఎప్ప టికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రమాదకర వ్యాధుల గురించి వాటిని అప్రమత్తం చేయడం. ఈ లక్ష్యాల సాధనలో అదెంత వరకూ విజయవంతమైందన్న అంశంలో భిన్నాభిప్రాయాలున్నాయి. దానికి సారథ్యం వహిస్తున్నవారి సమర్థత గురించిన విమర్శలు కూడా వున్నాయి. కానీ అది ఎలాంటి అధికారాలూ లేని ఒక నిస్సహాయ సంస్థని అందరూ అంగీకరిస్తారు. డోనాల్డ్‌ ట్రంప్‌కున్న అసంతృప్తి వేరు. ఆయన పేచీ వేరు. అది కరోనా మహమ్మారిని గురించి అప్రమత్తం చేయడంలో దారుణంగా విఫలమైందని, ఆ సంస్థ చైనాకు వత్తాసుగా ఉంటోందని ఆయన ఆరోపణల సారాంశం.

 కరోనా మొదలైనప్పటినుంచి ట్రంప్‌ అభిప్రాయాలు ఒకేవిధంగా లేవు. స్వదేశంలో కరోనా తీవ్రత పెరిగేకొద్దీ ఆయన స్వరం మారుతూ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆయన చైనాను ప్రశంసలతో ముంచెత్తడంలోనే మునిగి తేలారు. కరోనా వైరస్‌ కట్టడిలో అది తెగ కష్టపడుతోందని, విజయాలు సాధిస్తోందని పొగడ్తలతో ముంచెత్తారు. చైనాలో తొలిసారి గత ఏడాది డిసెంబర్‌ 31న ఈ వైరస్‌ జాడలు కనబడ్డాయి. జనవరి 11న కరోనా వ్యాధితో తొలి మరణం సంభవించింది. పలువురు వ్యాధిగ్రస్తులయ్యారు. వారంతా అక్కడి పశువుల మార్కెట్‌కు వెళ్లినవారేనని నిర్ధారణ అయింది. ఈలోగా మరింతమందికి అది సోకింది. జనవరి 21న అమెరికాలో తొలి కేసు బయట పడింది. ఆ రోగి వుహాన్‌ వెళ్లి వచ్చాడని తేలింది. జనవరి 23న వుహాన్‌ను లాక్‌డౌన్‌ చేస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఆ నెలాఖరున ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ ఏర్పడిందని, అందరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది.  ఫిబ్రవరి 26న అమెరికాలోని కాలిఫోర్నియాలో బయటపడిన మరో కేసు అందరినీ బెంబేలెత్తించింది. ఆ రోగి వేరే దేశానికి వెళ్లిన వాడు కాదు.

వాషింగ్టన్, ఒరెగాన్, న్యూయార్క్‌ నగరాల్లో సైతం ఇలాంటి కేసులే వెల్లడయ్యాయి. అదే నెల 29న వాషింగ్టన్‌లో ఒక రోగి మరణించాడు. అతనికి కూడా చైనా వెళ్లిన చరిత్ర లేదు. ఈ రెండు నెలలూ అమెరికాలో ఎందరో నిపుణులు ట్రంప్‌ను హెచ్చరిస్తూ వచ్చారు. కానీ ఆయన పట్టిం చుకోలేదు. మార్చి 11న తొలిసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. కరోనా పరీక్షలను విస్తృతంగా జరపాలని, అనుమానిత కేసుల్ని ఎటూ వెళ్లకుండా కట్టడి చేయాలని కోరింది. ఆ నెల 13న ట్రంప్‌ జాతీయ ఎమర్జెన్సీ విధించారు. మరో నాలుగు రోజులకే వ్యాధి దేశ మంతా పాకింది. ఆ తర్వాతైనా దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఇది త్వరలోనే సమసిపోతుందని, లాక్‌డౌన్‌ ప్రకటించడం వల్ల దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతాయని హెచ్చరించారు. ఏప్రిల్‌ 12కల్లా ఆంక్షలన్నీ తొలగిస్తానని తెలిపారు. నిపుణుల మాటల్ని కూడా ఆయన తోసిపుచ్చారు. 

అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 6,50,000 దాటిపోయింది. మరణాల సంఖ్య దాదాపు 33,000. ఇదింకా పెరిగే సూచనలున్నాయి. దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతమంది హెచ్చరించినా వినకుండా మొండిగా వ్యవహరించి దేశ పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించారని అందరూ తననే వేలెత్తి చూపడం మొదలెట్టాక ట్రంప్‌ బాణీ మార్చారు. చైనాను, ప్రపంచ ఆరోగ్య సంస్థను దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. వుహాన్‌లో లాక్‌డౌన్‌ అమలు చేసినదగ్గరినుంచి ఆ దేశం తీసుకుంటున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కీర్తించడం, ఇదే విధానాన్ని ఇతర దేశాలు కూడా అనుసరించాలని సూచించడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అందుకే అది చైనాతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. ఆ సంస్థ మొదట్లో ఎంత మొత్తుకున్నా వినకుండా, దేశం లోని వైద్య రంగ నిపుణుల సలహాలను సైతం బేఖాతరు చేసిన ట్రంప్‌ ఇప్పుడు తనపై పడిన నిందను చెరిపేసుకోవడానికి బలిపశువుల కోసం వెదుకుతున్నారు. చైనా తప్పిదాలేమిటో, వాటిని కప్పిపుచ్చేందుకు సంస్థ చేసిందేమిటో, దాని వైఫల్యాలు సమస్య తీవ్రతను ఎలా పెంచాయో తేలా ల్సిందే.

జనవరి మొదట్లో వ్యాధి తీవ్రత జాడలు కనబడినప్పుడు మార్చి 11కి గానీ దాన్ని మహ మ్మారిగా ఎందుకు ప్రకటించలేకపోయిందో అది సంజాయిషీ ఇవ్వాల్సిందే. సకాలంలో సమాచా రాన్ని అందించి ఆ సంస్థకు ఎందుకు సహకరించలేకపోయిందో చైనా కూడా వివరించడం తప్పనిసరి. కానీ ఈ గండం నుంచి గట్టెక్కాక ఆ పని చేయాలి. అలా చేసే ముందు సంస్థ అధికా రాలు, పరిధులు, పరిమితులు ఏమిటో తెలుసుకోవాలి. ఆ సంస్థకంటూ సొంతంగా యంత్రాంగం వుండదు. ఏ దేశంలోని పరిస్థితినైనా, అక్కడి ప్రభుత్వాలిచ్చే సమాచారం ఆధారంగా మాత్రమే అది నిర్ధారించుకుంటుంది. దాన్నిబట్టి అంతర్జాతీయంగా అప్రమత్తం చేస్తుంది. ఏ విధమైన చర్యలు తీసు కుంటే ప్రయోజనం వుంటుందో సూచనలిస్తుంది. అలాగే ప్రజారోగ్యం విషయంలో తీసుకోవాల్సిన చర్యలేమిటో ప్రపంచ దేశాలకు సలహాలిచ్చేది, వాటిని సమావేశపరిచి అవగాహన కలిగించేది ఆ సంస్థే. వ్యాధికి ఎలాంటి చికిత్సా విధానం రూపొందినా, దాని కట్టడికి ఎలాంటి వ్యూహం ఖరారైనా, వ్యాక్సిన్‌ తయారైనా ఆ అంశాలు అన్ని దేశాలకూ వివరించేది ఆ సంస్థే. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని ఎదుర్కొనడానికి సర్వశక్తులూ కేంద్రీకరించాల్సిన ఈ సమయంలో హఠాత్తుగా దానికి అమెరికా నిధులు ఆపేస్తున్నట్టు ప్రకటించడం ఈ కార్యకలాపాలన్నిటినీ దెబ్బతీస్తుంది. తన వైఫ ల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ట్రంప్‌ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలు మొత్తం ప్రపంచ ప్రజానీకానికి చేటు తెస్తాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top