ఆర్‌సీఈపీ నుంచి నిష్క్రమణ సరైందే!

Devinder Sharma Article On India Exit From RCEP - Sakshi

ప్రపంచీకరణ పెనుతుఫానుకు ఎదురొడ్డటానికి ఒక దృఢమైన నాయకుడు ధైర్య సాహసాలను ప్రదర్శించడం నిజంగానే ప్రశంసనీయం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో చేరకపోతే దేశం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోతుందో అంటూ ఆర్థిక వేత్తలు భయాలను ప్రేరేపిస్తున్న సమయంలో ఆ ఒప్పందంలో సమతుల్యతా లేమి గురించి ప్రధాని నొక్కి చెప్పడం పూర్తిగా సహేతుకమైనదే. గతంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశీయ వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లకు పెరిగిపోయింది.

అందుకే ఆర్‌సీఈపీలో చేరడాన్ని తిరస్కరిస్తూ ప్రధాని ముందుచూపుతో తీసుకున్న సాహసోపేత నిర్ణయం సరైందేనని చెప్పాలి. ఈ దశలో ఆర్‌సీఈపీ ఒప్పందంలోకి ప్రవేశించడమంటే ఇప్పటికే ఉన్న మన వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని, వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందనే ఎరుకను కూడా ప్రధాని ప్రకటన స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. ప్రపంచ జీడీపీలో 40 శాతం కలిగి ఉన్న 12 దేశాల మధ్య కుదిరిన ట్రాన్స్‌ పసిఫిక్‌ భాగస్వామ్య (టీపీపీ) ఒప్పందాన్నుంచి వైదొలగాలని డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయించుకోవడం విమర్శలకు దారితీసింది. దాన్ని భయానకమైన ఒప్పందంగా వర్ణించిన ట్రంప్‌.. వ్యవసాయ, వస్తూత్పత్తి రంగాలలో 18,000 రకాల సుంకాలను తొలగించాల్సి వస్తుందని, కచ్చితంగా అమెరికా ఉద్యోగాలను ఇది కొల్లగొడుతుందని వ్యాఖ్యానించారు.

అలాగే ప్రపంచ జనాభాలో 45 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రపంచ స్థూలదేశీయోత్పత్తిలో 25 శాతం వాటాను కలిగి ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) అనే మరొక భారీ వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ‘‘భారతీయులందరి ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్‌సీఈపీ ఒప్పందాన్ని అంచనా వేసినప్పుడు నాకు సానుకూల సమాధానం దొరకలేదు. అందుచేతనే గాంధీ సిద్ధాంతాలు కానీ, నా అంతశ్చేతన కానీ ఆర్‌సీఈపీలో చేరడానికి నన్ను అనుమతించలేదు’’.

ఈ వ్యాఖ్యలు నిజంగానే చాలా గొప్పవి. ట్రంప్‌కు మల్లే.. మోదీ మనస్సులో కూడా ఈ ఒప్పందంలో భాగంగా వస్తూత్పత్తి, వ్యవసాయరంగంతోపాటు 92 శాతం  వాణిజ్య సరుకులపై సుంకాలను తొలిగిస్తే దేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోతారని, ప్రజాజీవితం ధ్వంసమవుతుందనే ఆలోచన ప్రబలి ఉంటుంది. ఆర్థికవేత్తల్లో చాలామంది ప్రపంచీకరణ వైపు పరుగులెత్తుతున్న సమయంలో ఆ తుపానుకు ఎదురొడ్డటానికి ఒక శక్తిమంతుడైన నాయకుడు రాజకీయపరంగా ధైర్యసాహసాలను ప్రదర్శించడం నిజంగానే ప్రశంసనీయం. పైగా, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో చేరకపోతే దేశం ఎంత గొప్ప అవకాశాన్ని కోల్పోతుందోనంటూ ఆర్థికవేత్తలు భయాన్ని ప్రేరేపిస్తున్న సమయంలో ఆ ఒప్పందంలోని ధర్మబద్ధత, సమతుల్యత గురించి ప్రధాని ప్రశ్నిం చడం సహేతుకమేనని చెప్పాలి.

గతంలోనూ ఈ ఆర్‌సీఈపీలోని 12 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్‌ వాటి మార్కెట్లలో సులభంగా ప్రవేశించవచ్చనే భ్రమలకు గురైంది కానీ వాస్తవానికి ఆ ఒప్పందాల ద్వారా దేశీయ వాణిజ్య లోటు 107.28 బిలియన్‌ డాలర్లకు అమాంతంగా పెరిగిపోయింది. ఈ దశలో ఆర్‌సీఈపీ ఒప్పందంలోకి ప్రవేశించడమంటే మన వాణిజ్య లోటు మరింత పెరుగుతుందని, వ్యవసాయరంగాన్ని దారుణంగా దెబ్బతీస్తుందనే ఎరుకను కూడా ప్రధాని ప్రకటన స్పష్టం చేసింది.

అదే సమయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందన్న అంచనాతో ఇతరదేశాలతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందాలపై సంతకాలు చేయడంపై భారత్‌ ప్రదర్శించిన అత్యుత్సాహం అస్పష్టంగా, అనిశ్చితంగా ఉండటమే కాకుండా సరైన ముందస్తు ప్రణాళిక లేమిని సూచి స్తుంది. తర్వాత ఈ ఒప్పందాల అమలు క్రమంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వాలు పెరుగుతూ పోవడంతో 58 ద్వైపాక్షిక మదుపు ఒప్పందాలను భారత్‌ రద్దు చేసుకుంది.

ఈ నేపథ్యంలో తెలియని భయాలను మరీ ఎక్కువగా చూపిం చడం అర్థం చేసుకోదగినదే. తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థలకు చెందిన ముఖ్యమైన మార్కెట్లలోకి చొచ్చుకుపోవడమనే అన్వేషణలో భాగంగా ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నప్పటికీ అవేమంతగా పని చేయలేదు. స్పష్టంగా చెప్పాలంటే 2010లో 10 ఆసియన్‌ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా భారతీయ వాణిజ్య లోటు 250 శాతానికి భారీగా పెరిగిపోయింది.

భారత్‌–ఆసియన్‌ దేశాల మధ్య ఒప్పందంపై తగినంత అంచనా, సరైన తనిఖీ లేకుండా అవకాశాలు కోల్పోతామని భయం ప్రాతిపదికన సంతకాలు చేశామన్నది స్పష్టంగా బోధపడింది. అందుచేత ఇప్పుడు భారత ప్రధాని ఇండో–ఆసియన్‌ వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి సమీక్షించాలని పిలుపునివ్వడం అర్థం చేసుకోదగినదే. నిజానికి ఇండో–ఆసియన్‌ వాణిజ్య ఒప్పందాలను మాత్రమే కాకుండా, ఇంతవరకు భారత్‌ కుదుర్చుకున్న అన్ని రకాల ద్వైపాక్షిక, బహుళ వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా సమీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం ఉనికిలోకి వచ్చినప్పుడు, చాలా ఉల్లాసపూరితమైన వ్యాఖ్యలు పుట్టుకొచ్చాయి. ఒకదేశం, ఒకే ఓటు ప్రాతిపదికన బహళ వాణిజ్య వ్యవస్థకు అవకాశం కల్పిస్తే ద్వైపాక్షిక ఒప్పందాలకు ప్రతిబంధకం ఏర్పడుతుందని అప్పట్లో మనకు చెప్పేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇది తప్పు అని రుజువైంది.  సూత్రబద్ధంగా ప్రపంచవాణిజ్య సంస్థ ఒప్పందాల్లో భాగంగా 300 పైచిలుకు ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను భారత్‌ కుదుర్చుకోగలిగింది. ఈ ఒప్పందాలన్నీ బలమైన మేధో సంపద హక్కులు, మార్కెట్లకు పూర్తిగా తలుపులు తెరవడాన్ని సుసాధ్యం చేశాయి. 

అనేక దేశాలు ఇప్పటికే (దిగుమతులపై జీరో టారిఫ్, పన్నేతర ప్రతిబంధకాలను తొలగించడం ప్రాతిపదికన) ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే మెజారిటీ సభ్య దేశాలు ఇప్పటికే విడివిడి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కలిగివున్నందున ప్రాంతీయ ఒప్పందాల నుంచి ప్రోత్సాహక వృద్ధిని ఎలా ఆశిస్తామన్నదాన్ని అంచనా వేయటంలో నేను విపలమయ్యానని అంగీకరించాలి. అయితే ఇప్పుడు ఏర్పడుతున్న కొత్త వాణిజ్య కూటమిలో చైనా వంటి దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు (ఇప్పటికే భారత్‌కు చైనాతో 53 బిలియన్‌ డాలర్ల మేరకు వాణిజ్య లోటు ఉంది), ఆస్ట్లేలియా, న్యూజిలాండ్‌ వంటి సంపన్న దేశాలు చేరి ఉన్నాయి. పైగా ఇవన్నీ భారత పాల పరి శ్రమ, వ్యవసాయరంగంపై కన్నేశాయి. తమ సొంత పాల పరిశ్రమ ఉత్పత్తులను భారత్‌లో గుమ్మరించడానికి ఇవి కాచుకుని ఉన్నాయి. ఇది ఏమేరకు మనకు ప్రయోజనకరమో ఊహించుకోవలసిందే మరి.

ఆర్‌సీఈపీ వాణజ్య భాగస్వాములతో వ్యహరించేటప్పుడు భారత్‌ తీసుకున్న ఈ అదనపు జాగ్రత్తలు సమర్థనీయమేనని చెప్పాలి. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆర్‌సీఈపీ చర్చల్లోకి తిరిగి ప్రవేశించాలంటే మూడు షరతులు తప్పకుండా పాటించాలని చెప్పారు. అవేమింటే, ప్రాంతీయ చట్టాలను తప్పకుండా పాటిం చడం, 2014 నుంచి 2019కి వర్తించేలా ప్రాథమిక సుంకాల వ్యవధిని మెరుగుపర్చడం, ఆటో–ట్రిగ్గర్‌ మెకానిజం అంటే దిగుమతుల వెల్లువనుంచి దేశీయ పరిశ్రమను కాపాడటానికి తక్షణ స్పందనా యంత్రాగాన్ని నెలకొల్పడం.

ఈ అంశంపై వాణిజ్య మంత్రిత్వ శాఖ మాత్రమే పనిచేయడం కాకుండా ఇతర మంత్రిత్వ శాఖలను కూడా ముగ్గులోకి దింపాలి. దిగుమతులు వెల్లువెత్తిన ప్రతిసారీ తక్షణ చర్యలు చేపట్టడం, ప్రాథమిక పన్నును మార్చడం వంటి చర్యలను భారత్‌ చేపట్టడంపై కొన్ని నెలల క్రితం చైనా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు వార్తలు. ఆర్‌సీఈపీతో చర్చలు ముగిసి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ముందు భారత్‌ సమర్థతపై చైనా సందేహాలను లేవనెత్తింది కూడా. ఆర్‌సీఈపీ చర్చలు మొదలెట్టి ఏడేళ్లు అయినప్పటికీ ఈ కీలక సమస్యలను పరిష్కరించడంలో విఫలయ్యారు. 

ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల ప్రారంభ దినాల్లో కూడా, సంపన్న వాణిజ్య మండలి అయిన ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన వ్యవసాయ సబ్సిడీల భారీ కుదింపు వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడికో వెళతాయని ప్రచారం చేశారు. కానీ అది చాలా పెద్ద తప్పిదమైంది. ఈ వ్యవసాయ సబ్సిడీలను ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాల ప్రకారం ఆకుపచ్చ, కాషాయం, నీలం అనే మూడు రంగుల బాక్సులలో వ్యవసాయ సబ్సిడీలను ఉంచడం వంటి చమత్కార ప్రదర్సనలకు పాల్ప డటం తప్పితే వ్యవసాయ సబ్సిడీలు భారత్‌ వంటి దేశాలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అమెరికా ఇస్తున్న సబ్సిడీల కంటే 28 సభ్యదేశాల యూరోపియన్‌ యూనియన్‌ మూడు రెట్లు ఎక్కువగా 65 బిలియన్‌ డాలర్ల మేరకు వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది.

ఈ రెండు దిగ్గజ కూటములతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై త్వరి తంగా సంతకాలు పెట్టేముందు భారతీయ వ్యవసాయంపై వాటి సబ్సిడీలు కలిగించే నష్టం గురించి జాగ్రత్తగా అంచనా వేయాల్సి ఉంది. దేశంలో 60 కోట్లమంది ప్రజలు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వ్యవసాయం చేస్తున్నప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కలిగించే మార్కెట్‌ అవకాశాలను చూసి ఉప్పొంగిపోయే ముందు వ్యవసాయదారుల జీవితంపై విదేశీ సబ్సిడీలు కలిగించే పెనుభారం గురించి అంచనా వేసి తీరాలి. లేక సేవారంగంలోని కొన్ని దిగ్గజ సంస్థలకు ప్రయోజనం కలిగించడానికి మన వ్యవసాయాన్ని బలిపెట్టకూడదు. అందుకే భవిష్యత్తులో జరిగే వాణిజ్య ఒప్పందాల కోసం కూడా మహ్మాత్ముడి సిద్ధాంతాలనే భూమికగా తీసుకోవడం అవశ్యం.

వ్యాసకర్త: దేవీందర్‌ శర్మ, వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌hunger55@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top