
మూడింటిపైనే చర్చ
జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు తూతూమంత్రంగా జరిగాయి. ఏడు అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా..మూడింటితోనే ముగించేశారు.
అనంతపురం సిటీ : జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు తూతూమంత్రంగా జరిగాయి. ఏడు అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా..మూడింటితోనే ముగించేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో చైర్మన్ చమన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రామచంద్ర, డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ కూడా పాల్గొన్నారు. ముందుగా ఆర్థిక, ప్రణాళిక పనులు అనే అంశాలపై చర్చించారు. విద్య-వైద్యంపై సమావేశం సమయంలోనే చైర్మన్ చమన్ అక్కడి నుంచి జనచైతన్య యాత్రకు వెళ్లి పోయారు. దీంతో ఆ సమావేశం జరగలేదు.
గ్రామీణాభివృద్ధి, స్త్రీ సంక్షేమంపై అసలు చర్చే ప్రారంభించలేదు. సాంఘిక సంక్షేమంపై సమావేశానికి పుట్టపర్తి జెడ్పీటీసీ సభ్యురాలు యశోదబాయి గైర్హాజరు కావడంతో ఆ స్థానంలో తాత్కాలిక చైర్మన్‌గా అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు వేణుగోపాల్ వ్యవహరించారు. ఇక వ్యవసాయంఽపై సమావేశానికి మడకశిర జెడ్పీటీసీ సభ్యురాలు సులోచనమ్మ గైర్హాజరు కావడంతో కోరం ఏర్పడలేదు. దీంతో ఈ సమావేశాన్ని రద్దు చేశారు. ఇదిలావుండగా.. స్థాయీ సంఘ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. సభ్యులకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధిలేదని పలువురు అంటున్నారు.
తాగునీటి సమస్య పరిష్కరించండి :పల్లె
జిల్లాలో చాలా గ్రామాలు, చిన్న పట్టణాల్లో తాగు నీరు లేక జనం అల్లాడుతున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. చమన్ అధ్యక్షతన జరిగిన సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఎనిమిది నెలల పాటు జిల్లా వాసులకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే అవకాశముందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామానికి నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.