యువతా మేలుకో..

ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ జ్యోతిబుద్ధ ప్రకాష్‌(ఫైల్‌)


కొనసాగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ

18 వరకు నమోదు గడువు

ముందుకు రాని యువత




ఆదిలాబాద్‌అర్బన్‌ : ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ఓ టరు సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. గత పక్షం రోజుల క్రితం ప్రారంభమైన సవరణ పక్రియ ఈ నెల 18 వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో నూతన ఓటర్ల  నమోదు, ఓటరు కార్డుల్లో తప్పొప్పుల సవరణ, వలస వెళ్లిన వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, చిరునామాలు, పేర్లు, తదితర మార్పులు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన యువత సద్వి నియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నా రు. కానీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 420 మంది యువతను మాత్రమే ఓటరుగా నమోదు చేసుకున్నారు.



ఏ ఫారం ఎందుకోసం..

ఓటరు జాబితాలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం–6ను ఉపయోగించాలి. ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఫారాలను సంబంధిత తహసీల్దార్, మున్సిపల్, ఆర్డీవో, పంచాయతీ, పోలింగ్‌ కేంద్రాలు, మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఓటరు జాబితాలో నమోదై ఉండి కార్డులో పేర్లు, ఫొటోలు, చిరునామాలు తదితర మార్పులు చేసేందుకు ఫారం–8ను వినియోగించాలి.



ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో పోలింగ్‌ కేంద్రానికి మార్చుకునేందుకు ఫారం –8ఏను వాడాలి. వలసవెళ్లిన, పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన, ఉద్యోగం నిమిత్తం ఇతర ప్రదేశాలకు వెళ్లిన, చనిపోయిన వారి పేర్లను జాబితానుంచి తొలగించేందుకు ఫారం–7ను వినియోగించాలి. సంబంధిత వ్యక్తి ఆధార్‌ కార్డు జత చేసి తహసీల్దార్, ఆర్డీవో, మున్సిపల్, బూత్‌ స్థాయి అధికారులకు అందించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వారం పది రోజుల్లో ఫొటో ఓటరు కార్డులు అందిస్తారు. ఇది కాకుండా నియోజకవర్గంలో ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. సవరణ ప్రక్రియలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటికే  వస్తున్నారు. వారికి ఆధార్‌కార్డు చూపించి వివరాలు చెబితే సరిపోతుంది. ట్యాబ్‌లు, స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఫోటోలు తీసుకొని ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేస్తారు.



ప్రచారం శూన్యం..

ఓటరు నమోదుపై నియోజకవర్గంలో ప్రచారం కరువైంది. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో అర్హులైన యువత ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరో పక్క ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగినప్పుడు ప్రజల ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నట్లు ఎన్యూమరేటర్లు పేర్కొంటున్నారు. గ్రామాల్లో చదువుకోని వారు ఓటు నమోదు విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఓటరు సవరణ, నమోదు ప్రక్రియ ఎలాంటి కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించలేదు. ముందస్తు ప్రచారం లేకపోవడంతో ఓటు నమోదుకు స్పందన కరువైందని స్థానికులు పేర్కొంటున్నారు. మీడియా ద్వారా అవగాహన కల్పించి ఓటు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాష్‌ ఇటీవల అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో సూచించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటు నమోదుపై ప్రచారం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top