breaking news
Voter modification process
-
మళ్లీ ఓటరు నమోదు
ఆదిలాబాద్‌అర్బన్: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు, బోగస్ ఓటర్ల ఏరివేత కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఓటర్ల తుది జాబితా తయారీకి ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. 2019 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండే యువత ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే అర్హులైన యువతను ఓటరు జాబితాలో చేర్చేందుకు ఈ నెల 1 నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త ఓటరు నమోదుతోపాటు ఇంతకుముందున్న ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులు, చిరునామాలు, పోలింగ్ కేంద్రాలు మార్చుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తు ఫారాలు ఆయా మండలాల తహసీల్దార్లు, ఆర్డీవోల, బూత్ స్థాయి అధికారి(బీఎల్వో)ల వద్ద అందుబాటులో ఉన్నా యి. ఓటు నమోదుకు యువత ముందుకు రా వాలని, అర్హులు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలని గ్రామాలు, మండలాలు, కళాశాలల్లో ఓటరు నమోదుపై అధికారులు త్వరలో అవగాహ న కార్యక్రమాలు నిర్వహించనున్న సమాచారం. జిల్లాలో ఇలా.. జిల్లాలో గతేడాది నవంబర్ నుంచి డిసెంబర్ చివ రి వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఐఆర్‌ఈఆర్(ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్) పేరిట చేపడితే, బోథ్ నియోజకవర్గంలో స్పెషల్ సమ్మరి రివిజన్ పేరిట చేపట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా ఓటరు కార్డుల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులతోపాటు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసిన అధికారులు 2018 జనవరిలో ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. 2014 సాధారణ ఎన్నిలకు ముందు రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనాభా ప్రకారం చూస్తే ఓటర్లు ఎక్కువగా ఉన్నారని భావించిన ఈసీ ఈ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నికల అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ నెల రోజులపాటు సర్వే చేశారు. ఈ సర్వేలో కొత్త ఓటర్లను నమోదు చేస్తూ, ఓటరు కార్డుల్లో తప్పులు, చిరునామాలు మార్పులు, చేర్పులు చేశారు. చనిపోయిన, వలస వెళ్లిన వారిని ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇలా ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 50 వేల ఓటర్లు తొలగిపోయాయి. చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఉంచారని, అర్హులైన ఓటర్లను తొలగించారని అప్పట్లో కలెక్టర్‌కు, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో 2018 ఫిబ్రవరి నుంచి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి మేలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1 నుంచి ఓటర్ల నమోదు చేపట్టాలని ఆదేశించగా ఈ యేడాదిలోనే రెండోసారి ఓటర్ల నమోదు చేపట్టాల్సి వచ్చిందని చెప్పవచ్చు. మే నెలలో విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 3,52,666 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,76,214 మంది ఓటర్లు ఉండగా, 1,76,391 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 61 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాలో సెప్టెంబర్ ఒకటిన ప్రకటిం చాల్సిన ఓటర్ల ముసాయిదా జాబితాను కొన్ని అనివార్య కారణాల వల్ల 2019 జనవరి ఒకటో తేదిన, జనవరి 4న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల సంఘం అధికా రులు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అవగాహనేది..? ఓటు హక్కుపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. యువత ముందుకు రాకపోవడానికి ఇదే కారణమని అధికారులు సైతం భావిస్తున్నారు. ఓటర్ల దినోత్సవం రోజు, ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి చేయడం తప్ప ఇతర సమయాల్లో నమోదుపై కల్పిస్తున్న దాఖాలాలు తక్కువ. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ సమయాల్లో విద్యాసంస్థలు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో అవగాహన కల్పిస్తే నమోదుకు, మార్పులు, చేర్పులకు ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. రాబోయే రోజుల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఈ కార్యక్రమాలను అర్హత గల వారు సద్వినియోగం చేసుకోవచ్చు. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో తప్పా నేరుగా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాలకు వచ్చి దరఖాస్తులు చేసుకున్న సంఘటనలు తక్కువే. దీంతో ఆశించిన స్థాయిలో ఓటు నమోదు కావడం లేదని సమాచారం. అవగాహన దిశగా చర్యలు చేపట్టి కరపత్రాలు, బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శిస్తే కొందరైనా ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. క్షేత్రస్థాయిలో బీఎల్వోలను ఎప్పటికప్పుడు ఓటు హక్కు నమోదు చేసుకునేలా యువతను ప్రోత్సహిస్తే ఓటరు నమోదు లక్ష్యం కొంతమేరకైనా సాధించవచ్చు. అక్టోబర్ 31 వరకు నమోదు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఇప్పటి నుంచి అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కాకపోయినా తప్పులు, సవరణలు, పేర్లు, చిరునామాల్లో మార్పులు, తొలగింపులు ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చు. జిల్లాలోని మొత్తం 518 పోలింగ్ కేంద్రాల పరిధిలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక ఓటరు నమోదుకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన ప్రతి యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. -
యువతా మేలుకో..
♦ కొనసాగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ ♦ 18 వరకు నమోదు గడువు ♦ ముందుకు రాని యువత ఆదిలాబాద్‌అర్బన్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓ టరు సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. గత పక్షం రోజుల క్రితం ప్రారంభమైన సవరణ పక్రియ ఈ నెల 18 వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియలో నూతన ఓటర్ల నమోదు, ఓటరు కార్డుల్లో తప్పొప్పుల సవరణ, వలస వెళ్లిన వారి ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, చిరునామాలు, పేర్లు, తదితర మార్పులు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన యువత సద్వి నియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నా రు. కానీ ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు యువత ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 420 మంది యువతను మాత్రమే ఓటరుగా నమోదు చేసుకున్నారు. ఏ ఫారం ఎందుకోసం.. ఓటరు జాబితాలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం–6ను ఉపయోగించాలి. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఫారాలను సంబంధిత తహసీల్దార్, మున్సిపల్, ఆర్డీవో, పంచాయతీ, పోలింగ్ కేంద్రాలు, మీ సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఓటరు జాబితాలో నమోదై ఉండి కార్డులో పేర్లు, ఫొటోలు, చిరునామాలు తదితర మార్పులు చేసేందుకు ఫారం–8ను వినియోగించాలి. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చుకునేందుకు ఫారం –8ఏను వాడాలి. వలసవెళ్లిన, పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన, ఉద్యోగం నిమిత్తం ఇతర ప్రదేశాలకు వెళ్లిన, చనిపోయిన వారి పేర్లను జాబితానుంచి తొలగించేందుకు ఫారం–7ను వినియోగించాలి. సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు జత చేసి తహసీల్దార్, ఆర్డీవో, మున్సిపల్, బూత్ స్థాయి అధికారులకు అందించాలి. ఈ ప్రక్రియ పూర్తయిన వారం పది రోజుల్లో ఫొటో ఓటరు కార్డులు అందిస్తారు. ఇది కాకుండా నియోజకవర్గంలో ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. సవరణ ప్రక్రియలో పాల్గొంటున్న ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటికే వస్తున్నారు. వారికి ఆధార్‌కార్డు చూపించి వివరాలు చెబితే సరిపోతుంది. ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫోటోలు తీసుకొని ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేస్తారు. ప్రచారం శూన్యం.. ఓటరు నమోదుపై నియోజకవర్గంలో ప్రచారం కరువైంది. గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో అర్హులైన యువత ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరో పక్క ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగినప్పుడు ప్రజల ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నట్లు ఎన్యూమరేటర్లు పేర్కొంటున్నారు. గ్రామాల్లో చదువుకోని వారు ఓటు నమోదు విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఓటరు సవరణ, నమోదు ప్రక్రియ ఎలాంటి కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించలేదు. ముందస్తు ప్రచారం లేకపోవడంతో ఓటు నమోదుకు స్పందన కరువైందని స్థానికులు పేర్కొంటున్నారు. మీడియా ద్వారా అవగాహన కల్పించి ఓటు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.జ్యోతిబుద్ధ ప్రకాష్ ఇటీవల అధికారులతో నిర్వహించిన ఓ సమావేశంలో సూచించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటు నమోదుపై ప్రచారం కల్పించాలని పలువురు కోరుతున్నారు.


