తిరుపతికి స్మార్ట్ కల చెదిరింది... | Sakshi
Sakshi News home page

తిరుపతికి స్మార్ట్ కల చెదిరింది...

Published Sat, Feb 20 2016 10:16 AM

తిరుపతికి స్మార్ట్ కల చెదిరింది... - Sakshi

► 3.07 మార్కుల తేడాతో చేజారిన అవకాశం
► మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
►మార్చి మొదటి వారం నుంచి రెండో దశ
► సక్సెస్ సాధించిన కన్సల్టెన్సీ వైపు కమిషనర్ ఆసక్తి  

తిరుపతి:  దేశంలో వంద స్మార్ట్ నగరాల జాబితాలో చోటు దక్కించుకున్న తిరుపతి, తొలిదశలో అభివృద్ధి చేయనున్న టాప్ 20 నగరాల జాబితాలో స్థానం కోల్పోయింది. ఇప్పుడు తాజాగా మలి దశ పోటీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

గత ఏడాది దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా, 98 నగరాల జాబితాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఏడాది వ్యవధిలో మూడు పర్యాయాల్లో వీటిని అభివృద్ధి చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో 20 నగరాలు, మలిదశలో 40, ఆ తరువాత మిగిలిన నగరాలకు నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఏపీలో తిరుపతితో పాటు విశాఖ, రాజమండ్రి నగరాలను ఎంపిక చేశారు. ఈ నెల 28న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టాప్- 20 నగరాల జాబితాను ప్రకటించారు. ఆధ్యాత్మిక నగరం కావడంతో తిరుపతికి చోటుఖాయంగా భావించారు. కానీ తిరుపతి వాసులకు నిరాశ మిగిలింది. విశాఖ, రాజమండ్రి నగరాలు మాత్రమే రాష్ట్రం నుంచి తొలి జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

తేడా 3.07 మార్కులే
 టాప్-20 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసేందుకు కేంద్రం వివిధ మార్గదర్శకాలతో కఠిన నిబంధన పెట్టింది. తాగునీరు, రవాణా, డ్రైనేజీ, స్వచ్ఛభారత్, పన్నుల వసూళ్లు, ఆదాయం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో నగరాల పనితీరు, చేపట్టబోయే పనులు వంటి వాటి ఆధారంగా మార్కులను కేటాయించారు. ఈ మార్గదర్శకాల ఆధారంగా ఆయా నగరాలు కన్సెల్టెన్సీల ద్వారా తయారుచేసిన డీపీఆర్‌ను కేంద్రానికి అందజేశాయి. వాటిని బేరీజువేసి ఆయా నగరాలకు మార్కులను కేటాయించారు. ఈ మార్కుల ఆధారంగా టాప్ 20 నగరాలను ప్రకటించారు. ఇందులో తిరుపతికి చోటు దక్కలేదు. సరైన డీపీఆర్‌ను అందించలేకపోవడంతో 51.78 మార్కులు వచ్చాయి. 20వ నగరంగా ఎంపికైన భోపాల్ నగరానికి 55.45 పాయింట్లు వచ్చాయి. 3.07 మార్కులతో తిరుపతి టాప్ 20లో స్థానం దక్కించుకోలేకపోయింది.

మరో అవకాశం
టాప్-20 స్మార్ట్ నగరాల్లో తక్కువ మార్కులతో వెనుకంజలో ఉన్న నగరాలకు కేంద్రం నిబంధనలను సడలించి సత్వరమే మలి దశకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మరో ఏడాది తరువాత 40 నగరాలను ఎంపిక చేయాల్సి ఉండగా మలిదశ ఎంపికను ఈ యేడాది ఆగస్టు కల్లా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. నాలుగు రోజుల క్రితం కేంద్రం ఇందుకు సబంధించిన మార్గదర్శకాలను విడుదలచేసి వెబ్‌సైట్‌లో ప్రవేశపెట్టింది. మార్చి మొదటి వారంలో స్మార్ట్ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారం నుంచి జూన్ 30 వరకు అన్నివిధాలా నివేదికలను సిద్ధం చేసి కేంద్రానికి అందించాలి ఉంది. ఆగస్టు మొదటి వారంలో మలి దశలో టాప్ 40 స్మార్ట్ నగరాలను కేంద్రం ఎంపిక చేయనుంది.
 
టాప్ 40లో తిరుపతిని నిలబెడతాం
స్మార్ట్ నగరాల ఎంపికలో మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే డ్రాప్టింగ్‌లో కేంద్రాన్ని సంతృప్తి పరచలేకపోయాము. కారణాలు ఏమైనా మలిదశ పోటీకి పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉన్నాము.  గత అనుభవం నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని మలిదశ లో తిరుపతిని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
 - వినయ్‌చంద్, కమిషనర్

Advertisement
Advertisement