విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం వంటి రంగాలు నిర్వీర్యం కావడానికి ప్రభుత్వ సంస్కరణలే కారణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. శనివారం స్థానిక వైఎంహెచ్‌ఎ హాలులో జరిగిన స్వాతంత్య్ర సమరయోథుడు అన్నే వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్కరణల వల్లే ప్రధాన రంగాల నిర్వీర్యం
Sep 10 2016 11:45 PM | Updated on Sep 4 2017 12:58 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : విద్య, వైద్యం, తాగునీరు, వ్యవసాయం వంటి రంగాలు నిర్వీర్యం కావడానికి ప్రభుత్వ సంస్కరణలే కారణమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. శనివారం స్థానిక వైఎంహెచ్‌ఎ హాలులో జరిగిన స్వాతంత్య్ర సమరయోథుడు అన్నే వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నీరు పుష్కలంగా ప్రవహించే పశ్చిమగోదావరి వంటి జిల్లాల్లో సైతం తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరక్క వాటర్ ప్లాంట్లు, బాటిళ్ల నీళ్లపై ఆధారపడాల్సి రావడం సంస్కరణలకు పరాకాష్ట అన్నారు. గతంలో భారీ పరిశ్రమలు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేవన్నారు. సంస్కరణల ప్రవేశం తరువాత అటువంటి సేవలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పత్తిని నిర్వీర్యం చేసి విదేశీ దిగుమతులపై ఆధారపడే విధంగా సంస్కరణలు ప్రభావితం చేశాయన్నారు. సంస్కరణల తరువాతే విద్య, వైద్యం వంటి అన్ని సేవలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లి భారీ ధరలు వెచ్చించి కొనుక్కోవాల్సి వస్తోందన్నారు. రైతులకు ఉపయోగపడే భూసేకరణ చట్టాన్ని మార్చాలని మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అలాగే బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ఆ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 70 ఏళ్ల రాజకీయ అనుభవం గల అన్నే వెంకటేశ్వరరావు జీవితం నేటి తరానికి స్ఫూర్తి అని, ఆయన అనుభవాలను 30 మంది రచయితలు కలిసి పుస్తకంగా రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణ, యు.వెంకటేశ్వరరావు, కాటం నాగభూషణం, చింతకాయల బాబూరావు, ఆర్.సత్యనారాయణ రాజు, దిగుపాటి రాజగోపాల్, డేగా ప్రభాకర్, సుందరరామరాజు, మంతెన సీతారామ్, డి.బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement