ఇల్లు అద్దెకు కావాలని నిలువు దోపిడీ | Sakshi
Sakshi News home page

ఇల్లు అద్దెకు కావాలని నిలువు దోపిడీ

Published Fri, Jul 17 2015 5:21 PM

బాధితుడు రమేష్ - Sakshi

 • ఇంటి యజమానిని నిర్బంధించి దాడి
 • బంగారం గుంజుకున్న దుండగులు
 • ఏటీఎం నుంచి రూ.50 వేలు డ్రా...
 • కుత్బుల్లాపూర్: ఇంట్లో అద్దెకు దిగి ఇంటి యజమానిని బెదిరించి, తాళ్లతో కట్టేసి ఆరుగురు దుండగులు ఐదు తులాల బంగారు నగలు దోచుకోవడంతో పాటు ఏటీఎం నుంచి రూ. 50 వేలు డ్రా చేసుకెళ్లారు. పేట్‌బషీరాబాద్ సీఐ రంగారెడ్డి, బాధితుడి కథనం ప్రకారం.. గోదావరి హోమ్స్‌లో నివాసముండే బులుసు రమేష్‌బాబు కారంపొడి వ్యాపారి. ఇతనికి సుచిత్ర రోడ్డులోని చర్మాస్ జీన్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న జె.కె.నగర్‌లో మరో ఇల్లు ఉంది. పదిహేను రోజుల క్రితం శర్మ అనే వ్యక్తి రూ.5 వేలు చెల్లించి పైఫోర్షన్‌లో అద్దెకు దిగాడు.
   
  బుధవారం ఉదయం అదే ఇంట్లో కింద ఫోర్షన్ గోదాము కోసం కావాలని రమేష్‌బాబుకు శర్మ ఫోన్ చేశాడు. గురువారం అగ్రిమెంట్ రాసుకుందామని ఉదయం 9.15కు మరోమారు ఫోన్ చేయగా 9.30కి రమేష్ వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే ఆరుగురు దుంగులు అతడిని బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్లి కాళ్లు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఉంగరాలు, మెడలోని గొలుసు (మొత్తం 5 తులాలు) దోచుకున్నారు. తర్వాత పర్సులో ఉన్న ఏటీఎం కార్డు లాక్కొని, చంపేస్తామని బెదిరించి పిన్ నెంబర్ తెలుసుకున్నారు. ఏటీఎం సెంటర్‌కు వెళ్లి  రూ.50 వేలు డ్రా చేశారు. తర్వాత ‘నీ బ్యాంక్‌లో అకౌంట్‌లో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలిసింది, మాకు రూ.14 లక్షలు కావాలి, ఆ మొత్తానికి చెక్కు ఇవ్వు’ అని దుండగుల్లో ఒకడు రమేష్‌పై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తామని కత్తితో బెదిరించాడు.
   
  చెక్‌బుక్ గోదావరి హోమ్స్‌లోని ఇంటి వద్ద ఉందని చెప్పగా ఇంటికి వెళ్లి చెక్ బుక్‌తో జీడిమెట్ల గ్రామ సమీపంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వద్దకు వెళ్లారు. ఇద్దరు వ్యక్తులు రమేష్‌ను బైక్ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. వీపుపై కత్తి పెట్టి ‘అరిస్తే చంపేస్తాం.. మీ ఇంటి వద్ద మా వాళ్లు మరో నలుగురు ఉన్నారు. ఇక్కడ  ఏమైనా తేడా వస్తే మీ కుటుంబ సభ్యులందరినీ ఖతం చేస్తాం’ అని హెచ్చరించారు. కాగా, బ్యాంక్‌లోకి వెళ్లిన రమేష్ ఆందోళనతో ఉండడాన్ని గమనించిన బ్యాంక్ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు. అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయగా క్షణాల్లో పోలీస్ వాహనం వచ్చింది. ఇది గమనించిన ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారు. అంతే కాకుండా ఇంటి వద్ద ఉన్న దుండగులు కూడా కనిపించకుండాపోయారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దుండగులను పట్టుకొనేందుకు పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దింపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement