మృత్యు ప్రయాణం | Road accident in vizianagaram district, six members died | Sakshi
Sakshi News home page

మృత్యు ప్రయాణం

May 24 2017 11:22 AM | Updated on Aug 30 2018 4:10 PM

మృత్యు ప్రయాణం - Sakshi

మృత్యు ప్రయాణం

మండుటెండలో త్వరత్వరగా ఇంటికి చేరుకుందామనుకున్న వారి ప్రాణాలు అకస్మాత్తుగా గాలిలో కలసిపోయాయి.

► ఆరుగురి బతుకులను చిదిమేసిన ఆటో
►మండుటెండవేళ మృత్యుశకటమైన లారీ
►రెప్పపాటులో గాలిలో కలసిపోయిన ప్రాణాలు
►నాతవలస – విజయనగరం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం
►ఆరుగురు మృతి– నలుగురికి తీవ్ర గాయాలు
►భయానకంగా మారిన సంఘటనా స్థలం


మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 1.45 అవుతోంది. ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. మండుటెండలో త్వరత్వరగా ఇంటికి చేరుకుందామనుకున్న వారి ప్రాణాలు అకస్మాత్తుగా గాలిలో కలసిపోయాయి. కలకాలం జీవిద్దామని గూడు కట్టుకునే సామగ్రి కొనుగోలు కోసమని ఒకరు... అక్క పెళ్లికి చేసిన అప్పు తీరుద్దామని మరొకరు... ఉపాధినిచ్చే కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి పయనమైన మరికొందరు... వ్యవసాయం చేస్తూ బ్యాంకు పని మీద వచ్చిన ఇంకొకరు... ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో అవసరం... కానీ పొంచి ఉన్న మృత్యువుది మాత్రం ఒకే దారి.  పాపం వారికి తెలియదు ఇదే తమ చివరి ప్రయాణమని. తామెక్కే ఆటోయే తమ బతుకులను చిదిమేస్తుందని. మరో పదిహేను నిమిషాల్లో గమ్యం చేరుతామని ఆటో ఎక్కిన వారంతా అర్ధంతరంగా మృత్యు పాశానికి బలయ్యారు.

విజయనగరం: డెంకాడ మండలం చందకపేట సమీపంలో నాతవలస వైపు నుంచి విజయనగరానికి వస్తున్న ప్రయాణికుల ఆటోను విజయనగరం నుంచి నాతవలస వైపుగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన లారీ ఢీకొంది. మితిమీరిన వేగంతో వచ్చిన లారీదే తప్పు అని స్పష్టంగా తెలుస్తోంది. పరిమితికి మించి ప్రయాణికులతో ఎదురుగా వస్తున్న ఆటో ఎటూ  తప్పించుకోలేక ప్రమాదానికి గురైంది. విజయనగరం– నాతవలస రహదారి పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న తారు రోడ్డుపై మరో లేయర్‌ వేస్తున్నారు.

 

ప్రస్తుతానికి రోడ్డుపై ఒకవైపు లేయర్‌ వేసే పని పూర్తయ్యింది. ఈ క్రమంలో కొత్త లేయర్‌ ఉన్న రోడ్డుపై వెళ్లాల్సిన లారీ కింద నుంచి వెళ్లింది. రాంగ్‌ రూట్‌లోనే మితివీురిన వేగంతో లారీ డ్రైవర్‌ నడుపుతున్నాడు. అదే సమయంలో పరిమితికి మించిన ప్రయాణికులతో ఆటో ఎదురుగా వచ్చింది. వేగంతో వేస్తున్న లారీని తప్పించేందుకు ఆటో డ్రైవర్‌ అటు ఇటుగా తిప్పాడు. ఎడమవైపు వెళ్తే పక్క నున్న వాహనాలొచ్చి ఢీకొంటాయని భయంతో రోడ్డు మధ్యలో వెళ్లాడు. కానీ, లారీ డ్రైవర్‌ అదేమి గమనించలేదు. ఆటో డ్రైవర్‌ హారన్‌ను వినిపించుకోలేదు. ఆటోలో ఉన్న వారు చేతులు ఊపి సైగలు చేస్తున్నా పట్టించుకోలేదు. వేగంగా వచ్చి సరాసరి ఢీకొన్నాడు.

ఆటో గాల్లోకి తేలిపోయింది. రెండు మూడు పల్టీలు కొట్టి కిందకి పడింది. ఆటోలో ఉన్న ప్రయాణికుల్లో కొందరు తుళ్లిపోయారు. నిర్జీవమై రహదారిపైనా, రహదారి పక్కనున్న తుప్పల్లో విసిరేసినట్టు పడిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ విలవిలలాడారు. మరికొన్ని మృతదేహాలు ఆటోలోనే చిక్కుకుపోయి వేలాడుతూ కనిపించాయి. అంతే ఊహించని ఈ పరిణామంతో ఆ స్ధలం బీతావహంగా మారింది. మిట్ట మధ్యాహ్నం, మండు టెండలో  ప్రమాదం చోటు చేసుకోవడంతో క్షతగాత్రులను తక్షణం ఆదుకునేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావటంతో మృతదేహాలను గుర్తింçచటానికి కూడా చాలా సమయం పట్టింది.


సంఘటనాస్థలంలోనే ఐదుగురి మృతి
సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. విశాఖపట్నం అక్కయ్యపాలేనికి చెందిన ఆటోడ్రైవర్‌ ముక్కు బంగార్రాజు పైడిభీమవరం స్టాండ్‌ నుంచి ఆటో నడుపుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కొందరు ప్రయాణికులను ఎక్కించుకుని విజయనగరానికి బయలుదేరారు. అనుకోని ఈ సంఘటనలో పూసపాటి రేగ మండలం గులివిందపేటకు చెందిన గులివింద అప్పలనాయుడు(45), అదే మండలం చోడమ్మ అగ్రహారానికి చెందిన ఆవాల శంకరరావు(48), భోగాపురం మండలం మాల నందిగాంకు చెందిన మిరప గోవింద(37), రణస్థలం మండలం పాతర్లపల్లికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నెల్లిమర్ల అప్పారావు(30), డెంకాడకు చెందిన బంగారి సూరి(34), విజయనగరం పట్టణంలోని కోరాడ వీధికి చెందిన ఆర్‌.రాజేష్‌(23) మృతి చెందారు.

గాయపడిన వారిలో డెంకాడకు చెందిన బంగారి అప్పారావు, పి.శ్రీను, ఆటో డ్రైవర్‌ ముక్కు బంగార్రాజు, విజయనగరానికి చెందిన ఆర్‌.రాజశేఖర్‌ ఉన్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎల్‌.కె.వి.రంగారావు, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి పరిశీలించగా, జిల్లా కేంద్రాస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ పరామర్శించారు. కాగా, క్షతగాత్రులు చూస్తుండగానే  ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్‌ అక్కడి నుంచి  పరారయ్యారు.  


ఆసుపత్రిలో హాహాకారాలు
డెంకాడలో జరిగిన ఘోర దుర్ఘటనలో తీవ్ర గాయాల పాలైన వారిని విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ వారికి అవసరమయిన ప్రాధమిక చికిత్స చేసి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నవారిని వెంటనే కేజీహెచ్‌ లేదా ఇతర ఆస్పత్రులకు తరలించాలని సిబ్బంది సూచించాల్సి ఉంది. అయితే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల హాహాకారాలు, ప్రమాద ఘటనలో గాయాలైనవారి అరుపులతో ఆసుపత్రి ప్రాంగణమంతా మార్మోగిపోయింది. వారికి కట్టు కట్టి ఇతర రికార్డులు రాసుకునే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు తప్ప వారిని వెంట వెంటనే మెరుగైన వైద్యం కోసం తరలించే ప్రయత్నం చేయలేదు.

తలకు తీవ్రగాయాలైన కోరాడ వీధికి చెందిన ఆర్‌.రాజశేఖర్‌(21) పెద్దగా కేకలు వేస్తూ రక్షించండి. కాపాడండి అంటూ జనరల్‌వార్డులో అరుసూ్తనే ఉన్నాడు. దాదాపు గంటకు పైగా ఆయన కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. మరో క్షతగాత్రుడు పి.శ్రీనివాసరావు షాక్‌కు గురై క్షణానికోకారణం చెబుతున్నాడు. తాను సినిమాకు వెళ్లివస్తున్నాననీ, ఆస్పత్రికి వెళ్లాననీ, తనకు తానుగా పడిపోయానంటూ రోదించాడు. ఇతనికి దెబ్బ బాగా తగిలిందనీ చెప్పిన వైద్య సిబ్బంది కనీసం మెరుగయిన వైద్యం కోసం ఎక్కడికయినా తరలిద్దామన్న ప్రయత్నం చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement