మహిళా కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
రాయదుర‍్గం(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా రాయదుర‍్గం మండలం ఆవులదట‍్ల గ్రామ శివారులో బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు దుర‍్మరణం చెందగా మరో పది మంది గాయపడ్డారు. 15 మందికి పైగా మహిళలు కూలిపనుల కోసం ఆటోలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ సంఘటనలో వన‍్నూరమ‍్మ, వన‍్నూరక‍్క, దుర‍్గ అనే మహిళా కూలీలు అక‍్కడికక‍్కడే మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. క్షతగాత్రులను రాయదుర‍్గం ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున‍్న రాయదుర‍్గం పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం మూలంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.