చౌక దుకాణాలు టీడీపీ లీడర్లకే !

ration shops Allocation to tdp activists - Sakshi

అనుకున్నదే అయింది..

రిజర్వేషన్లకు సైతం తిలోదకాలు

తొలుత ప్రకటించిన జాబితాలో మార్పులు

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ప్ర భుత్వ చౌక దుకాణాల కేటాయింపు విషయంలో అనుకున్నదంత అయ్యింది. అందరూ భావించిన విధంగానే అధికారులు ఎఫ్‌పీ షాపులు టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టారు. నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. అధికార టీడీపీ నేతలు ఒత్తిళ్లకు తలొగ్గి రిజర్వేషన్లను సైతం తారుమారు చేశారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. శాశ్వత ప్రాతిపదిక మీద ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితా అంటూ తొలుత ప్రకటించి ఆ తర్వాత వాటిలో మార్పులు చేయడం ఆరోపణలకు బలమిస్తోంది. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప రెవెన్యూ డివిజన్‌ పరిధిలో చాలా ఏళ్లుగా ఎఫ్‌పీ షాపులు ఖాళీగా ఉన్నాయి. టెంపరరీ డీలర్లు మాత్రమే కొనసాగుతూ వచ్చారు. రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 275 ఖాళీలను భర్తీ చేసేందుకు గతంలో పలుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే కొందరు కోర్టులను ఆశ్రయించి స్టేలు తీసుకురావడం, ఏదో ఒక విధంగా అడ్డుకోవడం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఎఫ్‌పీ షాపుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.

రాత పరీక్ష పెట్టి
డివిజన్‌లోని 275 షాపులకుగాను 226 వాటికి దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, ఈనెల 10వ తేది కడపలో నిర్వహించిన రాత పరీక్షకు 725 మంది హాజరయ్యారు. అదే రోజు ప్రశ్నపత్రం లీకై అయిందన్న ఆరోపణలు వెల్లవెత్తాయి. అందులో వాస్తవాలు లేవంటూ అధికారులు ఎంపికైన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిం చారు. మార్కుల జాబితాలు కూడా ప్రచురిం చకుండా ఇంటర్వ్యూకు కాల్‌ లెటర్లు పం పారు. బుధవారం విడుదల చేసిన జాబి తాలను పరిశీలించిన పలువురు విస్తుపోవాల్సి వచ్చింది. ఇందులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు చింతకొమ్మదిన్నె మండలంలోని భాకరాపేటలో ఉన్న 31వ ఎఫ్‌పీ షాపు ఎస్సీలకు రిజర్వు చేశారు.

కాగా, గతంలో ప్రొఫెసర్స్‌ కాలనీలో ఉన్న 32వ నెంబరు ఎఫ్‌పీ షాపునకు టెంపరరీ డీలర్‌గా పని చేసి విజిలెన్స్‌ కేసులో కూడా ఉన్న  ఓసీ వర్గానికి చెందిన వ్యక్తికి 31వ నెంబరు షాపు కేటా యించారని తెలిసింది. 31వ షాపు భాకరాపేటలో ఉండగా ఊటుకూరు అనే పేరుతో ఆ వ్యక్తికి కట్టబెట్టారని చెబుతున్నారు. స్థానిక టీడీపీ నేతల ఒత్తిళ్లతో రిజర్వేషన్లను సైతం అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక సుండుపల్లె మండలంలోని 12వ నెంబరు చౌక దుకాణానికి గంగారపు చెన్నకృష్ణ అనే వ్యక్తి ఎంపికైనట్లు అధికారులు తొలుత జాబితాను విడుదల చేశారు. అంతలోనే ఏమైందో తెలియదుగానీ జాబితాలో తన పేరు తొలగించారని గంగారపు చెన్నకృష్ణ ‘సాక్షి’ వద్ద వాపోయారు. ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. ఇంకా పలు మండలాల్లో ఇదే తంతు కొనసాగిందని తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top