
'ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అపచారం'
గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరఘాట్లో తొక్కిసలాట.. 27 మంది భక్తుల మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి పుష్కరఘాట్లో తొక్కిసలాట.. 27 మంది భక్తుల మరణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యత అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... పుష్కర ఏర్పాట్లన్నీ చంద్రబాబే చూసుకుంటున్నారని టీడీపీ నేతలే గొప్పగా చెప్పారని గుర్తు చేశారు.
పుష్కర మరణాలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓ వేళ రాజీనామా చేయకపోతే చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబును రఘువీరా నిలదీశారు. రాజమండ్రి నుంచి చంద్రబాబు వెళ్లిపోతే అధికారులు వారి పనులు వారు చూసుకుంటారని సూచించారు.
పుష్కర ఘాట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అపచారమని రఘువీరా తెలిపారు. ఎన్టీఆర్ను చంపిన పాపాన్ని కడిగేసుకోవడానికి ఆయన విగ్రహాన్ని పుష్కర ఘాట్లో ఏర్పాటు చేశారని విమర్శించారు. అందుకు 27 మందిని బలిచ్చారన్నారు రఘువీరారెడ్డి.