పెటాకులైన ‘ఫేస్‌బుక్‌’ ప్రేమ పెళ్లి

బాధితురాలు - Sakshi

పెద్దవడుగూరు (తాడిపత్రి): ఫేస్‌బుక్‌లో ఏడాదిపాటు చాటింగ్‌ చేసుకున్న ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకున్నాక పది రోజులు కూడా కలిసి ఉండలేకపోయింది. అమ్మాయిని వదిలి అబ్బాయి ఉడాయించాడు. న్యాయం కోసం అబ్బాయి ఇంటి వద్ద అమ్మాయి ఆందోళనకు దిగింది. పెద్దవడుగూరు మండలం ఆవులాంపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

 

ఆవులాంపల్లికి చెందిన సుదర్శన్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతడికి బీఈడీ పూర్తిచేసిన గార్లదిన్నెకు చెందిన అరుణశ్రీ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఏడాదిపాటు చాటింగ్‌ చేసుకుంటూ వచ్చారు. ఇద్దరూ ప్రేమలో పడటంతో ఇరు కుటుంబాల పెద్దలకూ తెలపకుండా మార్చి పదో తేదీన కర్నూలు జిల్లా బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమ కుమారుడు కనిపించడం లేదంటూ సుదర్శన్‌ తల్లిదండ్రులు పెద్దవడుగూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచచేశారు.

 

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రేమజంటను వెతికి స్టేషన్‌కు పట్టుకొచ్చారు. అప్పటికే వీరికి పెళ్లయ్యి నాలుగు రోజులు గడిచింది. వీరి పెళ్లిని అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆ జంట అమ్మాయి పుట్టింటికి వెళ్లింది. అక్కడ కూడా పెద్దలు తిరస్కరించారు. దీంతో వారు అక్కడి నుంచి వచ్చేశారు. పామిడిలో ఫంక‌్షన్‌ ఉందని, అక్కడకు వెళ్లేందుకు కొత్త బట్టలు తెచ్చుకుందామని చెప్పి సోమవారం ఉదయం అరుణశ్రీని సుదర్శన్‌ పామిడిలోని షాప్‌ వద్దకు తీసుకెళ్లాడు. ఇప్పుడే వస్తానని నమ్మబలికి ఆమెను అక్కడే ఉంచి బయటికెళ్లిపోయాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్‌ పనిచేయకపోవడంతో ఆందోళనకు గురైన అరుణశ్రీ ఆవులాంపల్లికి వెళ్లి ఆరా తీయగా.. ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదని సుదర్శన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. తన భర్తను మీరే ఎక్కడో దాచారని ఆందోళనకు దిగింది. దీంతో వారు ఇంటికి తాళం వేసి పక్కకు వెళ్లిపోయారు. చేసేదిలేక అరుణశ్రీ కూడా కాసేపటి తర్వాత అక్కడి నుంచి నిష్క్రమించింది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top