తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని రుణదాతలు అపహరించుకుపోయారు.
శంషాబాద్ (రంగారెడ్డి) : తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో ఓ వ్యక్తిని రుణదాతలు అపహరించుకుపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన బురాన్ శంషాబాద్‌లోని మధురానగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగానే వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు దేవరకద్రకు చెందిన సుజాత అనే మహిళ దగ్గర రూ.40వేలు అప్పు కింద తీసుకున్నాడు.
సోమవారం సాయంత్రం బురాన్ ఇంటికి సుజాత తరఫున నలుగురు వ్యక్తులు వచ్చి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని కోరారు. తనకు బయట వచ్చేవి ఉన్నాయని, అవి వచ్చిన వెంటనే తీరుస్తానని అతడు చెప్పాడు. దీంతో మాట్లాకుందాం రమ్మంటూ అతడ్ని తమ వెంట తీసుకెళ్లిపోయారు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ నర్సమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.