వ్యభిచారం చేస్తున్నావా.. అంటూ బెదిరించి | gang rape women in gajuvaka | Sakshi
Sakshi News home page

వ్యభిచారం చేస్తున్నావా.. అంటూ బెదిరించి

Jul 7 2017 12:18 PM | Updated on Jul 28 2018 8:53 PM

వ్యభిచారం చేస్తున్నావా.. అంటూ బెదిరించి - Sakshi

వ్యభిచారం చేస్తున్నావా.. అంటూ బెదిరించి

బీసీ రోడ్‌లో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

గాజువాక:
బీసీ రోడ్‌లో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు బాలుడు. మరొకరు పాత నేరస్తుడు. తాము పోలీసులమంటూ బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని రిమాండ్‌కు, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలిస్తున్నట్టు సౌత్‌ ఏసీపీ జె.రామ్మోహన్‌రావు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ కాంప్లెక్స్‌లో ఈ కేసు వివరాలను ఆయన వెల్లడించారు.

డ్రైవర్స్‌ కాలనీకి చెందిన సి.హెచ్‌.పురుషోత్తం పాత నేరస్తుడు. అతడికి పెదగంట్యాడకు చెందిన కె.వెంకట్‌కుమార్, నాతవరానికి చెందిన హర్షరాజు, మరో 16 ఏళ్ల బాలుడు స్నేహితులు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం కాకతీయ ఐటీఐ సమీపంలో తన ముగ్గురు పిల్లలతో ఉన్న సిక్కిం మహిళ ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. తాము పోలీసులమని, ఈ ఇంట్లో వ్యభిచారం సాగుతున్నట్టు తమకు సమాచారం అందిందని, డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు చేయడంతోపాటు కుటుంబం మొత్తాన్ని రోడ్డుకీడ్చేస్తామని బెదిరించారు. ఇంటి బయట ఎస్‌ఐ ఉన్నారని పురుషోత్తంను చూపించారు. ఆ ఇంటికి చుట్టుపక్కల నివాసముంటున్న ఆమె బంధువులు కూడా వారిని గమనించి వారించడానికి ప్రయత్నించారు.

దీంతో ఇద్దరు వ్యక్తులు వారిని తమ ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. అనంతరం బాధితురాలిని వంట గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తాము మళ్లీ మరుసటిరోజు వస్తామని, డబ్బులు ఇవ్వకపోతే రోడ్డుకీడ్చుతామని హెచ్చరించారు. వారు వెళ్లిపోయిన అనంతరం తమ బంధువుల సహకారంతో బాధితురాలు గాజువాక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నిందితులు చెప్పిన మాట ప్రకారం బాధితురాలికి మరుసటిరోజు పురుషోత్తం ఫోన్‌ చేశాడు. ఇంటికి వస్తే డబ్బులు ఇస్తానని ఆమె చెప్పడంతో వచ్చాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న పోలీసులు పురుషోత్తంను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతడు చెప్పిన వివరాలతో మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి సీఐ మళ్ల శేషు, ఎస్‌ఐ పి.అప్పలరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement