మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని.. | Furious girlfriend pouring acid her lover face in guntur district | Sakshi
Sakshi News home page

మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని..

May 24 2017 8:31 AM | Updated on Aug 24 2018 2:36 PM

ప్రమాద స్థలంలో కాలిన గోడ - Sakshi

ప్రమాద స్థలంలో కాలిన గోడ

ప్రేమించిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి ప్రియుడిపై యాసిడ్‌ పోసి హతమార్చింది.

ప్రేమించిన యువకుడిపై యాసిడ్‌ దాడి
చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రియుడు
అదుపులో నిందితురాలు  


పెదకాకాని(పొన్నూరు): ప్రేమించిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి ప్రియుడిపై యాసిడ్‌ పోసి హతమార్చింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా వెనిగండ్లలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల ఎస్సీ కాలనీలో బుల్లా అర్జునరావు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. మంగళవారం సాయంత్రం అర్జునరావు ఇంటికి అతని స్నేహితుడు షేక్‌ ఖాశిం ఒక యువతిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ యువతి తన చెల్లెలని అర్జునరావుకు, అతని తల్లికి చెప్పాడు. స్నేహితుడి చెల్లెలేకదాని వారు ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చారు. కొద్ది సేపటికి బెడ్‌రూం పక్కగా ఉన్న ప్రహరీ దూకి ఇలియాజ్‌(25) అనే యువకుడు బెడ్‌రూంలోకి ప్రవేశించాడు.

బెడ్‌రూంలోకి వెళ్లిన ఇలియాజ్‌ కొద్ది సేపటికి కేకలు వేస్తూ అదే ప్రహరీ దూకి పరుగులు తీశాడు. ఆ ప్రదేశంలో బాధితుడి రక్తపుమరకలు గోడపై ముద్రలుగా పడ్డాయి. స్థానికులు అతడిని వెంటపడి పట్టుకున్నారు. అప్పటికే ఇలియాజ్‌ చర్మం పట్టుకున్న చోట ఊడి వస్తోంది. తాను దొంగను కాదని, ఆ అమ్మాయి, తాను ప్రేమించుకున్నామని చెప్పాడు. ఇంట్లో పెద్దలను ఎదిరించలేక మూడు రోజుల కిందట వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, దీంతో ఆమె తనను ఇక్కడికి పిలిచి యాసిడ్‌ పోసిందని, తనను కాపాడమని వేడుకున్నాడు.

స్థానికులు హుటాహుటిన ఇలియాజ్‌ను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలియాజ్‌ది తాడికొండ కాగా, యాసిడ్‌ పోసిన యువతి గుంటూరుకు చెందిన హిమబిందు. అప్పటికే పోలీసులు ఖాశిం, అర్జునరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యాసిడ్‌ పోసి దాడి చేసి హతమార్చడం అంతా ఒక పథకంలా జరిగిందని భావిస్తున్నారు.

ఆ యాసిడ్‌ నన్నేమీ చేయలేదు...
హిమబిందు కాళ్ల మీద కూడా యాసిడ్‌ ఉండటాన్ని గమనించిన స్థానికులు తుడుచుకోవాలని చెప్పినప్పటికీ అది నన్నేం చేయదులే గానీ.. కొంచెం పెరుగు ఉంటే పెట్టండి దానిపై పూయడానికి.. అని ధీమాగా మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి మంగళగిరి సీఐ బ్రహ్మయ్య, ఎస్‌ఐ పి.ప్రేమయ్య సిబ్బందితో చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు పెదకాకాని ఇన్‌చార్జి సీఐ బ్రహ్మయ్య నేతృత్వంలో క్లూస్‌టీం తనిఖీలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement