మద్యం మత్తులో జనం మీదికి... | Farmer dead on road accident | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో జనం మీదికి...

Sep 11 2016 7:48 AM | Updated on Oct 1 2018 4:01 PM

మద్యం మత్తులో జనం మీదికి... - Sakshi

మద్యం మత్తులో జనం మీదికి...

మద్యం మత్తులో ఒక కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోవడంతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గన్నవరం వద్ద కారు బీభత్సం 
బైక్‌ను, రెండు ఆటోలను ఢీ 
రైతు దుర్మరణం, నలుగురికి గాయాలు 
ఆ కారులో జనసేన సభకు వెళ్లి వస్తున్నారా? 
పరారీలో డ్రైవరు, పోలీసుల అదుపులో ఒకరు
 
గన్నవరం :  మద్యం మత్తులో ఒక కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోవడంతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గన్నవరం మండంలోని కేసరపల్లి బైపాస్‌ వద్ద శనివారం  ఒక తాగుబోతు కారు డ్రైవర్‌ నానా బీభత్సం సృష్టించాడు. పోలీసుల సమాచారం ప్రకారం... కేసరపల్లి గ్రామానికి చెందిన రైతు నెరుసు రామారావు(53) శనివారం ఉదయం పొలానికి వెళ్ళేందుకు ఇంటి నుండి బైక్‌పై బయలుదేరాడు. సావరిగూడెం బైపాస్‌ వద్దకు రాగనే ఏలూరు నుంచి విజయవాడ వైపు వేగంగా దూసుకువచ్చిన కారు రామారావు బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

అంతటితో ఆగకుండా ఎదురుగా ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగివున్న టాటా మ్యాజిక్‌తో పాటు కూలీలను ఎక్కించుకుని వెళ్తున్న ట్రక్‌ ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా మ్యాజిక్‌లో ఉన్న ప్రయాణికుల్లో నాలుగురికి కూడా తీవ్రగాయాలు తగిలాయి. 
 
మద్యం మత్తు.. అతివేగం
కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడని, మితిమీరిన వేగంతో దూసుకొచ్చాడని  ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్‌ పరారుకాగా, కారులో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీరు కాకినాడలో జరిగిన జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ సమావేశానికి వెళ్ళివస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ కారు విజయవాడ ఆటోనగర్‌లో ఒక పాదరక్షల ఫ్యాక్టరీ నిర్వాహకులదని సమాచారం. ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. డ్రైవర్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement