విహారం..విషాదం | Excursion tragedy | Sakshi
Sakshi News home page

విహారం..విషాదం

Dec 5 2016 12:09 AM | Updated on Sep 4 2017 9:54 PM

విహారం విషాదం నింపింది. పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విందు.. వేదనను మిగిల్చింది.

- పెన్నా నదిలో మునిగిన ముగ్గురు యువకులు
- ఇద్దరిని కాపాడిన మరో యువకుడు
- ఒకరు గల్లంతు
- గల్లంతైన వ్యక్తి ఆదోని వాసి
 
చెన్నూరు : విహారం విషాదం నింపింది. పొట్టకూటి కోసం వలస వచ్చి బేల్దారి పని చేసుకుంటూ జీవించే వారికి విందు.. వేదనను మిగిల్చింది. పెన్నా నదిలో అందరూ చూస్తుండగానే ముగ్గురు మునిగిపోగా.. ఇద్దరిని ఓ యువకుడు కాపాడాడు. ఒకరు గల్లంతైన సంఘటన ఆదివారం చెన్నూరు సమీపంలోని కొండపేట వంతెన వద్ద చోటు చేసుకొంది. వారి బంధువులు, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచగేరి గ్రామానికి చెందిన వడ్డె రామయ్య కుమారుడు రాముడు అలియాస్‌ బజారి(25) బేల్దారి పని చేస్తూ జీవించే వాడు. అతని కుటుంబంతోపాటు అదే మండలానికి చెందిన కొందరు యువకులు కడప రవీంద్రనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని బేల్దారి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నూరులోని ఏటిగడ్డ వీధిలో మస్తాన్‌ ఇంటి నిర్మాణాన్ని అదే మండలానికి చెందిన 12 మంది యువకులు ఇటీవల పూర్తి చేశారు. వారికి ఆదివారం మధ్యాహ్నం మస్తాన్‌ విందు ఏర్పాటు చేశాడు. విందు అయ్యాక అందరూ కలిసి సరదాగా పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో రాముడుతోపాటు రంగేష్, సురేష్‌ అనే యువకులు నది లోపలికి వెళ్లడంతో కొట్టుకుపోతుండగా.. అక్కడే ఉన్న సురేష్‌కుమార్‌ ఇద్దరిని కాపాడాడు. రాముడును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. వేగంగా వస్తున్న జల ప్రవాహానికి మునిగిపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బందువులు సంఘటనా స్థలానికి చేరుకుకున్నారు. వారు తెలపడంతో పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇప్పుడు సాధ్యం కాదని, సోమవారం జాలర్లను పిలిపించి గాలింపు చర్యలు తిరిగి చేపడతామని ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ తెలిపారు.
రోదిస్తున్న బంధువులు, స్నేహితులు
గల్లంతైన రాముడుకి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోగా భార్య జానకి(22) ప్రస్తుతం గర్భవతి. ‘కూలి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు, అక్క, బంధువులు, స్నేహితులు నది వద్ద రోదించడం అందరిని కలిచి వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement