కుక్కకీ ఓ లెక్కుంది!
మున్సిపాలిటీలలో ఊరకుక్కల లెక్క తప్పనిసరి అయ్యింది. లెక్క తేల్చాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది.
	 పక్కాగా లెక్కలు తీయండి
	 సమగ్ర వివరాలివ్వాల్సిందే
	 సుప్రీంకోర్టు ఆదేశం
	 ప్రభుత్వంలో కదలిక
	 మున్సిపాలిటీలకు నోటీసులు
	 నెలాఖరులోగా నివేదికకు చర్యలు
	 సర్వేబాటన మున్సిపల్ అధికారులు
	 
	 సిద్దిపేట జోన్: మున్సిపాలిటీలలో ఊరకుక్కల లెక్క తప్పనిసరి అయ్యింది. లెక్క తేల్చాల్సిందేనంటూ సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ డెరైక్టరేట్ ముఖ్య అధికారి అనురాధ ఇటీవల జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాలకు కుక్కల సమగ్ర వివరాలను అందించాలని నోటీసులు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా సంబంధిత నివేదికను రాష్ట్ర డెరైక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు అందజేయాలని నోటీసుల్లో  పేర్కొన్నారు. దీంతో మున్సిపాలిటీల్లోని యంత్రాంగం సర్వేదిశగా సమాయత్తమవుతోంది.
	 
	 పట్టణాల్లో ఊరకుక్కల సంచారం, వాటి వల్ల ఉత్పన్నమవుతున్న ప్రమాదకర రేబిస్ వ్యాధిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఉన్నత న్యాయస్థానం కూడా ఆ దిశగా ఊరకుక్కల స్థితిగతులు, నివారణ చర్యలు, రేబిస్ వ్యాధి తదితర అంశాలను క్రోడీకరిస్తూ సమగ్ర వివరాలను నివేదిక రూపంలో న్యాయస్థానానికి అందజేయాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దీంతో రాష్ర్ట మున్సిపల్ అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. మున్సిపల్ రాష్ట్ర డెరైక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారి అనురాధ పేరిట గురువారం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకు సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని నోటీసులు జారీ అయ్యాయి.
	 
	 ఆయా పట్టణాల్లో  5 సంవత్సరాలుగా వీధి కుక్కల ద్వారా జరిగిన సంఘటనలు, రేబిస్ వ్యాధిపై నమోదైన కేసుల తీరుతెన్నులను, ప్రస్తుత స్థితిగతులను క్రోడికరించే నివేదికను ఫార్మట్ రూపంలో అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత వీధి కుక్కల వివరాలు, వాటిలో ప్రమాదకర కుక్కల పరిస్థితులను, మున్సిపల్ ద్వారా అనుమతి పొందిన లెసైన్స్‌డ్ పేట్ డాగ్‌ల వివరాలను కూడా నివేదికలో పొందుపర్చాలని ఆదేశాలిచ్చారు.  ఇదిలా ఉండగా మున్సిపల్ రాష్ట్రశాఖ ఆదేశాలతో గురువారం మున్సిపల్ కమిషనర్లు చర్యలకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్‌కు చెందిన శానిటేషన్ విభాగానికి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.  పశుసంవర్ధక శాఖ, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రవేట్ వైద్యుల సహాయ సహకారలతో నివేదిక రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
