కుక్కల కు.ని.కి డబ్బుల్లేవ్‌!

Increasing dogs in the state - Sakshi

రాష్ట్రంలో పెరిగిపోతున్న శునకాలు

మూడేళ్లలో కుటుంబ నియంత్రణ చేసింది 70 వేల కుక్కలకే 

వైద్యులు, ఆపరేషన్‌కు థియేటర్ల కొరత 

ఏటా 4.50 లక్షల మందికిపైగా కుక్కకాటు బాధితులు

రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి జనం మీద పడి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. చిన్నపిల్లల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇటీవల గుంటూరు నగరంలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడిచేసి ప్రాణాలు తీసిన ఘటన ఇంకా మనకళ్ల ముందు మెదులుతూనే ఉంది. వారం కిందట వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని ఓ స్కూలు నుంచి ఇంటికొస్తున్న ఏడుగురు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. ఇలాంటి ఘటనలు నిత్యం రాష్ట్రంలో కోకొల్లలు. అయితే వీటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు కూడా డబ్బుల్లేని దుర్భరస్థితిలో మున్సిపాల్టీలున్నాయి.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో 1,76,675 కుక్కలున్నట్టు మున్సిపాలిటీ అధికారులు నివేదిక ఇచ్చారు. కానీ గడిచిన మూడేళ్లలో కేవలం 75 వేల కుక్కలకు మాత్రమే కుటుంబ నియంత్రణ చేయగలిగారు. ఇంకా లక్షకు పైచిలుకు కుక్కలకు కుటుంబ నియంత్రణ చెయ్యలేదు. ఒక్కో కుక్క ఏడాదికి రెండు ఈతలు ఈనుతుంది. ఒక్కో ఈతకు సగటున రెండు నుంచి మూడు పిల్లల్ని కంటుంది. దీంతో కుక్కల సంఖ్య రెట్టింపవుతోంది. ఫలితంగా ఏటా కుక్క కాటు బాధితుల సంఖ్య 4.50 లక్షలకు చేరుతోంది.

వెయ్యి కుక్కలకు రూ.8 లక్షలు: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మొత్తం కలిపి 110 ఉన్నాయి. వీటిలో చాలా మున్సిపాలిటీలు నష్టాల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో కుక్కకు కుటుంబ నియంత్రణ చేయాలంటే రూ.800 ఖర్చవుతుందని మున్సిపల్‌ సిబ్బంది చెబుతున్నారు. ఉదాహరణకు ఒక మున్సిపాలిటీలో వెయ్యి కుక్కలుంటే వాటికి కుటుంబ నియంత్రణ చేయాలంటే రూ.8 లక్షలు వెచ్చించాలి. అంతపెద్ద మొత్తంలో తాము కుటుంబ నియంత్రణకు ఖర్చుచేసే పరిస్థితి లేదని ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు చెబుతున్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు వంటి పెద్ద పెద్ద కార్పొరేషన్లలోనే కుక్కల కుటుంబ నియంత్రణకు నిధుల్లేకపోవడం దారుణమైన విషయం. 

డాక్టర్లు.. ఆపరేషన్‌ థియేటర్లూ కరువే.. 
కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్లు, డాక్టర్ల కొరత కూడా వేధిస్తోంది. ఆపరేషన్‌ థియేటర్‌ ఉంటే డాక్టరుండడు. డాక్టరుంటే ఆపరేషన్‌ థియేటర్‌ ఉండదు. పైగా కుక్కకు కుటుంబ నియంత్రణ చేశాక ఓరోజంతా ఆస్పత్రిలోనే పరిశీలనలోనే ఉంచి, దానికి తగినంత ఆహారం అందించి మరుసటి రోజు వదిలేస్తారు. ఇవన్నీ చేసేందుకు కావాల్సిన వనరులు లేవని మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

లక్ష్యాలు బారెడు.. సాధించింది శూన్యం
కొన్ని కార్పొరేషన్లలో కుక్కలు భారీగా ఉండగా, కు.ని ఆపరేషన్లు చేసిందిమాత్రం అతి తక్కువే. ఉదాహరణకు అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలో 20,746 కుక్కలున్నాయని అంచనా వేయగా, అందులో కేవలం 10,269 కుక్కలకే ఆపరేషన్‌లు నిర్వహించారు. చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో 19,822 కుక్కలున్నట్లు గుర్తించగా.. వాటిలో 15 వేల కుక్కలకే కు.ని ఆపరేషన్లు చేశారు. ఇక మున్సిపాల్టీల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపుకాదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top