ఒంగోలు-నెల్లూరు జిల్లాల మధ్య హైవేపై మళ్లీ మధ్యప్రదేశ్ ముఠా కదలికలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం...
* హైవేపై డీజిల్ చోరీ
* తృటిలో బిట్రగుంట పోలీసుల నుంచి తప్పించుకున్న వైనం
బిట్రగుంట : ఒంగోలు-నెల్లూరు జిల్లాల మధ్య హైవేపై మళ్లీ మధ్యప్రదేశ్ ముఠా కదలికలు కనిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం చోరీలకు పాల్పడిన ముఠా ఇటీవల కాస్త తగ్గినా తాజాగా తిరిగి విజృంభించాలని చూస్తోంది. బోగోలు-తాళ్లూరు మార్గంలో మంగళవారం వేకువన అనుమానాస్పదంగా నిలిపి ఉన్న స్కార్పియో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా విషయం బయట పడింది. డీజిల్ దొంగతనాల కోసమే ప్రత్యేకంగా స్కార్పియో వాహనం, డీజిల్ క్యాన్లు, పైపులు ఏర్పాటు చేసుకోవడం గమనించి పోలీసులే అవాక్కయ్యారు.
ముఠాల తీరే వేరు
మధ్యప్రదేశ్‌లోని కుజనేర్, దుల్తారియా, దుబారియాకు చెందిన ముఠా సభ్యులు ఒంగోలు-నెల్లూరు-చెన్నైల మధ్య దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టర్బోలారీలు, వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కుజనేర్‌కు చెందిన పాత నేరస్థుడు షరీఫ్‌ఖాన్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన ముస్తాక్, దుల్తారియాకు చెందిన వీరం, దుబారియాకు చెందిన చందులూ గతంలో జిల్లాలో చోరీలకు పాల్పడ్డారు. గతంలో ఒంగోలు-నెల్లూరు మధ్య దోపిడీలకు పాల్పడ్డారు.
వ్యూహాత్మకంగా చోరీలు
ముఠా సభ్యులు చోరీల్లో కొత్త పంథా అమలు చేస్తున్నారు. దొంగతనాలకు అనువుగా ఉండేలా వాహనాలు ఏర్పాటు చేసుకుంటారు. టర్బోలారీలకు పైన టార్పాలిన్ పట్టతో గూడులా కట్టి లోపల డీజిల్ చోరీకి అవసరమైన ప్లాస్టిక్ క్యాన్లు, పైపులు ఏర్పాటు చేసుకుంటారు. కార్లకయితే సీట్లు తొలగించి డీజిల్ క్యాన్లు అమర్చుకుంటారు. హైవేపై రాత్రి వేళల్లో ఎక్కువ సంఖ్యలో లారీలు నిలిపి ఉండే ప్రాంతాలకు సమీపంలో తమ వాహనాలను నిలుపుతారు. ప్రత్యేక పరికరాలతో డీజిల్ ట్యాంకుల మూతలు తొలగిస్తారు. 35లీటర్ల క్యాను, పైపుల సాయంతో డీజిల్‌ను పీల్చి క్యాన్లు నింపుకుంటారు. అనంతరం తక్కువ ధరకు ఇతరులకు విక్రయిస్తారు.
డీజిల్ చోరీకి విఫలయత్నం
ఒంగోలు-నెల్లూరు జిల్లాల మధ్య హైవేపై కొందరు డీజిల్ చోరీకి రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో సినీ ఫక్కీలో పోలీసులు దాడులు చేయడంతో స్కార్పియో వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. బిట్రగుంట ఎస్సై వెంకట రమణ కథనం మేరకు.. బోగోలు నుంచి తాళ్ళూరు వెళ్ళే మార్గంలో వేకువన 2.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా నిలిపి ఉన్న స్కార్పియోను పీఎస్సై వెంకట రాజేష్ గుర్తించారు.
మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండటం, అర్థరాత్రి సమయంలో అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే ఎస్సైకు సమాచారం అందించారు. పోలీసుల రాకను గమనించిన వ్యక్తులు చీకట్లో చాకచక్యంగా తప్పించుకున్నారు. పోలీసులు గాలింపుల చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న స్కార్పియోలో డీజిల్ చోరీకి వినియోగించే 20కి పైగా క్యాన్లు, పైపులను గుర్తించి డీజిల్ దొంగలకు చెందిన వాహనంగా భావిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


