
బల్దియాలో సం’కుల’ సమరం
కరీంనగర్ నగరపాలక సంస్థ రాజకీయాల్లో సం’కుల’ సమరం జరుగుతోంది.
► పార్టీలకతీతంగా జట్టుకట్టిన దళిత కార్పొరేటర్లు
► అజమాయిషీలపై మూకుమ్మడి నిర్ణయం
► ఇతరుల జోక్యాన్ని అడ్డుకునేందుకు సిద్ధం
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థ రాజకీయాల్లో సం’కుల’ సమరం జరుగుతోంది. వివక్ష చూపుతున్నారంటూ నగరంలోని ఎనిమిది మంది దళిత కార్పొరేటర్లు జట్టుకట్టారు. ఈ మేరకు మంగళవారం దళిత కార్పొరేటర్లంతా సమావేశమై మూకుమ్మడిగా దళిత వ్యతిరేకతను అడ్డుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అరుుతే ఈ వ్యవహారం అధికార పార్టీలో చిచ్చుకు తెరలేపుతోంది. నగరపాలక సంస్థలో పాలకవర్గం కొలువుదీరిన నాటినుంచి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. ఏడాదిన్నర క్రితం ఎస్సీ సబ్‌ప్లాన్ పనులను ఎస్సీ జనాభాలేని డివిజన్లలో పెట్టడంపై భగ్గుమన్నారు. కౌన్సిల్ సమావేశంలో రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత అభివృద్ధి పనుల కమీషన్ల పంపకాలు బల్దియా పరువును బజారున పడేశారుు. ఇప్పుడిప్పుడే వివాదాల నుంచి బయటపడుతున్న సమయంలో మరో కొత్త సమస్య పుట్టుకొచ్చింది. ఏకంగా కులవివక్ష కొనసాగుతోందంటూ దళిత కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం ఆలోచనలో పడేస్తోంది. ఒకరి డివిజన్లలో వేరొకరు అజమారుుషీ చేస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటూ రచ్చకెక్కుతున్నారనే ఆరోపణలున్నారుు.
అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలు, దైవ సంబంధిత కార్యక్రమాల్లో దళిత కార్పొరేటర్లపై వివక్ష ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కార్పొరేటర్ తమ డివిజన్ ప్రజలకు నీటి సరఫరా జరగకుండా అడ్డుకుంటున్నారని మరో కార్పొరేటర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్‌లకు ఫిర్యాదు చేశారు. గతంలో ఒకరి డివిజన్‌లో మరొకరు తలదూర్చడంతో కౌన్సిల్‌లో రచ్చరచ్చ అరుుంది. ఈ క్రమంలోనే ఓ మహిళా కార్పొరేటర్ చెప్పులేపడం సంచలనంగా మారిన విషయం విదిత మే. మరో సంఘటనలో పక్కపక్కనే ఉన్న ఇరువురు కార్పొరేటర్ల గొడవ పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది. అన్ని సద్దుమణినట్లు భావిస్తున్న తరుణంలో దళిత కార్పొరేటర్లంతా పార్టీలకతీతం గా జట్టు కట్టడంతో అందరి దృష్టి కులవివక్ష వైపు మళ్లింది. ఈ క్రమంలో మి గతా కార్పొరేటర్లు అజమారుుషీ ప్రదర్శిస్తుండడంతో దళిత కార్పొరేటర్లు ఒకింత అవమానానికి గురవుతున్నట్లు తెలిసింది. దళిత కార్పొరేటర్లు గల డివి జన్లలో అభివృద్ధి పనులు, ప్రజల మౌలిక సదుపాయాల కల్పనలోనూ జోక్యం చేసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మదనపడుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే దళిత కార్పొరేటర్లు సమావేశమై తమ డివిజన్ల లో ఇతర కార్పొరేటర్ల అజమారుుషీని అడ్డుకునేందుకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఆరుగురు, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన ఒక్కో కార్పొరేటర్ ఇందులో ఉన్నారు. ఈ వ్యవహారం గత కొన్ని నెలలుగా బల్దియా రాజకీయాల్లో చిలికి చిలికి గాలివానగా మారింది. ఇది ఎటు దారితీస్తుందోనని కార్పొరేషన్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.