నేత్రపర్వం.. నరసన్న తెప్పోత్సవం

నేత్రపర్వం.. నరసన్న తెప్పోత్సవం

హంస వాహనంపై దేవేరులతో స్వామివారి విహారం

అంతర్వేది(సఖినేటిపల్లి) : శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు శనివారం స్థానిక మంచినీటి చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు ఆలయం వద్ద నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై ఊరేగింపుగా చెరువు వద్దకు అర్చకులు, భక్తులు తీసుకువచ్చారు. తెప్పోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు బుచ్చిబాబు చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. పుష్పకవాహనంపై కొలువుదీరిన స్వామిని వేదమంత్రాలతో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, భక్తుల గోవింద నామస్మరణలతో తెప్పపైకి అధిరోహింపజేశారు. ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు  కొబ్బరి కాయలు కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన బాణాసంచా కాల్పులు భక్తులను అలరించాయి. 

వెన్నెల, దీప కాంతుల నడుమ భీమేశ్వరుని తెప్పోత్సవం

ద్రాక్షారామ (రామచంద్రపురం):  శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణలో గల సప్తగోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దివి నుంచి చంద్రుని పున్నమి వెన్నెల... భువి నుంచి రంగు రంగుల విద్యుత్‌దీప కాంతుల నడుమ సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేకంగా అలకరించిన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తోడ్కొని వచ్చి విద్యుత్‌ దీపాలతో ఆలకరించిన హంసవానంలో ఉంచి పూజలు నిర్వహించారు. మూడు సార్లు నదిలో తెప్పోత్సవం జరిపారు. ఈఓ పెండ్యాల వెంకటచలపతిరావు, వేగాయమ్మపేట జమీందారు వాడ్రేవు సుందర రత్నాకర్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top