అదనపు అక్రమం | Additional illegal | Sakshi
Sakshi News home page

అదనపు అక్రమం

Feb 14 2017 10:41 PM | Updated on Sep 5 2017 3:43 AM

అదనపు అక్రమం

అదనపు అక్రమం

విశాఖ నగరంలోని కీలకమైన దొండపర్తి ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వెళ్లే ప్లై ఓవర్‌ మొదటి

ప్రధాన మార్గంలో సెట్‌ బ్యాక్‌ వదలకుండానే భవన నిర్మాణం
పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
పైగా రోడ్డు విస్తరణలో స్థలం పోతుందంటూ ఉదారత
భవన యజమానికి టీడీఆర్‌ బోనస్‌ మంజూరు
ఆ దన్నుతో పక్క స్థలం కబ్జాకు తెగిస్తున్న యజమాని
వారిపై బెదిరింపులు, దాడులు.. ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం


అదో అక్రమ కట్టడం.. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నా.. ఒక్క ఇంచీ అయినా సెట్‌బ్యాక్‌ స్థలం వదలకుండానే పక్కా భవంతి నిర్మించేశారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం.. ఘనత వహించిన జీవీఎంసీ అధికారులు రోడ్డు విస్తరణలో ఆ భవనానికి చెందిన కొంత స్థలం పోతుందని నిర్థారించిన సమయంలోనైనా ఈ అక్రమాన్ని గుర్తించలేదో.. లేక గుర్తించనట్లు నటిస్తున్నారో తెలీదు గానీ..
విస్తరణలో పోయే స్థలానికి బదులుగా అదనపు అంతస్తు నిర్మాణానికి ఉదారంగా అనుమతి ఇచ్చేశారు.. కానీ సదరు భవన యజమాని విస్తరణకు స్థలాన్ని ఇవ్వకపోగా.. పక్కనున్న స్థలాలపైనా కన్నేశాడు..   వారిని ఖాళీ చేయించేందుకు బెదిరింపులు, దాడులకు
తెగబడుతున్నాడు..  


విశాఖపట్నం : విశాఖ నగరంలోని కీలకమైన దొండపర్తి ప్రాంతంలో రైల్వే స్టేషన్‌ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు వెళ్లే ప్లై ఓవర్‌ మొదటి కాలమ్‌ వద్ద ప్రధాన రహదారిని ఆనుకుని ఓ జి ప్లస్‌ టు భవనం ఉంది. ఫర్నిచర్‌ వ్యాపారం నిర్వహిస్తున్న నవీన్‌ మరోడా దాని యజమాని. బహుళ అంతస్తుల భవనాలు.. అదీ రహదారిని ఆనుకొని నిర్మించేవాటికి నిబంధనల ప్రకారం రోడ్డు నుంచి కొంత స్థలానికి సెట్‌బ్యాక్‌గా వదిలిపెట్టాలి. కానీ ఈ భవన నిర్మాణ విషయంలో ఆ నిబంధనను అసలు పట్టించుకోలేదు. ఫ్లై ఓవర్‌కు ఇరువైపులా 150 అడుగుల రహదారి ఉంది. ఆ ప్రకారం కనీసం పందొమ్మిదిన్నర అడుగుల సెట్‌ బ్యాక్‌ స్థలం వదిలి భవనాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. రహదారికి ఆనించి నిర్మాణం కానిచ్చేశారు. అయినా అధికారులెవరూ పట్టించుకోలేదు.  

విస్తరణ సమయంలోనూ విస్మరణ
నిర్మాణ సమయంలో పట్టించుకోని అధికారులు ఈ మార్గంలో ఫ్లై ఓవర్‌ నిర్మాణం, రోడ్డు విస్తరణ సమయంలోనైనా ఈ అక్రమాన్ని పట్టించుకోలేదు. పైగా రోడ్డు విస్తరణ కొలతలు వేసినప్పుడు ఈ భవనానికి చెందిన 334 గజాల ఈ స్థలంలో  కొంత పోతుందని నిర్థారించారు. దానికి బదులుగా 30 గజాల స్థలానికి ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్‌ (టీడీఆర్‌)ను భవన యజమానికి ఉదారంగా ఇచ్చేశారు. ఆ హక్కుతోనే తాను సెట్‌ బ్యాక్‌ స్థలంతో కలిపి భవన నిర్మాణం చేపట్టానని యజమాని వాదిస్తున్నారు. కానీ టీడీఆర్‌ పొందిన వారు అదనపు అంతస్తు మాత్రమే వేసుకోవాలి గానీ.. సెట్‌బ్యాక్‌ స్థలాన్ని మింగేయడానికి కాదు. మరోవైపు రహదారి విస్తరణలో స్థలం కోల్పోతున్నందునే టీడీఆర్‌ ఇచ్చామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఆ స్థలం కూడా ఇవ్వకుండానే టీడీఆర్‌ను వినియోగించుకుంటున్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తులపై మరో అంతస్తుకు జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేసినట్లే. దీని వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జీవీఎంసీ అధికారులు తనకు అనుకూలంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని తమ స్థలాన్ని ఆక్రమించేందుకు నవీన్‌ మరోడా ప్రయత్నిస్తున్నారంటూ పక్కనే నివాసం ఉంటున్నవారు ఆరోపిస్తున్నారు. స్థలాన్ని తనకు అప్పగించాలంటూ బెదిరింపులకు, దాడులకు సైతం పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement