సాక్షి, భువనేశ్వర్: ఎన్నో ఊహలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆ మహిళకు నరకమంటే ఏంటో చూపించారు. భర్త పొట్టకూటి కోసం విదేశం వెళ్లగా సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన అత్తామామలే ఆమెపాలిట యముడిలా తయారయ్యారు. అదనపు కట్నం తేలేదన్న కోపంతో కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ అమానుష ఘటన శనివారం ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాలోని కేండ్రపారా జిల్లాకు చెందిన మహిళకు 2018లో వివాహం జరిగింది. బతుకు దెరువు కోసం ఆమె భర్త ఒమన్ వెళ్లి అక్కడ ప్లంబర్‌గా ఉద్యోగం చేస్తుండగా, ఈ వివాహిత అత్తగారింట్లో ఉంటోంది. ఈ క్రమంలో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు సరిపోలేదంటూ అత్తింటివారు ఆమెను వేధించుకు తినడం మొదలు పెట్టారు. (నటి రమ్యకు వరకట్న వేధింపులు)
దీనికి తోడు భర్త తల్లిదండ్రులతో పాటు అతని ఇద్దరు సోదరీమణులు కూడా కట్నం తీసుకురావాలని ఆమెతో తరచూ గొడవపడేవారు. ఎంతకూ ఆమె వరకట్నం తీసుకురావడం లేదని ఆగ్రహం చెందిన అత్తింటివారు సోమవారం ఆమెను మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగులబెట్టారు. దీంతో ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని, కటక్‌లోని ఆసుపత్రికి తరలించారు. 60 శాతం గాయాలతో పడి ఉన్న ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త మరో సోదరి, ఆమె భర్త పరారీలో ఉన్నారు.


