‘చింతమనేని’ ఇంటికి బయలుదేరిన యువతుల అదృశ్యం

Two Young Women Missing At Gunadala In Vijayawada - Sakshi

వారమైనా తెలియని ఆచూకీ

కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, గుణదల (విజయవాడ తూర్పు) : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తమకు సహాయం చేస్తాడంటూ వెళ్లిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వారం రోజులైనా వారి ఆచూకీ తెలియకపోవడంతో విషయం నగరవ్యాప్తంగా సంచలనమైంది. బాధితురాలైన తల్లి కోట జ్యోతి తెలిపిన వివరాల మేరకు.. గుణదల గంగిరెద్దుల దిబ్బకొండ ప్రాంతానికి చెందిన కోట జ్యోతి కొన్ని నెలలుగా ఇక్కడి ఓ ఇంట్లో తన ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటోంది. భర్త కోట రాము(42) పదేళ్ల క్రితమే మనస్పర్థల కారణంగా కుటుంబాన్ని విడిచి వెళ్లిపోయాడు.

పెద్ద కుమార్తె కోట గాయత్రి (19) ఎనికేపాడులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిప్లమో మూడో సంవత్సరం చదువుతోంది. రెండవ కుమార్తె కోట సోనియా (18) గూడవల్లిలోని మరో ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. జ్యోతి కూలి పని చేసుకుని పిల్లల్ని చదివిస్తుంది. కొంతకాలంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న తల్లికి సాయం చేసే దిశగా వీరిద్దరూ పనులకు వెళుతున్నారు. ఈ యువతుల బంధువులు పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో ఉండటంతో వారి సహాయంతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 4న ఉదయం 10 గంటలకు బయలుదేరి వెళ్లిన యువతులు ఇప్పటి వరకూ తిరిరాలేదు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో ఎంత ఆరా తీసినా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో జ్యోతి ఆదివారం రాత్రి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బొండా ఉమ అనుచరులపై అనుమానం..
గతేడాదిలో ఈ కుటుంబం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఉండేది. ఆ సమయంలో తమ పరిస్థితి చెప్పుకునే నిమిత్తం ఇద్దరు యువతులు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును కలిశారు. అదే సమయంలో కొంత మంది అనుచరులు చిన్న కుమార్తె సోనియాపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు యువకులను అరెస్ట్‌ చేశారు. గతేడాది జూలైలో జరిగిన ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై నగరంలో తిరుగుతున్నారు. ఈ యువతులపై కక్ష సాధింపు చర్యగా కిడ్నాప్‌ చేసి ఉంటారని తల్లి జ్యోతి అనుమానం వ్యక్తం చేస్తోంది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top