ఏసీబీకి చిక్కిన మరో అవినీతి చేప

Tribal welfare officer Demand Bribe And Acb Attack - Sakshi

ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో అవినీతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. గురువారం ఆర్‌ అండ్‌ బీ అధికారి రూ.5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా.. శుక్రవారం సహాయ గిరిజన సంక్షేమ అధికారి  రూ.4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీవలలో చిక్కాడు.

అనంతపురం టౌన్‌ : ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. కులాంతర వివాహం చేసుకున్న దంపతులకు పోత్సాహక నగదు అందివ్వడానికి అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ నాగభూషణం లంచం డిమాండ్‌ చేశారు. 2015 సంవత్సరం నుంచి విసిగివేసారిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాల మేరకు.... గిరిజన సంక్షేమశాఖలో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ. 50 వేలను ప్రోత్సాహకంగా అందిస్తోంది. రాయదుర్గం మండల కేంద్రానికి చెందిన అజ్మత్‌ (ముస్లిం), అనసూయ(గిరిజన) దంపతులు 2015లో కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రభుత్వ పోత్సాహకం నగదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రూ. 5 వేలు లంచం ఇస్తే పని పూర్తి చేస్తానని నాగభూషణం తేల్చిచెప్పాడు. పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి రూ.4 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.  అయితే బాధితుడు ఏసీబీనీ ఆశ్రయించడంతో శుక్రవారం 1.20 గంటల సమయంలో లంచం తీసుకుంటూ నాగభూషణం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ దాడిలో సీఐలు ప్రతాప్‌రెడ్డి, చక్రవర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top