దొంగలు.. బాబోయ్‌ దొంగలు...

Thieves Arrested In Khammam - Sakshi

దొంగలు.. బాబోయ్‌ దొంగలు...ఖమ్మంఅర్బన్‌: నగరంలోని  ఖానాపురంహవేలి పోలీసు స్టేషన్‌ కూత వేటు దూరంలో శనివారం అర్ధరాత్రి మూడు ఇళ్లలో దొంగలు  చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. 10వ డివిజన్‌లోని 5 నంబర్‌ వీధిలో మిర్యాలగూడెం కోర్టులో విధులు నిర్వహించే జ్యోతి ఇంటి వెనుక తలుపులు తొలగించి ఇంట్లోకి జొరబడి బీరువాలోని బంగారపు ఆభరణాలు, ఒక టీవీని చోరీ చేశారు. జ్యోతి శనివారం ఉదయం తాళం వేసి ఊరికి వెళ్లి రాత్రి 2 గంటల ప్రాంతంలో  వచ్చేసరికి చోరీ జరిగింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 20 తులాలకు పైగానే బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు బాధితులు చెబుతున్నారు. పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు ఇంట్లో కూడా తాళం పగలు గొట్టి చోరీకి ప్రయత్నించారు. విలువైన వస్తువులు ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు తమవెంట తీసుకెళ్లడంతో దొంగలకు ఏమీ దొరకలేదు. అదే కాలనీలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి బావమర్ది బాపిరెడ్డి  ఇంట్లో కూడా చోరీ జరిగింది. బాపిరెడ్డి ఇంటికి తాళం వేసి శనివారం హైదరాబాద్‌ వెళ్లారు. ఇంటి ఎదుట తలుపును తెరిచి ఇంట్లో ఉన్న టీవీ, వరండాలో ఉన్న కొత్త స్కూటీని ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇంట్లో సెల్ప్‌లోని బట్టలన్నీ చిందరవందరంగా పడేశారు. వాటిలో ఏమైనా విలువైన బంగారం, నగదు చోరీ  అయిందా అనేది బాపిరెడ్డి వస్తే గాని తెలియదు. ఖమ్మం రూరల్‌ ఏసీపీ రామోజీ రమేష్‌ సందర్శించి విచారణ చేశారు. ఆయన వెంట అర్బన్‌ సీఐ సాయిరమణ, సిబ్బంది ఉన్నారు. ఒకే తరహాలో చోరీలు జరగడం, దాంతో టీవీలను చోరీ చేయడం, కొన్ని రోజులు క్రితం ఇదే స్టేషన్‌ పరిధిలో కూడా టీవీ చోరీ కావడంతో ఇవన్నీ ఒకే బ్యాచ్‌ పని అయి ఉంటుందని భావిస్తున్నారు. చోరీల ఘటనపై అర్బన్‌ పోలీసులతో పాటు, సీసీఎస్‌ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆరా తీస్తున్నారు.  పాత నేరస్తుల జాబితాలో ఉన్న ముగ్గురిని  అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. మూడు ఇళ్లలో చోరీలపై వేలి ముద్రల సేకరణకు క్లూస్‌ టీం బృందం ఆధారాలను సేకరించింది. అదే ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లకు అమర్చిన సీసీ కెమెరాల్లో ఏమైనా సమాచారం లభిస్తుందా అని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు అతి సమీపంలో ఒకే రోజు రాత్రి మూడు గృహాల్లో చోరీలు జరగడంతో పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
 శనివారం రోజే సీపీ తఫ్సీల్‌ ఇక్బాల్‌  పోలీసులతో సమావేశం ఏర్పాటు చేసి చోరీలపై సమీక్షించి పాత కేసులన్నీ పరిష్కరించాలని, చోరీల నియంత్రణలో గస్తీ పెంచాలని చెప్పిన రాత్రే చోరీలు జరగడం విశేషం.  
తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌.. 
తాళం వేసిన ఇళ్లను కొన్ని మాసాలుగా దొంగల ముటా టార్గెట్‌ చేసింది. తాళం వేసినట్లు గుర్తించి ఇంటి ముందు, ఇంటి వెనుక నుంచి తలుపులు తొలగించి చోరీలకు పాల్పడుతున్నారు. పట్టపగలు కూడా చోరీలు జరుగుతుండటంతో పోలీసులకు సవాల్‌గా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top