వజ్రాల వ్యాపారి కళ్లుగప్పి రంగురాయితో పరారీ

Thief Cheat to Diamond merchant With Colour Stone - Sakshi

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

బంజారాహిల్స్‌: అరుదైన, ఖరీదైన ఎమరాల్డ్‌ స్టోన్‌ను అమ్మిస్తానంటూ వజ్రాల వ్యాపారి కళ్లుగప్పి రంగురాయితో సహా పరారైన ముగ్గురు వ్యక్తులను బంజారాహిల్స్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌.శ్రీనివాస్‌ బంజారాహిల్స్‌ ఏసీపీ కే.ఎస్‌.రావు, ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ రామిరెడ్డితో కలిసి  వివరాలు వెల్లడించారు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి జునైద్‌ తన వద్ద ఉన్న 111 క్యారెట్‌ ఎమరాల్డ్‌ స్టోన్‌ను విక్రయించేందుకు అదే ప్రాంతానికి చెందిన బ్రోకర్‌ ప్రకాష్‌ను సంప్రదించాడు. సుమారు రూ. 25 లక్షల విలువైన ఈ అరుదైన వజ్రాన్ని హైదరాబాద్‌లో లాభంతో విక్రయించవచ్చని అక్కడ తమకు తెలిసినవాళ్లు ఉన్నారంటూ నర్సింహరావు అలియాస్‌ సంపత్, సురేష్‌కుమార్‌లను పరిచయం చేశారు. గత నెల 30న జునైద్‌ వజ్రాన్ని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చి సురేష్‌ను కలిశాడు.

ల్యాబ్‌టెస్ట్‌ తర్వాతే తీసుకుంటానని సురేష్‌ చెప్పడంతో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 8లోని గోల్కొండ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైమండ్స్‌ ల్యాబ్‌కు తీసుకెళ్లారు. వజ్రాన్ని జునైద్‌ నుంచి తీసుకొని ల్యాబ్‌లోపలికి వెళ్లారు. పథకం ప్రకారం వైజాగ్‌కు చెందిన సంపత్, సురేష్‌ లోనికి వెళ్లి టెస్ట్‌లు చేస్తున్నట్లు నటిస్తూ గందరగోళం సృష్టించి పక్క గేటు నుంచి బయటకు ఉడాయించారు. అప్పటికే అక్కడ కారులో సిద్ధంగా ఉన్న రాంబాబు సంపత్, సురేష్‌లను ఎక్కించుకొని వజ్రంతో సహా పరారయ్యారు. బాధితుడు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితులను అరెస్ట్‌ చేస్తున్న సమయంలో సంపత్‌ తన వద్ద ఉన్న తుపాకీని పోలీసులపైకి ఎక్కిపెట్టి బెదిరింపులకు పాల్పడటంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి  కంట్రీమేడ్‌ తుపాకీ, పది బుల్లెట్లు, గ్రీన్‌ కలర్‌ ఎమరాల్డ్‌ స్టోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సంపత్, రాంబాబు, సురేష్‌లపై ఐపీసీ సెక్షన్‌ 406, 420 కింద, సురేష్‌పై అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top