‘పది’లో ఫస్ట్‌ వస్తానంటివే..!

SSC Student Died In Auto Accident In Kamalapuram - Sakshi

సాక్షి, కమలాపురం: కమలాపురం–లేటపల్లె ప్రధాన రహదారిలో నసంతపురం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్ష రాయడానికి వెళ్తున్న విద్యార్థి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యుల రోదనతో ఆసుపత్రి ఆవరణం దద్దరిల్లింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రబల్లె కొత్తపల్లెకు చెందిన విద్యార్థి అలిదెన విష్ణువర్ధన్‌ రెడ్డి(15) చిన్నచెప్పలి హైస్కూల్‌లో పదవతరగతి చదువు తున్నాడు.  రోజూ అదే గ్రామానికి చెందిన మరి కొంత మంది విద్యార్థులతో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్తాడు. పదవ తరగతి పరీక్షలు కమలాపురంలో బాలికల హైస్కూల్‌ పరీక్ష కేంద్రంలో రాస్తున్నాడు. రోజులాగే మంగళవారం కూడా ఇతర విద్యార్థులతో కలిసి పరీక్ష రాయడానికి ఆటోలో బయలు దేరి వెళ్లాడు. అయితే ఆ ఆటో మార్గ మధ్యలో నసంతపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీ కొంది.

 ప్రమాదంలో విష్ణువర్ధన్‌రెడ్డి కుడి కాలువ విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటీన చికిత్స నిమిత్తం మరో ఆటోలో కమలాపురం తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి విష్ణువర్ధన్‌ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అలాగే ఈ ఘటనలో 6వ తరగతి చదువుతున్న నవ్య శ్రీ,, 4వ తరగతి చదువుతున్న వెంకట కిషోర్‌తో పాటు ఆటో డ్రైవర్‌ సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం రిమ్స్‌కు రెఫర్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

ఎవరు బాధ్యత వహిస్తారు
రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తూ విద్యార్థి విష్ణు వర్ధన్‌ రెడ్డి మృతి చెందడం దారుణం అని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి, సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, రాజోలి వీరారెడ్డి తెలిపారు. మంగళవారం కమలాపురం ఆసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని వారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక పోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. ప్రజల సేవ కోసం బస్సులు ఏర్పాటు చేస్తే నష్టం వస్తోందని ఆర్టీసీ వారు సర్వీసులను తొలగించడం అన్యాయం అన్నారు. ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అధికారులా? లేక ఆర్టీసీనా? అని  ప్రశ్నించారు. మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top