
శంషాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో సంస్థలో అరకొరగా ఉన్న తనిఖీలను ఆసరాగా చేసుకున్న ఆరుగురు యువకులు తాము పనిచేసే సంస్థకే కన్నం వేశారు. రూ. 4 లక్షల విలువైన వస్తులను చోరీ చేశారు. ఈమేరకు పోలీసులు నిందితులను రిమాండుకు తరలించారు. వివరాలు.. నగరంలోని సైదాబాద్‌కు చెందిన బొట్టు సాయికుమార్(20), మల్కాజ్‌గిరి బొడుప్పల్‌కు చెందిన తక్కలపల్లి ప్రణవ్(20), నందిగామకు చెందిన సంటి ఆనంద్(21), సరూర్‌నగర్‌కు చెందిన పడమటి మహేష్(24) నాగర్‌కర్నూల్ నివాసి చింత కార్తీక్(22), షాద్‌నగర్ ఫరూఖ్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్(23) స్నేహితులు, వీరు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అమెజాన్ గోదాంలో వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
నిందితులను చూపిస్తున్న పోలీసులు
కోవిడ్ –19 నేపథ్యంలో కొన్నినెలలుగా సంస్థలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించడం లేదు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆరుగురు స్నేహితులు కలిసి వేర్వేరు సమయాల్లో గోదాంలోని రూ. 4 లక్షలు విలువైన ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, బ్లూటూత్, గడియారాలు తస్కరించారు. గోదాంలో ఉన్న వస్తువులు మాయం కావడంతో అప్రమత్తమైన యజమాన్యం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాలలో ఉన్న పుటేజీని పరిశీలించారు. ఆరుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి నాలుగు లక్షల విలువ చేసే చోరి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.