లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్‌ సెంటర్‌ సీజ్‌

Siege of Scanning Center which performs gender confirmation tests - Sakshi

పీసీపీఎన్‌డీటీ కమిటీకి అడ్డంగా దొరికిన పీలేరు వైద్యుడు  

పీలేరు (చిత్తూరు):  చిత్తూరు జిల్లా పీలేరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆస్పత్రిని పీసీపీఎన్‌డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం) కమిటీ మంగళవారం సీజ్‌ చేసింది. కమిటీ సభ్యురాలు డాక్టర్‌ రమాదేవి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన హైరిస్క్‌ మానిటరింగ్‌ టీమ్‌ నుంచి తమకు అందిన సమాచారం మేరకు అగ్రహారానికి చెందిన కవిత (వివాహిత) గర్భస్రావంతో తిరుపతి రుయాలో చేరిందన్నారు. ఈ మహిళ కుటుంబసభ్యులను విచారించగా పీలేరు నోబుల్‌ నర్సింగ్‌ హోమ్‌లో చికిత్స నిమిత్తం అడ్మిట్‌ అయ్యామని, అక్కడ డాక్టర్‌ గాలేటి బాషా తమకు గర్భవిచ్ఛిత్తి నిమిత్తం చేసిన చికిత్స ఫలితంగా ఆరోగ్యం విషమించడంతో ఇక్కడికి పంపారని తెలిపారన్నారు.

పీసీపీఎన్‌డీటీ కమిటీ సభ్యురాలు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పూజారి లోకవర్ధన్‌ ఆధ్వర్యంలో సాధారణ విచారణ నిమిత్తం పీలేరులోని నోబుల్‌ నర్శింగ్‌ హోమ్‌కు వచ్చారు. అక్కడ తమ ఎదుటే పీలేరుకు చెందిన మస్తాన్‌ భార్య సునీర్‌ (27)అనే మహిళకు స్కానింగ్‌ చేసి లింగనిర్ధారణ పరీక్షలు పూర్తి చేసుకుందని, గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు వారికి తెలియజేయడం తమ కళ్లెదుటే జరిగిందన్నారు. దీంతో తాము వచ్చిన విచారణకు తోడు ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక మర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పీలేరు తహసీల్దారు నేతృత్వంలో నర్శింగ్‌ హోమ్‌లో నిర్వహిస్తున్న స్కానింగ్‌ సెంటరును సీజ్‌ చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం అక్కడి డాక్టర్‌ గాలేటి బాషాపై చర్యలుంటాయని వివరించారు. నర్శింగ్‌ హోమ్‌ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తేలిందన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top