
హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో ‘సాక్షి’విలేకరి దుర్మరణం చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ ప్రాంతానికి చెందిన బాల మైసయ్య(40) శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో బోరబండ–హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. దీంతో బాల మైసయ్య దుర్మరణం చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మైసయ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు బాల మైసయ్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రం ‘సాక్షి’విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వరూప, కుమారులు వసంత్(10), రిషిత్(7) ఉన్నారు. శనివారం మంచిర్యాలలో జరిగే తన అక్క కుమార్తె వివాహానికి హైదరాబాద్‌లో ఉండే బంధువులను తీసుకెళ్లేందుకు వచ్చి మృత్యువాతపడ్డారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.